24 గంటలు... 16 సూర్యోదయాలు!

చైనా స్పేస్‌ ల్యాబ్‌ భూమిపై సముద్రంలో పడిపోయింది... మరి అలాంటివి ఆకాశంలో ఇంకేమైనా ఉన్నాయా..? ఉంటే ఏం చేస్తాయి..? ఎలా ఉంటాయి..? అన్నింటి గురించీ కాదు కానీ ముందు అన్నింటికంటే పెద్దదాని గురించి తెలుసుకుందాం!

Published : 03 Apr 2018 01:29 IST

24 గంటలు... 16 సూర్యోదయాలు!

చైనా స్పేస్‌ ల్యాబ్‌ భూమిపై సముద్రంలో పడిపోయింది... మరి అలాంటివి ఆకాశంలో ఇంకేమైనా ఉన్నాయా..? ఉంటే ఏం చేస్తాయి..? ఎలా ఉంటాయి..? అన్నింటి గురించీ కాదు కానీ ముందు అన్నింటికంటే  పెద్దదాని గురించి తెలుసుకుందాం!

* పైనున్నది ఏమిటి?
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌). ఇదేదో పరిశోధనలు చేసే కేంద్రమే కాదు. ఆకాశంలో తిరుగుతూ ఉండే కృత్రిమ ఉపగ్రహం కూడా.

* ఎక్కడుంటుంది?
మన భూమికి దాదాపుగా 400కిలోమీటర్ల దూరాన భూమి చుట్టూ తిరుగుతుంటుంది. కాంతితో చుక్కలా ప్రయాణించే దీన్ని మనం రాత్రిళ్లు ఒక్కోసారి నేరుగానే ఆకాశంలో చూడొచ్చు. భూమిని 90 నిమిషాలకోసారి చుట్టి వస్తుంది. గంటకు 17,500మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది.

* చాలా పెద్దగా ఉంటుందా?
ఇది 239 అడుగుల పొడవు, 356 అడుగుల వెడల్పు, 66 అడుగుల ఎత్తు ఉంటుంది. అంటే దాదాపుగా ఆరంతస్తుల భవనమంత ఎత్తన్నమాట.

* తయారు చేసిందెవరో?
అమెరికా, రష్యా, జపాన్‌.. తదితర 18 దేశాల అంతరిక్ష పరిశోధనా సంస్థలు దీని తయారీలో భాగస్వాములు(మన దేశం లేదు).

* అక్కడకి ఎలా వెళ్లింది?
కొన్ని దేశాలు సంయుక్తంగా దీన్ని తయారు చేసినా రష్యా దీన్ని వాహకనౌక ద్వారా అంతరిక్షంలోకి పంపించింది.

* ఎప్పుడు వెళ్లింది?
1998 నవంబరు 20న దీనిలోని మొదటి మాడ్యుల్‌ పెకెళ్లింది. చివరిగా 2011లో ఒక మాడ్యుల్‌ని దీనికి అమర్చారు. దీనికి కావల్సిన విడిభాగాలు, ఇంధనం, సరుకుల్లాంటి వాటిని అమెరికా, రష్యాలు రాకెట్ల ద్వారా ఇక్కడకు చేరవేస్తాయి.

* అక్కడికి ఎవరైనా వెళతారా?
దీని దగ్గరకి వెళ్లి రావడానికి అంతరిక్ష పర్యాటక సేవలూ ఉన్నాయి. ఈ జనవరి వరకు దీని దగ్గరకు 230 మంది వరకూ వెళ్లొచ్చారు. 145మంది అమెరికన్లు, 46 మంది రష్యన్లు సహా మరికొన్ని దేశాల వాళ్లూ వెళ్లారు.

* మరి బ్రెషింగ్‌, తినడంలాంటివో?
ఇక్కడ నీరు కూడా ప్యాకెట్లలో ప్యాక్‌ అయి ఉంటుంది. ప్యాకెట్‌ నుంచి నీటిని బయటకి పిండితే చుక్క కూడా కిందికి పడదు. నీటి బిందువు గాల్లోనే తేలుతూ ఉంటుంది. దాన్ని అక్కడున్న వారు హాంఫట్‌మని నోటిలోకి లాగేసుకుంటారంతే. బ్రష్‌ చేసుకుని ఉమ్మి బయటకు ఉయ్యాలంటే బయటకు పడదు. అందుకే టిష్యు పేపర్‌లాంటి దాన్ని నోటి దగ్గర పెట్టి దానిలోకి ఉసేస్తారు. ఇక్కడ ఆహార పదార్థాలన్నీ నీరు తీసేసి దీర్ఘ కాలం నిల్వ ఉండేలా ప్యాకింగ్‌ చేసుంటాయి. గుడ్లు, పళ్లు, స్నాక్స్‌ ఇలా అన్నీ ప్యాకింగ్‌ల్లోనే ఉంటాయి. కొన్నింటిని నేరుగానే తింటే, మరి కొన్నింటిని వేడి నీరు కలుపుకుని తింటారు.

* ఎప్పుడూ అందులో ఉండేదెందరు?
ఆరుగురు సిబ్బంది ఎప్పుడూ దీనిలోనే ఉంటూ వాతావరణ, భౌతిక, జీవ శాస్త్రాలతోపాటు మరికొన్నింటిపైనా  పరిశోధనలు చేస్తుంటారు. మిగిలిన వాళ్లు సందర్శన కోసమే అక్కడికి వెళ్లి వస్తుంటారు.

* మరి వారికి ఆక్సిజన్‌ ఎలా?
అంతరిక్షంలో నేరుగా మనం తీసుకోవడానికి ఆక్సిజన్‌ లభించదు. అందుకే ఇక్కడ ఎలక్ట్రాలసిస్‌ అనే ప్రక్రియను జరుపుతారు. ఇక్కడ సౌర ఫలకాల ద్వారా కరెంటును ఉత్పత్తి  చేస్తారు. దాని ద్వారా నీటి బిందువుల్ని హైడ్రోజన్‌, ఆక్సిజన్‌లుగా విడగొట్టి
ఆక్సిజన్‌ని ఉత్పత్తి చేస్తారు. దాన్నే పీలుస్తారు.

* భూమ్యాకర్షణ ఉండదు కదా మరి?
ఉండదు. అందుకే దీని లోపల తక్కువ పీడనంతో వాతావరణాన్ని నియంత్రిస్తారు. గాల్లో తేలుతూనే ఇక్కడి వారు అటూ ఇటూ కదులుతారు. పడుకోవడానికి ప్రత్యేకమైన స్లీప్‌ సూట్లు కట్టేసి ఉంటాయి. వాటిల్లోకి వెళ్లి జిప్‌ వేసుకుంటేగాని నిద్రపోవడం కుదరదు. గోడలు, వాటికుండే హ్యాండిళ్లను పట్టుకుని ఒక చోట నుంచి ఇంకో చోటికి తేలుతూ వెళతారు.

* దీన్ని ఎలా నియంత్రిస్తారు?
ఆకాశంలో ఉండే దీన్ని భూమ్మీద నుంచి నియంత్రిస్తారు. అమెరికాలోని హ్యూస్టన్‌, రష్యాలోని మాస్కోల్లోని పరిశోధనా సంస్థల నుంచి ఆ పని జరుగుతుంది.

* ఇంత గొప్పది కదా. మరి దీనికి ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా?
ఓఓఓ. ఎందుకు లేవూ! మనుషులు తయారు చేసిన వాటిలో భూమి బయట ఉన్న అతి పెద్ద నిర్మాణం ఇదే. 2024వరకూ ఇది సేవలందించ గలదని అంచనా. దీనిలాగే మరికొన్ని దేశాల పరిశోధనా కేంద్రాలూ అంతరిక్షంలో ఉన్నాయి.

* ఇంకా చిత్రమైన విశేషాలు?
ఇది భూమి చుట్టూ వేగంగా తిరుగుతుంటుంది కదా. అందుకే ఇక్కడి నుంచి 24 గంటల్లో
16సూర్యోదయ, సూర్యాస్తమయాల్ని చూడొచ్చు.

* భలేగా ఉందిగానీ టికెట్‌ ఎంతుంటుందో?
2009లో ఇక్కడకు వెళ్లొచ్చిన ఒకాయన దాదాపుగా 250కోట్లకు పైగా చెల్లించాడట. ఇప్పుడు ఆ ధర ఇంకా ఎక్కువే ఉండొచ్చు.

* దీనిలో ఏమేం ఉంటాయి?
దీంట్లో రెండు విభాగాలుంటాయి. ఒకటి రష్యన్‌ ఆర్బిటల్‌ సెగ్మెంట్‌(ఆర్‌ఓఎస్‌), ఇంకోటి యునైటడ్‌ స్టేట్స్‌ ఆర్బిటల్‌ సెగ్మెంట్‌(యుఎస్‌ఓఎస్‌). ఇంకా మరికొన్ని దేశాలకు సంబంధించిన పరిశోధనా కేంద్రాలూ దీనిలో ఉంటాయి. ఇక్కడ మొత్తం 52 కంప్యూటర్లుంటాయి. ఇంకా దీనిలో మనుషులు ఉండటానికున్న గది మన ఆరుబెడ్‌రూంల ఇంటికంటే విశాలంగా ఉంటుంది. రెండు బాత్రూమ్లూ, ఒక జిమ్మూ, దానిలో ట్రెెడ్‌ మిల్లూ, సైకిల్‌ కూడా ఉన్నాయి. 360డిగ్రీల కోణంలో కనిపించే కిటికీ కూడా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని