రెండు స్వతంత్య్ర దినోత్సవాల పనామా!

ఒక సముద్రంలో సూర్యోదయం..ఇంకో సంద్రంలో సూర్యాస్తమయం... ఒకచోట నుంచే చూడొచ్చు... ఇంతకీ ఎక్కడంట?ఏమా దేశమంట? మధ్య అమెరికాలో ఉన్న బుల్లి దేశం పనామా. కోస్టారికా, కొలంబియా, అట్లాంటిక్‌ సముద్రం....

Published : 27 Jan 2018 01:12 IST

రెండు స్వతంత్య్ర దినోత్సవాల పనామా! 

ఒక సముద్రంలో సూర్యోదయం..ఇంకో సంద్రంలో సూర్యాస్తమయం... ఒకచోట నుంచే చూడొచ్చు... ఇంతకీ ఎక్కడంట?ఏమా దేశమంట?మధ్య అమెరికాలో ఉన్న బుల్లి దేశం పనామా. కోస్టారికా, కొలంబియా, అట్లాంటిక్‌ సముద్రం(కరేబియన్‌ సముద్రం), పసిఫిక్‌ మహా సముద్రాలు దీనికి సరిహద్దులుగా ఉన్నాయి.
* ఈ దేశం రెండు స్వాతంత్య్ర దినోత్సవాల్ని జరుపుకొంటుంది. ఎందుకంటే ఇది పదహారో శతాబ్దం నుంచి 1821 వరకూ స్పెయిన్‌ వారి అధీనంలో ఉండి అప్పుడు స్వతంత్రం పొందింది. మళ్లీ కొలంబియా పాలకుల చేతుల్లోకి వెళ్లి 1903లో స్వతంత్రాన్ని పొందింది.
* ఇక్కడ అధికారిక భాష స్పానిష్‌ అయినా ఇంగ్లిష్‌ ఎక్కువగా మాట్లాడతారు.
* వస్తురవాణా ఓడలు, పెట్రోలియంని శుద్ధి చేసి ఎగుమతి చేయడం, పర్యాటకం..ఈ దేశ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతున్నాయి.
* దాదాపుగా 1500మైళ్ల తీర రేఖ ఉంది.
* ఇది ప్రజాస్వామ్య గణతంత్ర దేశం. అధ్యక్షుడిని ఎన్నుకోడానికి ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి. మనకులాగే వీరికీ 2014లో ఎన్నికలు జరిగాయి.
* భారత్‌లాగానే పనామా ఉష్ట మండల దేశం. ఎత్తయిన పర్వతాలు, అందమైన ఇసుక బీచ్‌లతో ఉంటుందిది. విదేశీయులూ ఇక్కడ ఇళ్లు కొనుక్కునేందుకు ఎక్కువగా ఇష్టం చూపిస్తుంటారు. ఎందుకంటే స్థానిక చట్టాల ప్రకారం ఇక్కడ విదేశీయులు ఎవరైనా ఇళ్లు కొనుక్కోవచ్చు. పెట్టుబడులూ పెట్టొచ్చు.
* వీరి అధికారిక కరెన్సీ బాల్బో. ఒక బాల్బో ఒక అమెరికన్‌ డాలర్‌కు సమానం. అయితే దీనికి బదులు ఇక్కడ అమెరికా డాలరే చలామణీలో ఉంటుంది.
* ఇక్కడ అత్యంత పెద్ద నగరం దీని రాజధాని పనామా సిటీ. దీనిలోనే వర్షాధార అడవులూ ఉన్నాయి. ఇలాంటి అడవులున్న రాజధాని నగరం ప్రపంచంలో ఇదొక్కటే.

చిత్రం చూడొచ్చు!

* రెండు మహా సముద్రాల మధ్యలో అతి సన్నగా ఉన్న ఇక్కడి భూభాగం పొడవు 80 కిలోమీటర్లు. ఇక్కడ ఉన్న చోట నుంచే పసిఫిక్‌ మహా సముద్రంలోంచి సూర్యోదయాన్ని అట్లాంటిక్‌ మహా సముద్రంలో సూర్యాస్తమయాన్ని వేరువేరు సమయాల్లో చూడవచ్చు. ఇలాంటి దృశ్యం కనిపించే దేశం ప్రపంచంలో ఇదొక్కటే.
* నట్‌ కార్వింగ్‌ ఇక్కడ ప్రసిద్ధి చెందిన కళ. చిన్న గింజలపై రకరకాల ఆకారాలు చెక్కి వాటిని అమ్ముతారు.
* సముద్ర జీవులు, మాంసం, గుడ్డు, గోధుమపిండిని ఉపయోగించి చేసుకునే వంటల్ని ఇక్కడ ఎక్కువగా తింటారు. గుడ్డు ఆమ్లెట్‌లో మాంసం కూరి చేసే ఫ్రైడ్‌ యోకాని వీరు ఇష్టంగా తింటారు.

కాలాలు రెండే...

 * ఈ దేశంలో ప్రధానంగా రెండే కాలాలు. డిసెంబర్‌ నుంచి ఏప్రిల్‌ వరకూ డ్రై సీజన్‌ అని, మే నుంచి నవంబర్‌ వరకూ రెయినీ సీజన్‌ అనీ పిలుస్తారు. అయితే వర్షపాతం అధికం.
* చాలా సార్లు హారికేన్‌ల తాకిడి వల్ల ఎక్కువగా నష్టపోతుంటుంది.
* ఇక్కడ పది వేలకుపైగా మొక్క జాతులు, పద్నాలుగు వందల రకాల ఆర్కిడ్‌లు, పదిహేను వందల రకాలకుపైగా వృక్ష జాతులూ ఉన్నాయి.
* మొత్తం 976 పక్షి జాతులు ఉన్నాయి. అమెరికా, కెనడాల్లో ఉన్న పక్షిజాతుల సంఖ్య కంటే ఇదే ఎక్కువట.

పనామా కాలువ...

* అట్లాంటిక్‌, పసిఫిక్‌ మహా సముద్రాల మధ్య కృత్రిమంగా నిర్మించినదే పనామా కాలువ. ఈ రెండు సంద్రాల మధ్యలో ఓడల ప్రయాణ దూరాన్ని తగ్గించేందుకు వీలుగా ఈ దేశం గుండా దీన్ని తవ్వారు.
* దీని నిర్మాణ సమయంలో మొదట కొలంబియా, తర్వాత ఫ్రాన్స్‌, చివరిగా అమెరికా ఆ పనులు చూశాయి. ఎట్టకేలకు ఈ కృత్రిమ కాలువను 1914 నాటికి అమెరికా పూర్తి చేసింది. అప్పటి నుంచి రెండు మహా సముద్రాల మధ్య దీని ద్వారా ఓడలు తిరగడం ప్రారంభమైంది.
* తర్వాత చాలా కాలం దీనిపై అమెరికా పెత్తనం కొనసాగింది. 1977తర్వాత అమెరికా, పనామా సంయుక్తంగా దీనిపై అధికారాన్ని చెలాయించాయి. 1999 తర్వాత పనామా చేతుల్లోకి వచ్చింది.
* ఈ కాలువ పై మూడు లాకులు ఉన్నాయి. ఓడలు వచ్చినప్పుడల్లా వాటి గేట్లను పైకెత్తుతారు. దీని నుంచి వెళ్లేందుకు ఆరు నుంచి ఎనిమిది గంటలు పడుతుంది.
* ఈ దారి తెరుచుకున్నప్పుడు అంటే 1914లో ఏడాదికి వెయ్యి ఓడలు దీని ద్వారా ప్రయాణించేవి. అయితే 2012 లెక్కల ప్రకారం ఆ సంఖ్య ఇప్పుడు ఎనిమిది లక్షల పై చిలుకుకు చేరింది.
* ఈ కాలువ ద్వారా వెళ్లే ఓడలన్నీ ఈ దేశానికి టోల్‌ కట్టాల్సి ఉంటుంది. ఓడ రకం, వెళ్లే ప్రయాణికుల సంఖ్యను బట్టి దాన్ని నిర్ణయిస్తారు. ఒక్కోసారి ఆ టోల్‌ ఛార్జీలు చూస్తే మనకు కళ్లు తిరిగిపోవాల్సిందే. ఉదాహరణకు ఒకటి చెప్పాలంటే నార్వేయన్‌ పర్ల్‌ క్రూయిజ్‌ షిప్‌కి 2010లో రెండు కోట్ల నలభైలక్షలకుపైగా టోల్‌ వేశారు.

దేశం: పనామా
రాజధాని: పనామా సిటీ
జనాభా: 40,34,119
విస్తీర్ణం: 75,417 చ. కిలోమీటర్లు
కరెన్సీ: బల్బో, అమెరికా డాలర్‌
భాష: స్పానిష్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని