ఔనంటే... కాదనిలే!

అల్బేనియా.. ఐరోపా ఖండంలోని బుల్లి ద్వీపకల్ప దేశం . దీనికి గ్రీస్‌, మాసిడోనియా, కొసోవో, మాంటినేగ్రో దేశాలు.. అడ్రియాటిక్‌ సముద్రం సరిహద్దులుగా ఉన్నాయి. ఇది చాలామటుకు పర్వతాలతో నిండి ఉంది. వాటిల్లో అల్బేనియన్‌ ఆల్ఫ్స్‌ కూడా ఉన్నాయి.

Published : 03 Mar 2018 00:58 IST

ఔనంటే... కాదనిలే!
అల్బేనియా

అల్బేనియా.. ఐరోపా ఖండంలోని బుల్లి ద్వీపకల్ప దేశం . దీనికి గ్రీస్‌, మాసిడోనియా, కొసోవో, మాంటినేగ్రో దేశాలు..  అడ్రియాటిక్‌ సముద్రం సరిహద్దులుగా ఉన్నాయి.
ది చాలామటుకు పర్వతాలతో నిండి ఉంది. వాటిల్లో అల్బేనియన్‌ ఆల్ఫ్స్‌ కూడా ఉన్నాయి.
* ఇక్కడ పుట్టిన వారు ఇక్కడి కంటే బయటి దేశాల్లోనే ఎక్కువగా నివసిస్తున్నారు. మాసిడోనియా, గ్రీస్‌, టర్కీ, ఇటలీ, జర్మనీ, స్విట్జర్లాండ్‌...లాంటి దేశాల్లో వీరి సంఖ్య ఎక్కువగా ఉంది.
* స్థానికుల్లో 70శాతం మంది ముస్లింలు, 17శాతం మంది క్రైస్తవులున్నారు. మిగిలిన కొద్ది శాతం ఇతర మతాలవారు.
* 1944 నుంచి రష్యా, చైనా కమ్యూనిస్టుల పాలనలో ఉన్న ఇది 1991లో ఎట్టకేలకు స్వతంత్ర దేశంగా మారింది. పార్టీల్ని ఏర్పాటు చేసుకుని ప్రజాస్వామ్య దేశమయ్యింది.
* ఐరోప ఖండంలో ప్రకృతి విపత్తుల వల్ల చాలా నష్టం కలిగే దేశాల్లో   ఇదీ ఒకటి.
* ఈ దేశ జాతీయ పుష్పం రెడ్‌పాపీ ఫ్లవర్‌. ఇక్కడ 3,250కిపైగా పూలజాతుల మొక్కలున్నాయి. వీటిలో 30శాతం ఎంతో అరుదుగా ఐరోపాలో మాత్రమే కనిపించేవి.
ఎక్కడ చూసినా బంకర్లే!
* ఇక్కడ చాలా ఎక్కువగా మిలటరీకి సంబంధించిన పాత బంకర్లు కనిపిస్తాయి.
* సరాసరిన చూస్తే ప్రతి 5.7చదరపు కిలోమీటర్లకొక బంకరుందని లెక్కలు చెబుతున్నాయి. మొత్తం మీద ఇక్కడ 7,50,000 బంకర్లున్నాయట.
* గతంలో కమ్యూనిస్టు పాలకుల కాలంలో శత్రువుల నుంచి రక్షణ కోసం వీటినిలా నిర్మించారట.
* వీటిలో కొన్ని పాతబడిపోతే మరికొన్నింటిలో మ్యూజియాలు, కేఫ్‌ల్లాంటి వాటిని నడుపుతున్నారు. కొందరు ఇళ్లుగానూ వీటిని వాడేసుకుంటున్నారు.
టైము లేని బస్సులు!
* ఇక్కడ రవాణా సౌకర్యాలు చాలానే వెనుకబడి ఉన్నాయి. దేశం మొత్తం మీద కేవలం నాలుగే విమానాశ్రయాలున్నాయి. 677కిలోమీటర్లు మాత్రమే రైల్వే లైన్లు ఉన్నాయి. బస్సులు ఉంటాయిగానీ వాటికి ఒక టైమే లేదు. అసలు ప్రణాళికే ఉండదు. వాటి డ్రైవరు వెళ్లిపోవాలనుకుంటేనో లేకపోతే బస్సు నిండిపోతేనో ఎప్పుడయితే అప్పుడు అవి బయలుదేరేస్తాయి.
* 29లక్షలకు పైగా ఇక్కడ జనాభా ఉన్నారు కదా. అయినా ఇక్కడ వాడే కార్ల సంఖ్య మాత్రం మూడు వేల లోపే. పార్టీలు, ప్రభుత్వ కార్యాలయాల వారు మాత్రం తప్పకుండా కార్లు వాడతారు.
* ట్రాఫిక్‌ లైట్లపై పన్ను కట్టాలని ఇక్కడ 1995లో ఓ చట్టం చేశారు. దాదాపుగా అందరూ కట్టేశారు. అయితే ష్కోద్రా సిటీ ప్రజలు మాత్రం చాలా గొడవలు చేసి చివరికి పన్ను కట్టారట. ఫలితంగా అక్కడ ఇప్పటికీ ట్రాఫిక్‌ లైట్లు ఉండవు.

దేశం: అల్బేనియా
రాజధాని: తిరానా
జనాభా: 29,94,667
విస్తీర్ణం: 28,748 చదరపు కిలోమీటర్లు
కరెన్సీ: అల్బేనియన్‌ లెక్‌
అధికారిక భాష: అల్బేనియన్‌

థెరెసా పుట్టిన దేశం

* మన దేశంలోని కోల్‌కతా మురికివాడల్లోని వారికి సేవలందించిన మదర్‌ థెరెసా పుట్టింది ఈ దేశంలోనే.
* ఆదర్శవంతమైన మహిళగా ఆమెపై ఇక్కడివారంతా అభిమానాన్ని చూపిస్తారు.

* ఇక్కడి కరెన్సీ ఒక అల్బేనియన్‌ లెక్‌ మన రూపాయల్లో 60 పైసలకు సమానం.
* జనాభా మొత్తంలో 60శాతం మంది వ్యవసాయం చేస్తారు.
* ఇక్కడ సంప్రదాయ దుస్తులు సుమారు 200 రకాలకు పైగా ఉన్నాయి.

* ఇది అందమైన బీచ్‌లకు, భిన్న సంస్కృతులకు సంబంధించిన రుచికరమైన ఆహార పదార్థాలకు పెట్టింది పేరు.

* ఇళ్ల ముందు ఎక్కడ చూసినా ఎక్కువగా దిష్టి బొమ్మలు కనిపిస్తాయి. ఇందుకు కొన్ని రకాల టెడ్డీబేర్లనూ వీరు వాడతారు. కొందరు వీటి వల్ల తమకు అదృష్టం కలుగుతుందని నమ్ముతారట.

సాయంత్రపు నడక!  

దాదాపుగా ఇక్కడ అన్ని ప్రాంతాల్లోని ప్రజలూ ఎక్కువగా సాయంత్రపు నడకను ఇష్టపడతారు. సాయంత్రం నుంచి రాత్రి వరకూ చుట్టుపక్కల వారితో కలిసి సరదాగా రోడ్ల మీద నడుస్తారు.
* ఈ సాయంత్రపు నడక ఇక్కడ అధికారికం. దీన్ని ఇక్కడ క్షిరో అని పిలుస్తారు.
* ఈ సమయంలో కొన్ని గంటలపాటు టౌన్లలో కార్లలాంటి వాహనాల్ని లోపలికి అనుమతించరు. రహదారుల్ని ఖాళీగా ఉంచడానికే ఈ ఏర్పాటు.
* మనం ఏదైనా విషయం గురించి అవును అని చెప్పడానికి ముఖాన్ని నిలువుగా ఆడిస్తాం. కాదనడానికి అడ్డంగా ఊపుతాం. అయితే ఇక్కడ చిత్రంగా దీనికి వ్యతిరేకంగా చేస్తారు. అంటే అవుననడానికి అడ్డంగా, కాదనడానికి నిలువుగా ఊపుతారట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని