కడలిపై అలల ముగ్గులు!

ఉప్పు తయారీ కోసం సముద్ర నీటితో చదరపు మళ్లు కట్టేస్తుంటారు... అలాంటి మళ్లని అలలే కట్టేస్తే? అదీ సముద్రంపైనే! ఆశ్చర్యంగా ఉందా? ఓ దగ్గర ఇలాంటి వింత తీరును చూడొచ్చు... ఇంతకీ ఎక్కడ? ఏమిటా వివరాలు? ఈ ఫొటోలు చూడగానే ‘అదేంటీ సముద్రంపై....

Published : 14 Feb 2018 01:27 IST

కడలిపై అలల ముగ్గులు!

ఉప్పు తయారీ కోసం సముద్ర నీటితో చదరపు మళ్లు కట్టేస్తుంటారు... అలాంటి మళ్లని అలలే కట్టేస్తే?  అదీ సముద్రంపైనే! ఆశ్చర్యంగా ఉందా? ఓ దగ్గర ఇలాంటి వింత తీరును చూడొచ్చు... ఇంతకీ ఎక్కడ? ఏమిటా వివరాలు?
ఈ ఫొటోలు చూడగానే ‘అదేంటీ సముద్రంపై చదరాలు కనిపిస్తున్నాయి? మడులు కట్టి విభిన్నంగా ఏదైనా సాగు చేస్తున్నారా లేకపోతే చతురస్రాకారపు ముగ్గులు పెట్టేశారా ఏంటీ?’ అనుకుంటున్నారా?
అదేం కాదు..  ఈ కెరటాల గడులు సహజంగా ఏర్పడ్డవే.భలే గమ్మత్తుగా ఉన్నాయి కదూ.
* ఈ వింత తీరును ‘క్రాస్‌ సీ’ అని పిలిచేస్తారు.
* వెంటనే చూడాలని ఉందా? అయితే పదండి ఫ్రాన్స్‌లోని ‘ఐల్‌ ది రీ’ అనే చిన్ని ద్వీపం దగ్గరకు. ఈ దీవి అట్లాంటిక్‌ సముద్రంలో ఉంది. సముద్రంపై ఎగిసిపడుతూ వచ్చే తరంగాల్ని ఏ సముద్రతీరంలోనైనా చూడొచ్చు... కానీ ఇలా అలలు చదరాలు చదరాలుగా కనిపిస్తూ కనువిందు చేసేది మాత్రం ఇక్కడే.
* అందుకే ఈ విచిత్రాన్ని చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తుంటారు. చుట్టుపక్కల లైట్‌హౌస్‌లు ఎక్కి ఈ అందాల అలల ఆకారాల్ని చూసి మురిసిపోతుంటారు. కెమెరాల్లో బంధించేస్తారు.
* అయితే అవడానికి అందమైన ఆకారాలే అయినా వీటివల్ల కొంత ప్రమాదం కూడా ఉందట. ఈ చదరాలు ఏర్పడేచోట ఉంటే ఓడలకు ముప్పు ఏర్పడుతుంది. అందుకే అలాంటి సమయాల్లో ప్రయాణాలు చేయడంలో కాస్త జాగ్రత్తగా ఉంటారట.
* ఈ వింతకు కారణం మాయ ఏమీ కాదు... మరేమిటంటే.. ఈ సముద్రం కింద కొన్ని కిలోమీటర్ల అడుగున రెండు సముద్రాలు కలుస్తాయట. ఆ రెండు సంద్రాల నుంచి రెండు రకాల కెరటాలు పుడతాయిట. అవి రెండూ  ఎదురెదురు దిశల్లో ప్రయాణించి కలిసినప్పుడు నీటి ఉపరితలంపై ఈ వైవిధ్యమైన దృశ్యం ఏర్పడుతుందట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని