ఊసరవెల్లి సరస్సులు!

అనగనగా ఓ అగ్ని పర్వతం... దాని దగ్గర మూడు సరస్సులు... చిత్రంగా అవి రంగులు మార్చేస్తాయి... కనుమాయ చేసేస్తాయి... ఎక్కడో, ఎందుకో, ఏమో! నీళ్లంటే మనకు మహా ఇష్టం. చెరువులు, నదుల్లో కనిపిస్తేనే మన కళ్లకెంతో ఆహ్లాదం. మరేమో ఓ దగ్గర మూడు సరస్సులున్నాయి. అవేమో చిత్రంగా రంగులు మారిపోతుంటాయంట. ఒక సారి ఒక రంగులో ఉన్న సరస్సు కొంత కాలం తర్వాత చూస్తే వేరే రంగులోకి మారిపోయి ఉంటుందట....

Published : 12 Jan 2018 01:55 IST

ఊసరవెల్లి సరస్సులు!

అనగనగా ఓ అగ్ని పర్వతం... దాని దగ్గర మూడు సరస్సులు... చిత్రంగా అవి రంగులు మార్చేస్తాయి... కనుమాయ చేసేస్తాయి... ఎక్కడో, ఎందుకో, ఏమో!

నీళ్లంటే మనకు మహా ఇష్టం. చెరువులు, నదుల్లో కనిపిస్తేనే మన కళ్లకెంతో ఆహ్లాదం. మరేమో ఓ దగ్గర మూడు సరస్సులున్నాయి. అవేమో చిత్రంగా రంగులు మారిపోతుంటాయంట. ఒక సారి ఒక రంగులో ఉన్న సరస్సు కొంత కాలం తర్వాత చూస్తే వేరే రంగులోకి మారిపోయి ఉంటుందట.
* ఇంతకీ ఈ సరస్సులు ఎక్కడున్నాయనుకుంటున్నారు? ఇండోనేషియాలో.
* అక్కడ కెలిముటు నేషనల్‌ పార్క్‌ అని ఒకటుంది. అక్కడ మౌంట్‌ కెలిముటు అగ్నిపర్వతం ఉంది. దాని శిఖరం సముద్రమట్టానికి 1,690 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ అగ్ని పర్వత శిఖరాన బిలం దగ్గరే ఈ సరస్సులు దర్శనమిస్తాయి. అంతెత్తున ఈ మూడు సరస్సుల్లో రెండు పక్క పక్కగా ఉంటాయి. మూడోది మాత్రం వీటికి కిలోమీటరున్నర దూరంలో ఉంటుంది.
* శాటిలైట్‌ వ్యూలో చూస్తే ఒక్కొక్కటీ ఒక్కొక్క రంగులో కనిపిస్తూ అబ్బురపరుస్తాయి.
* వీటిలో మొదటి సరస్సు పేరు తివు అటలమబుపు. రెండోదాని పేరు తివు నువామురి కోఫాయ్‌. మూడోది తివు అటపోలో. స్థానిక భాషలో చిత్రంగా ఉన్న ఈ పేర్ల వెనక ఆత్మలకు సంబంధించిన అర్థాలున్నాయిట.
* ఈ మూడు సరస్సులూ నిర్దిష్ట సమయానికి ఒకసారి రంగులు పూర్తిగా మారిపోతుంటాయి. నీలం, ఆకుపచ్చ, ముదురు కుంకుమ రంగు, నలుపు, ఊదా... లాంటి వర్ణాల్లోనూ ఇవి
కనిపిస్తుంటాయి.

* ఈ అగ్ని పర్వతం నిద్రాణంలో ఉన్నట్లే పైకి కనిపిస్తుందిగానీ లోపల మాత్రం రసాయన చర్యలు జరుగుతూనే ఉంటాయిట. వాటి ప్రభావం వీటి మీద ఉంటుంది. అలాంటి నీటిపై సూర్యుని కిరణాలు పడేసరికి అవి ఇలా కొంత కాలానికోసారి వేరు వేరు వర్ణాల్లోకి మారుతుంటాయని
పరిశోధకులు చెబుతున్నారు.
* ఇక ఈ జాతీయ పార్కులో మరో ప్రత్యేకతా ఉందండోయ్‌. అరుదైన పక్షి జాతులకు చిరునామా ఇది. 19రకాల అరుదైన పక్షులు ఇక్కడ కనిపిస్తాయి. గబుక్కున చూస్తే రామ చిలుకల్లా కనిపించే పచ్చని పావురాళ్లూ ఉన్నాయిక్కడ. మొత్తానికి ఈ జాతీయపార్కు, దానిలోని సరస్సులూ గమ్మత్తుగానే ఉన్నాయి కదూ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని