ప్రకృతి కట్టిన వంతెనలోచ్‌!

ఓ చోట రాతి పర్వతాలున్నాయి... వాటిల్లో వింత వంతెనలున్నాయి... అవన్నీ మన చిన్నూ చూసొచ్చాడు...

Published : 08 Jan 2018 01:57 IST

ప్రకృతి కట్టిన వంతెనలోచ్‌! 

ఓ చోట రాతి పర్వతాలున్నాయి... వాటిల్లో వింత వంతెనలున్నాయి... అవన్నీ మన చిన్నూ చూసొచ్చాడు... చిత్రమైన కబుర్లను మనకోసం తీస్కొచ్చాడు!
హల్లో నేస్తాలూ! బాగున్నారా! నేను మాత్రం చాలా అలసిపోయి ఉన్నా. ఎందుకంటే అమెరికా వెళ్లి నిన్ననే తిరిగొచ్చా. అక్కడ ఓ నేషనల్‌ పార్కుని చుట్టేసొచ్చా. భలేగా ఉందది. ఆ వివరాలన్నీ మీకు వెంటనే చెప్పేయాలిగా. అందుకే అలసటనూ లెక్కచేయకుండా మీ కోసం ఇలా వచ్చేశా.ఇంతకీ నేను అమెరికాలో ఎక్కడికి వెళ్లానంటే.. ఉటాహ్‌ రాష్ట్రానికి. అక్కడ ‘నేచురల్‌ బ్రిడ్జస్‌ నేషనల్‌ మౌన్యుమెంట్‌’కి. ఇది 30చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది.
* అక్కడ ఉండే గైడ్లు మనల్ని అదంతా తిప్పి విశేషాల్ని వివరిస్తారు. నేనూ వాళ్లతోపాటు బయలుదేరా. కొన్ని చోట్ల నడుస్తూ, ఇంకొన్ని చోట్ల వాహనాల్లో, మరి కొన్ని చోట్ల ట్రెక్కింగ్‌ చేస్తూ ఇలా సాగింది నా ప్రయాణం.
* ఇక్కడ నాకు భలేగా నచ్చినవి మాత్రం ఓ మూడు వంతెనలు. ఎవరో కట్టినవేం కాదు. సహజ సిద్ధంగా ఏర్పడిన బ్రిడ్జిలవి.* ఒక పర్వతం మీద నుంచి ఇంకో పర్వతం మీదికి వెళ్లడానికి మనకోసమే ఎవరైనా వేశారా వాటిని? అనిపించేసింది నాకు. అయితే అంతకు ముందు వాటిపైకి ఎక్కేవారటగానీ ఇప్పుడు భద్రతా కారణాలతో ఎవ్వరినీ వాటి పైకి ఎక్కనివ్వడం లేదు. వాటిని చూస్తే చాలా చిత్రంగానే తోచింది నాకు. ఎలాగూ పైకి వెళ్లడానికి లేదు కదా.. అందుకే కింద నుంచుని భలేగా ఫొటోలకు ఫోజులిచ్చేశానంతే.
* ఈ ప్రాంతంలో అస్సలు కాంతి కాలుష్యమే లేదు. అంటే సహజమైన వెలుతురు తప్ప మరే కాంతీ పడదిక్కడ. అందుకే రాత్రిళ్లు చుక్కల మధ్యలో ఈ వంతెనల్ని చూసేందుకు ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. చీకటిపడుతోందనగా అంతా ఓ చోట చేరి కూర్చున్నాం. అక్కడ గైడ్లు మాకు టెలిస్కోప్‌ ఇచ్చారు. దానిలోంచి ఈ వంతెనల్ని చూస్తుంటే అబ్బ! ఎంత అందంగా ఉన్నాయో. పైన మిణుకుమిణుకుమంటున్న నక్షత్రాల వెలుగులో ఇవీ మెరిసిపోతున్నాయి.

 
* ఈ మూడు వంతెనల్లో ఒక దాని పేరు సిపాపూ బ్రిడ్జ్‌. సహజసిద్ధమైన పొడవైన వంతెనల్లో ఇదీ ఒకటి. మిగతా రెండింటి పేర్లూ ఏమంటే ఒవచోమో, కచైనా.
* కొన్ని వేల ఏళ్ల క్రితం ఇక్కడ వరదలొచ్చాయట. అప్పుడు రాతి కొండల్లో కింద మట్టి, ఇసుక కొట్టుకుపోవడంతో ఇవలా సహజసిద్ధమైన వంతెనల్లా ఏర్పడ్డాయని గైడు చెబితే తెలిసింది. ఇవి కాకుండా చిన్న చిన్న గుట్టలమీదా ఆర్చిల్లాంటివికనిపించాయక్కడ.
* ఇంకా లోపలికి వెళుతూనే అక్కడ అంతా అంతెత్తున రాతి పర్వతాలు కనిపించాయి. అవన్నీ ఇసుకరాతివిట. మధ్య మధ్య లోయల్లో ఒక్కోచోట సరస్సు ల్లాంటివీ కనిపించాయి.
* స్థానిక అమెరికన్‌లు ఇక్కడి గుట్టల్లో కొన్ని వేల ఏళ్ల క్రితం నివాసాలుండేవారట. వారికి సంబంధించిన గుర్తులు ఇక్కడ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. గోడలపై వాళ్లూ మనకులాగే జంతువుల బొమ్మ లేశారక్కడ.
* అలా చరిత్రా దీనికి ఉంది. అందుకే అమెరికా ప్రభుత్వం 1908 నుంచీ దీన్ని సంరక్షిత ప్రాంతంగా చేసింది. దీనికి ‘నేచురల్‌ బ్రిడ్జస్‌ నేషనల్‌ మౌన్యుమెంట్‌’ అని పేరు పెట్టి ప్రజలు సందర్శించేందుకు వీలు కల్పించింది.బైబై.

చిన్నూ కబుర్లు!

ప్రపంచం మొత్తం మీద ఇలాంటి పొడవైన సహజసిద్ధమైన వంతెనలు మొత్తం 13 ఉంటే అందులో మూడు ఇక్కడే ఉన్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని