ఈ పేర్లు పలకండి చూద్దాం!

అద్భుతమైన కట్టడాలో... వింతలో... విశేషాలో లేవు.... అయినా కొన్ని ప్రాంతాలు ఎంతో పే...రు తెచ్చుకున్నాయి...వాటి పేర్లేంటో తెలుసుకోవాలనుందా? ఎవరికి వారే చదువుకోవాల్సిందే తప్ప... ఒకరికొకరు అస్సలు చెప్పలేం! ఎందుకబ్బా? ఎంత పొ...డ...వో! వేల్స్‌లో అంగ్‌లెసే అనే ఓ ద్వీపం ఉంది. అందులో ఓ చిన్న గ్రామం. ఈ ఊళ్లో దిగగానే రైల్వేస్టేషన్‌, భవనాలు, ఇళ్లు, సైన్‌ బోర్డులపై ఊరి పేరు కనిపిస్తుంది. కానీ దాన్ని చదవాలంటే నాలుకను నలభై వైపుల తిప్పాల్సిందే. ఎందుకంటే ఆ పేరో టంగ్‌ ట్విస్టర్‌లా ఉంటుంది. అందుకే ఈ పేరును చదవడానికి తెగ సరదా పడుతుంటారు పర్యాటకులు....

Published : 17 Jan 2018 02:04 IST

ఈ పేర్లు పలకండి చూద్దాం!

అద్భుతమైన కట్టడాలో... వింతలో... విశేషాలో లేవు.... అయినా కొన్ని ప్రాంతాలు ఎంతో పే...రు తెచ్చుకున్నాయి...వాటి పేర్లేంటో తెలుసుకోవాలనుందా?
ఎవరికి వారే చదువుకోవాల్సిందే తప్ప... ఒకరికొకరు అస్సలు చెప్పలేం! ఎందుకబ్బా?

ఎంత పొ...డ...వో!

వేల్స్‌లో అంగ్‌లెసే అనే ఓ ద్వీపం ఉంది. అందులో ఓ చిన్న గ్రామం. ఈ ఊళ్లో దిగగానే రైల్వేస్టేషన్‌, భవనాలు, ఇళ్లు, సైన్‌ బోర్డులపై ఊరి పేరు కనిపిస్తుంది. కానీ దాన్ని చదవాలంటే నాలుకను నలభై వైపుల తిప్పాల్సిందే. ఎందుకంటే ఆ పేరో టంగ్‌ ట్విస్టర్‌లా ఉంటుంది. అందుకే ఈ పేరును చదవడానికి తెగ సరదా పడుతుంటారు పర్యాటకులు. 58 అక్షరాలతో ఉండే ఈ పేరును కాగితంపై రాస్తే మూడు వరుసల్లో వస్తుంది. Llanfair-pwll-gwyngyll- gogery-chwyrn-drobwll-llan-tysilio-gogo-goch. మీరూ ఓసారి ప్రయత్నించండి మరి. ఇక్కడి భాష ప్రకారం ఇందులో 51 అక్షరాలు మాత్రమే ఉన్నాయి. ఈ ఊరి అసలు పేరు లాన్‌ ఫెయిర్‌ పుల్‌ గ్విన్‌ గైల్‌. పర్యాటక ఆకర్షణ కోసం 1860లో దీని పేరును మార్చారు. ఆ పేరే ప్రపంచంలోని పొడవైన పేర్లలో స్థానం సంపాదించింది. మ్యాప్‌లోనూ చేరిపోయింది.


కొండంత పేరు!

Taumata-whakatangihanga-koauau-o-tamatea-turi-pukakapiki-maunga-horonuku-pokaiwhenua-kitanatahu

దేమిటో అర్థంకాకుండా ఉంది కదూ.  న్యూజీలాండ్‌లోని పొరాంగహు దగ్గర్లోని ఓ కొండ పేరు. ‘బాబోయ్‌ ఈ పేరు పలకడం అటుంచి... కనీసం చూసి రాయడానికి కూడా గందరగోళంగా ఉందే’ అనుకుంటున్నారా? అందుకే ముద్దుగా దీనికి టొమటా అని పిలిచేస్తారు. ఇక్కడి మౌరీ భాషకు చెందిన పదమిది. ఈ కొండ ఎత్తు 1,001 అడుగులు. 85 అక్షరాల పేరుతో ప్రపంచంలో పొడవైన ప్రాంతపు పేరుగా ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలో పొడవైన అధికారిక పేరుగా గిన్నిస్‌ రికార్డు కూడా కొట్టింది. ఈ పొడవైన పేరున్న బోర్డుల దగ్గర నిలబడి ఫొటోలకు పోజులిస్తుంటారు సందర్శకులు.


పెద్ద సరస్సు!

యునైటెడ్‌ స్టేట్స్‌లోని మసాచుసెట్స్‌, వెబ్‌స్టర్‌ దగ్గర ఓ సరస్సు ఉంది. 1,442 ఎకరాల్లో 8 దీవులతో ఉంటుందీ సరస్సు. కొన్ని దీవులు నివాసానికి వీలుగా ఉన్నాయీ వీటిల్లో. ఇదంతా సరే కానీ దీని అసలు ప్రత్యేకతలు ఇవేవీ కావు. ఈ సరస్సు పేరే. అవును అదేంటో మీరే చూడండి మరి... Chargoggagoggmanchauggagoggchaubunagungamaugg. దీవులతో వేరు చేయబడ్డది అని దీనర్థమట.  నిప్‌ముక్‌, ఆల్గన్‌కియాన్‌ భాషల నుంచి వచ్చిందీ పేరు. 45 అక్షరాలతో ఉండే ఈ పేరు పొడవైన పేర్లలో మూడోది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని