టైటానిక్‌ పుట్టింది ఇక్కడే!

చెట్లుపుట్టల మధ్యలో తిరుగుతుంటే పెద్దవాళ్లు తిట్టేస్తారు... పాములుంటాయి అంటూ జాగ్రత్తలు చెప్పేస్తారు. కానీ ఐర్లాండ్‌లో ఆ భయమే అక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ అసలు పాములే ఉండవు. కారణం ఏమిటంటే పాములు శీతల రక్త జీవులు (కోల్డ్‌బ్లడెడ్‌ యానిమల్స్‌). ఇవి అత్యంత చలిని తట్టుకోలేవు. వేల ఏళ్ల క్రితం హిమానీ నదాల వల్ల ఐర్లాండ్‌ అంతా గడ్డకట్టుకుపోయి ఉండేదట. దీంతో పాములు ఉండేవి కావు. ఇప్పుడు కూడా చుట్టూ సముద్రం, ఎప్పుడూ చల్లగా ఉండటంతో పాములు అస్సలుండవన్నమాట...

Published : 30 Dec 2017 02:02 IST


టైటానిక్‌ పుట్టింది ఇక్కడే!

అనగనగా ఓ దేశం... అవడానికి చిన్నదే....అయినా వివరాలు వింతగాఅనిపిస్తాయి... ఇంతకీ ఆ దేశం కబుర్లేంటో తెలుసుకుందామా!

హాయిగా తిరగొచ్చు!
చెట్లుపుట్టల మధ్యలో తిరుగుతుంటే పెద్దవాళ్లు తిట్టేస్తారు... పాములుంటాయి అంటూ జాగ్రత్తలు చెప్పేస్తారు. కానీ ఐర్లాండ్‌లో ఆ భయమే అక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడ అసలు పాములే ఉండవు. కారణం ఏమిటంటే పాములు శీతల రక్త జీవులు (కోల్డ్‌బ్లడెడ్‌ యానిమల్స్‌). ఇవి అత్యంత చలిని తట్టుకోలేవు. వేల ఏళ్ల క్రితం హిమానీ నదాల వల్ల ఐర్లాండ్‌ అంతా గడ్డకట్టుకుపోయి ఉండేదట. దీంతో పాములు ఉండేవి కావు. ఇప్పుడు కూడా చుట్టూ సముద్రం, ఎప్పుడూ చల్లగా ఉండటంతో పాములు అస్సలుండవన్నమాట.
* ఐర్లాండ్‌... ఉత్తర అట్లాంటిక్‌ సముద్రంలో ఓ ద్వీపదేశం. చుట్టూ నీళ్లే సరిహద్దులు.
* ఇది పేరుకు ఒకే దేశం. కానీ ఇందులో రెండు భాగాలుంటాయి. ఒకటి రిపబ్లిక్‌ ఆఫ్‌ ఐర్లాండ్‌. రెండోది ఉత్తర ఐర్లాండ్‌. రిపబ్లిక్‌ ఆఫ్‌ ఐర్లాండ్‌కు పూర్తి స్వాతంత్య్రం వచ్చింది కానీ ఉత్తర ఐర్లాండ్‌ ఇంకా యూకేలో భాగమే.
* ఇక్కడి ప్రాంతాల పేర్లలో అతి పొడవైనది Muckanaghederdauhaulia.
* అమెరికా వైట్‌ హౌస్‌ డిజైనర్‌ జేమ్స్‌ హోబన్‌ ఈ దేశానికి చెందినవాడే.
* ఇక్కడ ఎక్కువ మంది సర్‌ నేమ్‌ ఓ(O),మ్యాక్‌(MAC)లతో మొదలవుతుంది. మ్యాక్‌ అంటే ‘సన్‌ ఆఫ్‌’ అని, ఓ అంటే ‘గ్రాండ్‌సన్‌ ఆఫ్‌’ అని అర్థమట.
* మన ముత్తాత్తాత్తాతలు ఐర్లాండ్‌కు చెందిన వారైతే ఇప్పుడు కూడా ఆ దేశ పౌరసత్వం పొందొచ్చు. ఎందుకంటే ఏ తరానికి చెందినవారైనా ఆ దేశస్థులైతే ఇప్పటికీ పౌరసత్వం వస్తుందట.
* ఈ దేశం ఎక్కువగా బంగాళదుంపల్ని ఎగుమతి చేస్తుంది.

దేశం:ఐర్లాండ్‌
రాజధాని: డుబ్లిన్‌
విస్తీర్ణం: 70,273 చదరపు కిలోమీటర్లు
జనాభా: 63,78,000
భాషలు: ఐరిష్‌, ఆంగ్లం
కరెన్సీ: యూరో

* ఈ దేశ జాతీయ చిహ్నం హార్ప్‌. ఇదో సంగీత వాద్యం. ప్రపంచంలో ఓ సంగీత పరికరం జాతీయ చిహ్నంగా ఉన్నది ఈ దేశానికి మాత్రమే.

* ఇక్కడి హుక్‌ లైట్‌ హౌస్‌ ప్రపంచంలో చాలా కాలంగా పనిచేస్తున్న లైట్‌ హౌస్‌గా చెబుతారు.

* చరిత్రలో నిలిచిపోయిన టైటానిక్‌ ఓడను తయారుచేసింది ఈ దేశంలోని బెల్‌ఫాస్ట్‌లోనే.

* జ్వరం వస్తే డాక్టర్‌ దగ్గర ఇంజక్షన్‌ ఇప్పించుకుంటాం కదా. ఆ హైపోడెర్మిక్‌ సిరంజీని కనిపెట్టింది ఇక్కడే.

* డుబ్లిన్‌లో ‘రొటుండా’ అనే ఆసుపత్రిని 1745లో ఏర్పాటుచేశారు. ప్రపంచంలోనే ఎక్కువకాలంగా ప్రసూతి సేవలందిస్తున్న ఆసుపత్రి ఇది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని