చైనా వెళితే... పారిస్‌ చూడొచ్చు!

ప్రముఖ పర్యాటక ప్రాంతం... ఆకట్టుకునే కట్టడాలతో అలరిస్తుంది... ప్రపంచ వింతల్లో ఒకటైన ఈఫిల్‌ టవర్‌ ఇక్కడే ఉంది... ఇప్పటికే అర్థమై ఉంటుందిగా ఇవన్నీ పారిస్‌ నగరం సంగతులని... మరి ఈ పారిస్‌ నగరం ఎక్కడుంది? అంటే? ఫ్రాన్స్‌లో అనేస్తారు.... కానీ మరో పారిస్‌ నగరమూ....

Published : 24 Jan 2018 01:11 IST

చైనా వెళితే...
పారిస్‌ చూడొచ్చు!

మనుషుల్ని పోలి మనుషులుంటారని వింటుంటాం...
కానీ ఊరును పోలి ఊరు ఉండటం తెలుసా?
అలా ఒక ఊరుంది...  అలాంటిది ఇలాంటిది కాదు...
ఏకంగా ఓ ప్రఖ్యాత నగరమే అది.. ఇంతకీ ఏమా నగరం? ఎక్కడుంది?

ప్రముఖ పర్యాటక ప్రాంతం... ఆకట్టుకునే కట్టడాలతో అలరిస్తుంది... ప్రపంచ వింతల్లో ఒకటైన ఈఫిల్‌ టవర్‌ ఇక్కడే ఉంది... ఇప్పటికే అర్థమై ఉంటుందిగా ఇవన్నీ పారిస్‌ నగరం సంగతులని... మరి ఈ పారిస్‌ నగరం ఎక్కడుంది? అంటే? ఫ్రాన్స్‌లో అనేస్తారు.... కానీ మరో పారిస్‌ నగరమూ ఉంది. వెంటనే తెలుసుకోవాలనుందా? అయితే
చదివేయండి..

* చైనాలోని హ్యాంగ్‌జో దగ్గర్లో టియన్‌డచెన్‌ అనే సిటీని నిర్మించారు. 31 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ చిన్న నగరంలో అడుగుపెట్టగానే ఎత్తయిన ఈఫిల్‌ టవర్‌... లక్సెమ్‌బర్గ్‌ గార్డెన్‌... అద్భుతమైన భవంతులు... ఫౌంటేన్లు... విగ్రహాలు...  ఉద్యానవనాలు, వీధులు... అన్నీ పారిస్‌ని గుర్తుకు తెస్తాయి. పారిస్‌లోని ప్రముఖ  కట్టడాలన్నీ ఇక్కడ దర్శనమిస్తాయి. పదివేల మంది జనాభాకి సరిపడే నివాసాలతో ఉండే ఈ ప్రాంతంలో నిర్మాణాలన్నీ భలేగా ఫ్రాన్స్‌ రాజధానిని పోలి ఉంటాయి. పారిస్‌ నగరానికి రెప్లికాలా ఉండే ఈ ప్రాంతం... మినీ పారిస్‌ అన్నమాట.

* సరదాగా ఈ నమూనా నగరాన్నే ‘ఫేక్‌ పారిస్‌’ అనీ పిలిచేస్తారు.
* భవన సముదాయాలు, ఫౌంటేన్లు పారిస్‌లో ఉన్నట్టే ఉన్నా ఇక్కడి ఈఫిల్‌ టవర్‌ నమూనా మాత్రం నిజమైన ఈఫిల్‌ టవర్‌లో దాదాపు మూడోవంతు ఉంటుంది. దీని ఎత్తు 354 అడుగులు. ఇక్కడ ఫొటోలకు పోజులిస్తూ తెగ సంబరపడి           పోతుంటారు సందర్శకులు.
* 2007లో ప్రత్యేక ఆకర్షణ కోసం... ఏర్పాటుచేశారు దీన్ని. పారిస్‌ నగరాన్ని అచ్చుగుద్దినట్టు దించడానికి ప్రయత్నించారు.
* ఇక్కడ వివాహాలు, వేడుకలు చేసుకోవడానికి చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని