బాబోయ్‌... బాంబ్‌ సైక్లోన్‌!

అమెరికాని బాంబ్‌ సైక్లోన్‌ భయపెట్టేస్తోంది. అట్లాంటిక్‌ సముద్రం నుంచి తీరం వైపు దూసుకొస్తున్న ఈ తుపాను బీభత్సానికి భారీగా మంచుకురుస్తోంది. ఇళ్లు...

Published : 07 Jan 2018 01:31 IST

బాబోయ్‌... బాంబ్‌ సైక్లోన్‌!

మెరికాని బాంబ్‌ సైక్లోన్‌ భయపెట్టేస్తోంది. అట్లాంటిక్‌ సముద్రం నుంచి తీరం వైపు దూసుకొస్తున్న ఈ తుపాను బీభత్సానికి భారీగా మంచుకురుస్తోంది. ఇళ్లు... రోడ్లు... చెట్లు ఇలా ఎక్కడ చూసినా మంచే కనిపిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచుతో మంచు మేటలు పేరుకుపోయాయి. మైనస్‌ డిగ్రీల్లో ఉష్ణోగ్రతలు కొనసాగడంతో చుక్క నీరు కనిపించడం లేదు. ఎక్కడికక్కడ మంచు కొండలే. చలి తీవ్రతకు జనజీవనం పూర్తిగా స్తంభించింది. భారీ హిమపాతం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. అత్యవసర పరిస్థితి ప్రకటించారు.
* మంచు తుపాన్‌ అంటే ఏంటసలు?
తుపాన్‌ అంటే తెలుసుగా... సముద్రంలో ఉన్నట్టుండి అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది. అంటే అక్కడ గాలి పీడనం తక్కువగా ఉంటుందన్నమాట. దీంతో చుట్టూ ఉన్న గాలి ఆ ప్రాంతంలోకి వేగంగా చొరబడి సుడులు తిరుగుతుంది. ఆ వేగంగా తిరిగే సుడుల్నే తుపాను అంటారు. ఈ తుపాను నీటి మీద నుంచి నేలమీదకు ఎక్కడాన్నే ‘తుపాను తీరం దాటడం’ అంటారు. ఆ సమయంలో వేగంగా వీచే చల్లగాలుల వల్ల వర్షం కురుస్తుంది. ఇదంతా మనకు తెలిసిందే. అయితే అమెరికాలో ఇప్పుడు చలికాలం. సాధారణంగానే మైనస్‌ డిగ్రీల్లో ఉష్ణోగ్రత ఉంటుంది. అలాంటప్పుడు ఈ తుపాను ప్రభావం వల్ల పై నుంచి వర్షం కురిస్తే చినుకులు గాల్లోనే మంచుగా మారతాయి. ఇదే మంచు తుపాన్‌.
* ‘బాంబ్‌ సైక్లోన్‌’ అంటే?
ఉన్నట్టుండి వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల ఒక్కసారిగా వచ్చే పెను తుపాన్లనే ‘బాంబ్‌ సైక్లోన్లు’ అంటారు.
* దీని వేగాన్ని ఎలా లెక్కిస్తారు?
గాలిలో ఉండే పీడనాన్ని మిల్లీబార్లలో కొలుస్తారు. ఒక ప్రాంతంలో ఉండే గాలి పీడనం గంటకు ఒక మిల్లీబార్‌కి పడిపోతే తుపాన్‌ నేత్రం ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో పుట్టే తుపాన్లను బాంబ్‌ సైక్లోన్లు అంటుంటారు. దీని ప్రభావం వల్ల ఏర్పడే గాలుల వేగం దాదాపుగా గంటకు 130 కిలోమీటర్లు ఉంటుంది.
* బాంబ్‌ అనే పదం ఎందుకు వచ్చింది?
1980ల నుంచి ఈ పదం ఎక్కువగా వాడుకలో ఉంది. బాంబ్‌ అంటే పేలుతుందని కాదు. అంతటి శక్తిమంతమైన తుపాన్‌ అన్నమాట.
* ఏ కాలంలో ఎక్కువగా వస్తుంటాయి?
అట్లాంటిక్‌, పసిఫిక్‌ సముద్రాల్లో... శీతకాలం సమయంలో ఈ తుపాన్లు ఎక్కువగా పుడుతుంటాయి. చాలా అరుదుగా వేసవి కాలంలోనూ వస్తాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని