ఎడారిలో సరస్సుల దారి!

అనగనగా ఓ ఎడారుంది... అక్కడ ఇసుక మాత్రమే ఉండదు... గమ్మత్తయిన విషయమొకటుంది... ఇంతకీ ఏమిటది? ఏంటి దాని ప్రత్యేకత? తెలుసుకుందాం రండి! ఎడారి అంటే చూసినంత మేర ఇసుక తిన్నెలు... మధ్య మధ్యలో ఒంటెల సవారీలు... ఇవే మనకు గుర్తొస్తాయి. ఎక్కడో ఓ నీటి చెలిమ కనిపిస్తేనే అంతా ఆశ్చర్యంగా చూస్తారు దాన్ని. అయితే ఇందుకు భిన్నంగా, చిత్రంగా ఓ ఎడారి ఉంది. దాని పేరు బదైన్‌ జరాన్‌. బోలెడు సరస్సులున్న ఎడారి ఇది....

Published : 27 Dec 2017 01:48 IST

ఎడారిలో సరస్సుల దారి!

అనగనగా ఓ ఎడారుంది... అక్కడ ఇసుక మాత్రమే ఉండదు... గమ్మత్తయిన విషయమొకటుంది... ఇంతకీ ఏమిటది? ఏంటి దాని ప్రత్యేకత? తెలుసుకుందాం రండి!

డారి అంటే చూసినంత మేర ఇసుక తిన్నెలు... మధ్య మధ్యలో ఒంటెల సవారీలు... ఇవే మనకు గుర్తొస్తాయి. ఎక్కడో ఓ నీటి చెలిమ కనిపిస్తేనే అంతా ఆశ్చర్యంగా చూస్తారు దాన్ని. అయితే ఇందుకు భిన్నంగా, చిత్రంగా ఓ ఎడారి ఉంది. దాని పేరు బదైన్‌ జరాన్‌. బోలెడు సరస్సులున్న ఎడారి ఇది.
* అంతెత్తున ఉన్న ఇసుక తిన్నెల నీడ... స్వచ్ఛంగా ఉన్న నీటిలో ప్రతిబింబిస్తుంటుంది. సరస్సు ఒడ్డన ఎడారి మధ్యలో పచ్చని గడ్డి చిగురిస్తూ అలరిస్తుంది. అక్కడ చెట్లు ఏపుగా ఎదిగి చల్లని గాలినిస్తాయి. ఇందంతా ఏ ఎడారిలోనూ మనం ­హించలేం. అయితే ఈ బదైన్‌ జరాన్‌లో మాత్రం ఇలాంటి దృశ్యాలు కనువిందు చేస్తాయి.
* ఇందుకు కారణం ఇక్కడున్న 140కిపైగా సరస్సులు. వీటిల్లో ఎప్పుడూ నీళ్లుంటాయి. కొన్ని సార్లు నీరుండి కొన్నిసార్లు ఎండిపోయే సరస్సులూ ఇంకా చాలానే ఉన్నాయిక్కడ.

* ఈ చిత్రమైన ఎడారి చైనాలోని గాన్సు, నింగ్సియా ప్రావిన్సుల నుంచి మంగోలియా వరకు 49,000 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. చైనాలో అయితే 19,000 చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉంది. ఇక్కడున్న మూడో అతి పెద్ద ఎడారి ఇది.
* ఇక్కడ చాలా ఎత్తున్న ఇసుక మేటలు ఉంటాయి. అవి దాదాపుగా 500 మీటర్ల ఎత్తు వరకూ ఉంటాయి. ఇంత ఎత్తునున్న ఇసుక మేటలపై మంచు కూడా పట్టేస్తుందట. సముద్రమట్టానికి చాలా ఎత్తులో ఉండటం వల్లే ఇలా మంచు పడుతుంది. ఇక్కడ బోలెడు సరస్సులు ఉండటానికి ఓ రకంగా వీటిపై పట్టిన మంచు కరగడమూ కారణమేనట. రెండు ఎత్తయిన ఇసుక దిబ్బల మధ్యలో ఉన్న లోయల్లో ఈ సరస్సులు ఎక్కువగా కనిపిస్తుంటాయి.
* ఇక్కడ ఇసుక తిన్నెల కింద నీటి బుగ్గలు ఉన్నాయని అవి భూగర్భంలో ఉన్న కంకర నిక్షేపాల మీదుగా ప్రవహిస్తుంటాయని కొందరి వాదన. వాటి ప్రవాహానికి లోపల ఆటంకం ఏర్పడినప్పుడు ఇలా బయటికి పొంగుకొచ్చి సరస్సులు పుట్టుకొచ్చాయని చెబుతారు. అయితే ఇన్ని సరస్సులు ఎడారిలో ఎలా పుట్టుకొచ్చాయన్న విషయంపై శాస్త్రీయమైన కారణం ఇంకా ఏమీ తెలియలేదు.

* శాటిలైట్‌ మ్యాప్‌ల్లోనూ ఇక్కడున్న సరస్సులన్నీ చక్కగా కనిపిస్తుంటాయి.
* వీటి పక్కల్నే ఈ ఎడారిలో అక్కడక్కడా కొన్ని జనావాసాలుంటాయి. వాళ్లు ఈ నీటిని ఎక్కువగా వాడేయడంతో ఇప్పుడు కొన్నిసరస్సులు పూర్తిగా కనుమరుగవుతూవస్తున్నాయట.
* ఈ ఎడారిలో ప్రయాణించాలంటే ఇక్కడి వారు ఎక్కువగా ఒంటెలు, గుర్రాల్ని వాడతారు. వీళ్లు మేకల్నీ పెంచుకుంటారు. ఇక్కడి జనాలతోపాటు ఈ జంతువులూ తాగేందుకు ఈ నీళ్లనే ఉపయోగించుకుంటాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని