సూరీడల్లే చందురుడు!

చంద్రుడు ఎప్పుడూ తెల్లగా చల్లగా ఉంటాడు కదూ... కానీ రేపు మాత్రం ఎర్ర్‌ర్ర్‌ర్ర్‌ర్రటి రంగులో దర్శనమివ్వబోతున్నాడు... అంతేకాదూ... బోలెడంత పెద్దగా కనిపించనున్నాడు... అందుకే సూపర్‌మూన్‌, బ్లడ్‌మూన్‌ అంటూ పిలిచేస్తున్నారు...

Published : 30 Jan 2018 01:07 IST

సూరీడల్లే చందురుడు!

చంద్రుడు ఎప్పుడూ తెల్లగా చల్లగా ఉంటాడు కదూ... కానీ రేపు మాత్రం ఎర్ర్‌ర్ర్‌ర్ర్‌ర్రటి రంగులో దర్శనమివ్వబోతున్నాడు... అంతేకాదూ... బోలెడంత పెద్దగా కనిపించనున్నాడు... అందుకే సూపర్‌మూన్‌, బ్లడ్‌మూన్‌ అంటూ పిలిచేస్తున్నారు... ఈ వింతను ఎలా చూడాలో తెలుసుకుందామా!పే....ద్ద చంద్రుడు అది కూడా పాలలా తెల్లగా కాకుండా, ఎర్రటి వర్ణంలో కనువిందు చేయనున్నాడు. అది చూడ్డానికి దేశమంతా సిద్ధమవుతోంది. మనం కూడా రెడీ అయిపోదామా? కాకపోతే.. అది ఎలాగో తెలుసుకుందాం. ఎందుకంటే ఇది చీటికీ మాటికీ వచ్చే వింతకాదు మరి. చాలా అరుదుగా 150 సంవత్సరాల తర్వాత కనిపిస్తున్న ఖగోళ సంబరం. మిగతా దేశాలతో పోలిస్తే మనదేశంలో దీన్ని చాలా స్పష్టంగా చూసే అవకాశం ఉంది. అది ఎలానో ఆస్ట్రోనామికల్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా బృందం చెప్పిందిలా...
* ఒకే నెలలో రెండు పున్నములు, భూమికి చంద్రుడు అతిదగ్గరగా రావడం, సంపూర్ణ చంద్రగ్రహణం వంటివి ఒకేసారి రావడంతోపాటు.. చంద్రుడు రాగి రంగులో కనిపిస్తాడు. అందుకే బ్లడ్‌మూన్‌ లేదా కాపర్‌మూన్‌ అంటున్నారు. మనలో చాలామందికి గ్రహణం సమయంలో చంద్రుడిని చూడకూడదనే నమ్మకం ఉంటుంది. కొందరయితే చూడాలనుకున్నా... ఏ పరికరాలు లేకుండా చూడొచ్చో లేదో అని భయపడతారు. కానీ ఈ చంద్రుడిని నేరుగా, ఏ పరికరాల సాయం లేకుండానే చూడొచ్చు. ఇలా చూడ్డం వల్ల ఎటువంటి అపాయం ఉండదు. ఇక మనం చేయాల్సిందల్లా... చంద్రుడిని చూడ్డానికి ఎటువంటి ఆటంకం లేని ఓ ప్రదేశాన్ని ఎంచుకోవాలి. జనవరి 31 సాయంత్రం 6:22 నిమిషాలకు మొదలయ్యే ఈ ఖగోళ సంబరం సుమారు 7:38 నిమిషాల వరకూ ఉంటుంది.
* ఖగోళ వింతలని ఫొటోలు తీసే అభిరుచి (ఆస్ట్రోఫొటోగ్రఫీ) ఆసక్తి ఉన్నవారు ముందస్తుగా కెమెరాలని సిద్ధం చేసుకోవాలి. అలాగే ఒక గడియారం కూడా దగ్గర పెట్టుకుంటే సమయాలు, చంద్రుడి కళలని కూడా నమోదు చేసుకోవచ్చు.
* భవంతులు, చెట్లు, కొండలు లేని ప్రదేశంలో అయితే చంద్రుడిని పూర్తిగా చూడగలుగుతారు. స్కూలు, కాలేజీ మైదానాల్లో .. బృందంగా కలిసి చూడ్డానికి ప్రయత్నించండి.
* స్థానిక ప్లానిటోరియంలు, సైన్స్‌ క్లబ్బులు ఉంటే వాళ్ల దగ్గర టెలిస్కోపులు ఉంటాయి. దాంట్లోంచి చూస్తే రాగి చంద్రుడిని ఆస్వాదించగలుగుతారు.
* అమ్మానాన్నలు, లేదా పెద్దవాళ్లతో కలిసి ఎత్తయిన భవంతులు, సముద్ర తీరాల్లో కూడా చూడొచ్చు.
* అయితే కాంతి కాలుష్యం లేకుండా అంటే వీధి దీపాలు, ఇతరత్రా ఫ్లడ్‌లైట్ల వెలుతురు లేకుండా చూసుకోవాలి.
* చంద్రుడి స్థితిని మరింత స్పష్టంగా తెలుసుకోవాలంటే... స్కైమేప్‌ అనే యాప్‌ తీసుకోవచ్చు. ఈ యాప్‌ సాయంతో మరిన్ని ఎక్కువ విషయాలు తెలుసుకోవచ్చు.
* భూమికి దగ్గరగా రావడం వల్ల చంద్రుడు ఇలా పెద్దగా, ప్రకాశవంతంగా కనిపిస్తాడు. మామూలు రోజుల్లో కనిపించే చందమామతో పోలిస్తే 14 శాతం పెద్దగా, 30 శాతం కాంతిమంతంగా కనిపిస్తాడు.

- శ్రీసత్యవాణి, ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు