నీడే కాదు... నీళ్లూ ఇస్తా!

వింత ఏంటో చదివేద్దామా?చెట్టు... మనకు ప్రాణ వాయువునిస్తుంది. మనం తినేందుకు తియ్యని పండ్లనిస్తుంది. మన నిత్య జీవితంలో బోలెడు అవసరాలను తీర్చేస్తుంది. మరేమో ఓ చోట చెట్టే నీటినీ ఇచ్చేస్తోంది. అచ్చం బోరు గొట్టం నుంచి.....

Published : 21 Feb 2018 01:06 IST

నీడే కాదు... నీళ్లూ ఇస్తా!

చెట్టుకు కాయలు కాస్తాయని తెలుసు...
పూలు పూస్తాయని తెలుసు...
మరి దాని నుంచి నీళ్లొస్తాయని తెలుసా?
అలా ఇలా కాదు గలగలా పారుతూ...
 

వింత ఏంటో చదివేద్దామా?చెట్టు... మనకు ప్రాణ వాయువునిస్తుంది. మనం తినేందుకు తియ్యని పండ్లనిస్తుంది. మన నిత్య జీవితంలో బోలెడు అవసరాలను తీర్చేస్తుంది. మరేమో ఓ చోట చెట్టే నీటినీ ఇచ్చేస్తోంది. అచ్చం బోరు గొట్టం నుంచి నీళ్లొచ్చినట్టు ఈ చెట్టు నుంచి బోలెడు నీరు ఉబికి వచ్చేస్తోంది.
* ఐరోపా ఖండంలో మోంటెనాగ్రో అనే బుల్లి దేశం ఉంది. అక్కడ డినోసా అనే చిన్న గ్రామంలో ఉందీ చెట్టు.
* ఇంతకీ ఇదేం చెట్టంటే ఓ మల్బరీ వృక్షం. ఎన్నో ఏళ్లనాటిదిలేండి.
* అక్కడ వర్షం కురిసి తగ్గగానే ఈ చెట్టు నుంచి ఇలా ఫౌంటేన్‌లా నీరు పొంగి పొర్లుతుంది. ఎంతగా అంటే ఆ చుట్టుపక్కల అంతా మునిగిపోయేంతగా. అంతేనా? ఇలా బయటకొచ్చేసిన నీటితో ఇక్కడో చిన్న నీటి కాలువ ఏర్పడి ప్రవహించేస్తుందంటే ఎంత నీరొస్తోందో మనమే అర్థం చేసుకోవచ్చు.

* కొన్ని రోజులకు మళ్లీ ఈ నీరు ఆగిపోతుంది. దీంతో ఈ వింతను చూడటానికి ఆ చుట్టుపక్కల నుంచి జనం వచ్చేస్తుంటారు.
* ఈ మధ్యన ఈ వింతను వీడియో తీసి ఓ ప్రసార మాధ్యమం నెట్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో దీన్ని చూసి ఇప్పుడు ప్రపంచమంతా ఆశ్చర్యపోతోంది.

* ఇంతకీ ఇదెలా సాధ్యమయ్యిందో తెలుసా? ఈ చుట్టుపక్కల చాలానే నీటి బుగ్గలున్నాయి. వర్షాలు పడితే భూగర్భంలో నీటి మట్టం పెరుగుతుంది కదా. దీంతో ఈ చుట్టుపక్కల బుగ్గల నుంచి నీరు ఉబికి పైకి వస్తుంటుంది.
* అయితే ఈ చెట్టు కిందా ఇలాంటి బుగ్గే ఉందట. పెద్ద కాండం ఉన్న ఈ చెట్టులో లోపలి నుంచి ఓ రంధ్రం ఉంది. భూగర్భంలో నీరు ఎక్కువైపోతే దానిలో ఒత్తిడి ఏర్పడి ఆ నీరు ఇలా ఫౌంటేన్‌లా మారి బయటకొచ్చేస్తోందట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని