డోవోస్‌... అందాలు అదుర్స్‌

డావోస్‌లో ఏదో వేడుకట... దానికి దేశదేశాల నుంచి ప్రముఖులు వెళుతున్నారట... మన దగ్గర్నించీ బయలుదేరుతున్నారు... ఇంతకీ ఈ వేడుకేంటో?ఆ వూరి ప్రత్యేకత ఏంటో?చిన్నూకి సందేహం వచ్చింది... అందరికన్నా ముందే అక్కడికి చేరుకున్నాడు.. బోలెడు కబుర్లు చెప్పేస్తున్నాడు... అవేంటో చదివేద్దామా మరి!....

Published : 20 Jan 2018 03:14 IST

డోవోస్‌... అందాలు అదుర్స్‌
చిన్నూ కబుర్లు

డావోస్‌లో ఏదో వేడుకట... దానికి దేశదేశాల నుంచి ప్రముఖులు వెళుతున్నారట... మన దగ్గర్నించీ బయలుదేరుతున్నారు... ఇంతకీ ఈ వేడుకేంటో?ఆ వూరి ప్రత్యేకత ఏంటో?చిన్నూకి సందేహం వచ్చింది... అందరికన్నా ముందే అక్కడికి చేరుకున్నాడు.. బోలెడు కబుర్లు చెప్పేస్తున్నాడు... అవేంటో చదివేద్దామా మరి!హాయ్‌ నేస్తాలూ... అంతా కుశలమేనా? స్విట్జర్లాండ్‌ దేశం పేరు వినే ఉంటారుగా. అక్కడో చిన్న టౌను డావోస్‌. మొన్నే ఇక్కడికి వచ్చా. కనుచూపుమేర పరుచుకున్న తెల్లని మంచు, ఆహ్లాదకరమైన ప్రకృతి సోయగాల నడుమ ఆల్ప్స్‌ పర్వతాల మధ్య కొలువై ఉందీ వూరు. ‘హఠాత్తుగా చిన్నూ ఇక్కడికెందుకెళ్లాడు? ఆ ప్రాంతం సంగతులు మాకెందుకు చెబుతున్నాడు’ అని అనుకుంటున్నారు కదూ.* అసలు సంగతేమిటంటే... ఈ నెల 23 నుంచి 26 వరకు డావోస్‌లో ‘వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం’(డబ్ల్యూఈఎఫ్‌) వార్షిక సదస్సు జరుగుతోందని మీకూ తెలిసే ఉంటుందిగా. ఈ డబ్ల్యూఈఎఫ్‌ అనేది స్విట్జర్లాండ్‌కు చెందిన నాన్‌ ప్రాఫిట్‌ ఆర్గనైజేషన్‌. ఏటా జరిగే ఈ వేడుకకి ప్రపంచ దేశాల నుంచి దాదాపు 3000 మందికి పైగా వ్యాపార వాణిజ్య, ఆర్థిక, రాజకీయ రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటారట. 1971 నుంచి ఈ సదస్సును ఏటా ఇక్కడే నిర్వహిస్తున్నారు. ఇందులో బోలెడన్ని విషయాలపై చర్చలు జరుపుతుంటారట. ఈ ప్రముఖుల కోసం కట్టుదిట్టమైన ప్రత్యేక రక్షణ ఏర్పాట్లూ చేసేస్తారు. ఇదంతా బాగానే ఉంది మరి ఇంత పెద్ద వేడుకకు వేదికైన డావోస్‌ ఎలా ఉంటుందో ఏమిటో చూద్దామని వెంటనే నేనూ ప్రయాణమై వచ్చా.* ఇక ఈ వూరి ముచ్చట్ల విషయానికి వస్తే... జనాభా దాదాపు 11 వేలు. వైశాల్యం 284 చదరపు కిలోమీటర్లు. ఇందులో 35 శాతం వ్యవసాయ భూమి. 22 శాతం అడవులు విస్తరించి ఉన్నాయి. 40 శాతం ఖాళీగానే, నిరుపయోగంగా ఉంటుంది. మొత్తం భూమిలో... కేవలం 2.3 శాతం నేలలో మాత్రమే జనాలు ఇళ్లు కట్టుకుని నివసిస్తున్నారు.* ఈ చిన్న వూరిలోనే ఎందుకు ఈ సదస్సు జరుగుతుంది అని అనుమానం వచ్చి అక్కడున్న ఓ పెద్దాయన్ను అడిగితే తెలిసింది. డావోస్‌ ఐరోపాలో ఎత్తయిన వూరట. సముద్రమట్టానికి 5,100 అడుగుల ఎత్తులో ఉంటుంది. పైగా ఇక్కడి వాతావరణం, మౌలికసదుపాయాలు అనుకూలంగా ఉండటంతో ఏటా అంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారట.
* 11 వేల మంది జనాభా ఉన్నా 28 వేలమందికి సరిపడా వసతులున్నాయిక్కడ.
* ఈ చిన్న వూరికి వచ్చే పర్యాటకుల సంఖ్య ఎక్కువేనట. నాకో సంగతి తెలిసి భలే ఆశ్చర్యమేసింది ఒక్క 2015 సంవత్సరంలో ఇక్కడి స్థానిక హోటళ్లలో 7,97,348 మంది బస చేశారట.
* ఇది అంతర్జాతీయ సదస్సుకే కాదు... ఐస్‌ హాకీ, స్కీయింగ్‌, ఐస్‌ స్కేటింగ్‌లకు ప్రసిద్ధి చెందిందట.
* వూరి మధ్యలోకి వెళితే అక్కడో ఐస్‌ స్కేటింగ్‌ రింక్‌ కనిపించింది. ఇది ఐరోపాలోనే అతిపెద్ద నేచురల్‌ స్కేటింగ్‌ రింక్‌. దీని వైశాల్యం 18 వేల చదరపు మీటర్లు. మొత్తానికి వూరు మాత్రం భలే నచ్చేసింది నాకు. కానీ ఇక్కడ చలి చాలా ఎక్కువ. బాబోయ్‌ వణికిపోతున్నా. నవంబరు నుంచి మార్చి వరకైతే ఉష్ణోగ్రత మైనస్‌ డిగ్రీల్లో ఉంటుంది. ఎత్తయిన పర్వతాలు ఉంటాయి కదా... ఈ సమయంలో అవి మంచు దుప్పటి కప్పుకున్నట్టు ఉంటాయి. సరే సరే... ఇక్కడి అందాల్ని కెమెరాల్లో బంధించడానికి వెళుతున్నా. బైబై మరి!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని