మూడు ఖండాల్లో ఉండే చోటు!

ఇది ఏ ఒక్క దేశంలోనూ లేని ప్రాంతం... పోనీ ఏ ఒక్క ఖండానిదీ కాదు... మనందరికీ దీని పేరు బాగానే తెలుసుగానీ... ఈ చోటు గురించి మాత్రం అంతగా తెలీదు... ఇంతకీ ఏంటిది...? ఏమా విశేషాలు...? గ్లోబును చూస్తే సముద్రాలు, ఖండాలు, వాటిల్లో దేశాలూ కనిపిస్తాయి. అలాగే ఆర్కిటిక్‌ వలయాన్నీ చూసుంటారు. గ్లోబులో పైకప్పులా ఉంటుంది. ఉత్తర ధ్రువం దీని కేంద్రం. మరది అటు ఖండమూ కాదు. ఇటు దేశమూ కాదు. మరేంటో చూద్దాం.

Published : 19 Mar 2018 02:20 IST

మూడు ఖండాల్లో ఉండే చోటు!

ఇది ఏ ఒక్క దేశంలోనూ లేని ప్రాంతం... పోనీ ఏ ఒక్క ఖండానిదీ కాదు... మనందరికీ దీని పేరు బాగానే తెలుసుగానీ... ఈ చోటు గురించి మాత్రం అంతగా తెలీదు... ఇంతకీ ఏంటిది...? ఏమా విశేషాలు...?
గ్లోబును చూస్తే సముద్రాలు, ఖండాలు, వాటిల్లో దేశాలూ కనిపిస్తాయి. అలాగే ఆర్కిటిక్‌ వలయాన్నీ చూసుంటారు. గ్లోబులో పైకప్పులా ఉంటుంది. ఉత్తర ధ్రువం దీని కేంద్రం. మరది అటు ఖండమూ కాదు. ఇటు దేశమూ కాదు. మరేంటో చూద్దాం.
బోలెడు దేశాల్లో!
ఉత్తర అమెరికా, ఐరోపా, ఆసియా ఖండాల్లోని కొన్ని భూభాగాలు ఆర్కిటిక్‌ వలయంలోకి వస్తాయి. అమెరికా, కెనడా, ఐస్‌లాండ్‌, గ్రీన్‌లాండ్‌, నార్వే, స్వీడన్‌, రష్యా... దేశాల్లోని కొన్ని ప్రాంతాలు దీని పరిధిలోకి వస్తాయి. ఉత్తర ధ్రువం, ఆచుట్టూ ఉన్న భూభాగాలు, సముద్రాన్ని కలిపి ఆర్కిటిక్‌ వలయంగా పిలుస్తారు.
-70డిగ్రీలు!
ఈ వలయంలో నమోదైన అతి తక్కువ ఉష్ణోగ్రత -70డిగ్రీల సెల్సియస్‌. ఇది గ్రీన్‌లాండ్‌ ఉత్తర ప్రాంతంలో నమోదయ్యింది. ప్రపంచంలో గడ్డకట్టి ఉన్న మంచి నీళ్లలో పదిశాతం ఈ వలయంలోనే ఉన్నాయి. అవి మేటలు వేసిన మంచులా ఉండి ఎంచక్కా సూర్యరశ్మి పడేసరికి మెరిసిపోతుంటాయి. ఇక్కడ సహజ వనరులూ అధికంగా దొరుకుతాయి. చేప నూనెలు, చమురు, రకరకాల ఖనిజాలు ఎక్కువగా లభిస్తాయి. అంటార్కిటికా తర్వాత అంత పెద్ద మొత్తంలో మంచు ఉన్నది ఈ వలయంలోనూ ఉన్న గ్రీన్‌లాండ్‌లో. సముద్రమట్టానికి మూడు వేల మీటర్ల ఎత్తులో ఉండే ఇక్కడ దాదాపు 85శాతం మంచే.
స్థానికులు తక్కువే!
* మైనస్‌ డిగ్రీల్లో ఉష్ణోగ్రతలుండే ఇక్కడ స్థానిక ప్రజలూ ఉన్నారు. వీళ్లని ‘ఇన్యూట్స్‌’ అంటారు. స్థానిక ఇనుక్‌ట్యూట్‌ భాషలో ఈ పదానికి అర్థం ప్రజలని.
* అతి శీతల సమయంలోని పరిస్థితులకూ అలవాటుపడి ప్రాచీన కాలం నుంచీ కొన్ని తెగలవారు ఇక్కడ[ జీవిస్తున్నారు. వీరిసంఖ్య ఇక్కడ పదిశాతం.
* బయట నుంచి వచ్చి ఈ వాతావరణంలో స్థిరపడినవారే అధికం. అంతా కలిసి ఇప్పుడు ఈ వలయంలో దాదాపు నలభైలక్షల జనాభా ఉంది. చేపల వేట, పర్యాటకం వీరికి ప్రధాన ఆదాయ వనరులు.
ఆర్కిటిక్‌ మహా సముద్రం!
ఆర్కిటిక్‌ వలయం మధ్య బిందువు ఉత్తర ధ్రువం అయితే దాని చుట్టూ ఆర్కిటిక్‌ మహా సముద్రం ఉంటుంది. మహా సముద్రాల్లో అతి చిన్నది. అయితే గ్లోబల్‌ వార్మింగ్‌ వల్ల ఇప్పుడు ఇక్కడ మంచూ కరిగిపోతోంది. ఈ మంచు మొత్తం
కరిగిపోతే భూమి మీదున్న అన్ని సముద్రాల్లో నీటిమట్టం 24అడుగులు పెరిగిపోతుందని అంచనా. అప్పుడేమో పెను ప్రమాదం ముంచుకొస్తుందట.

భలే జీవజాతులు!  

* నర్వాల్‌ అని పిలిచే పొడుగు ముక్కున్న తిమింగలాలు ఇక్కడి ఆర్కిటిక్‌ సముద్రంలో మాత్రమే కనిపిస్తాయి.
* ఇక్కడ అత్యధిక బరువున్న ధ్రువపు ఎలుగుబంటి ఏకంగా 1,004కేజీలుంది. మామూలుగా ధ్రువపు ఎలుగుబంట్ల చర్మం నల్లగానే ఉంటుంది. అయితే వీటికుండే వెంట్రుకలు ఏరంగూ లేకుండా ఉంటాయి. చుట్టూవాతావరణం, సూర్యుడి వెలుగుని బట్టి ఇవి అయితే తెల్లగా, లేకపోతే లేత పసుపు రంగులోనూ మనకు కనిపిస్తుంటాయి.
* మంచు ఉన్నప్పటికీ ఇక్కడ పెంగ్విన్లు లేవు.
* గ్రేవేల్స్‌ అనే తిమింగలాలు ఏటా మెక్సికో నుంచి దాదాపుగా 12,500మైళ్లు ఇక్కడికి వలసవచ్చి మళ్లీ వెనక్కి వెళతాయి.వాల్‌రస్‌లు, ధ్రువపు ఎలుగుబంట్లు, సీళ్లు... లాంటి జంతువుల్నీ చూడొచ్చిక్కడ.
* కాస్త పొడి ప్రాంతాల్లో చిన్న చిన్న గుల్మాలు, పొదల్లాంటి మొక్కలు పెరుగుతాయి.

రాత్రి సూరీడు!  

సంవత్సరంలో కొన్ని రోజులపాటు ఇక్కడ విచిత్రం చూడొచ్చు. భూమి ధ్రువం దగ్గరకు వెళ్లేకొద్దీ బంతిలా మారేందుకు వంపు తిరిగి ఉంటుంది. అందువల్ల ఇక్కడ ఏప్రిల్‌ మధ్యలో నుంచి ఆగస్ట్‌ మధ్య వరకు దాదాపుగా 125 రోజులు రాత్రీ సూర్యుడిని చూడొచ్చు. ఈ సమయంలో ఇక్కడ అర్ధరాత్రప్పుడూ ఆకాశంలో సూరీడు కనిపిస్తూనే ఉంటాడు.

ఆర్కిటిక్‌ అంటే...

ర్కిటిక్‌ అనేది అరక్టోస్‌ అనే గ్రీకు పదం నుంచి పుట్టింది. దానర్థం ‘ఎలుగుబంట్ల దగ్గర’ అనట. ఇక్కడ ధ్రువపు ఎలుగుబంట్లు ఎక్కువగా ఉంటాయి. బహుశా అందుకే ఈ ప్రాంతానికి ఆర్కిటిక్‌ అనే పేరు వచ్చి ఉండవచ్చని చెబుతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని