చేప‌కాని చేప‌మ్మా... రోబొమ్మా!

కొత్తగా తయారయ్యింది... శాస్త్రవేత్తలకు అదంటే బోలెడు ఇష్టం... ఎందుకో ఏమో... మనమూ తెలుసుకుందాం! మాట్లాడేవి, వంట చేసేవి, పిల్లల్ని నిద్రపుచ్చేవి.... ఇలా బోలెడు రోబోల గురించి మనం వింటూనే ఉంటాం. అయితే ఈ మధ్యనే శాస్త్రవేత్తలు ఎంతో ఇష్టంగా ఓ చేప రోబోని తయారు చేశారు. పైగా అది చేసే పనులు వింటే ఔనా! అని ఆశ్చర్యమేస్తుంది. అవేంటో, దాని కథేంటో చూద్దాం మరి.

Published : 06 Apr 2018 01:31 IST

చేప‌కాని చేప‌మ్మా... రోబొమ్మా!

ఓ చేప రోబో ఉంది... కొత్తగా తయారయ్యింది... శాస్త్రవేత్తలకు అదంటే బోలెడు ఇష్టం... ఎందుకో ఏమో... మనమూ తెలుసుకుందాం!
మాట్లాడేవి, వంట చేసేవి, పిల్లల్ని నిద్రపుచ్చేవి.... ఇలా బోలెడు రోబోల గురించి మనం వింటూనే ఉంటాం. అయితే ఈ మధ్యనే శాస్త్రవేత్తలు ఎంతో ఇష్టంగా ఓ చేప రోబోని తయారు చేశారు. పైగా అది చేసే పనులు వింటే ఔనా! అని ఆశ్చర్యమేస్తుంది. అవేంటో, దాని కథేంటో చూద్దాం మరి.

* సముద్రం అడుగున బోలెడు జీవులుంటాయి. అక్కడక్కడా చక్కని పగడపు దిబ్బలుంటాయి. వాటిపై ఏం పరిశోధనలు చేయాలన్నా శాస్త్రవేత్తలే డైవర్లుగా మారి వాటి దగ్గరకు వెళ్లాలి. ఓ రకంగా చెప్పాలంటే అది వారికి పెద్ద సాహసమే. అన్నిసార్లూ అది వారికి కుదరని పని కూడా. అయితే ఈ కొత్త చేప రోబో గారు ఈ పనులన్నింటినీ చాలా సునాయాసంగా చేసేస్తుంది. వాళ్లకు బోలెడంత విలువైన సమాచారాన్ని అందిస్తోంది. వెళ్లడం వెళ్లడంతోనే సముద్ర జలాల్లోపల ఒక పెద్ద గ్రీన్‌లాండ్‌ సొర చేపను ఇది గుర్తించింది. ఆ సొర చేప 400 ఏళ్ల వయసున్నదని తెలుసుకుని శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోయారు.

* ఇంతకీ ఈ రోబో పేరేంటో చెప్పలేదు కదూ... సోఫై. సిలికాన్‌ రబ్బరు, ప్లాస్టిక్‌లతో చేపంత పరిమాణంలో తయారుచేశారు దీన్ని. ఎవరంటే మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ వాళ్లు.

* దీని పొడవు 47 సెంటీమీటర్లు. సెకెనులో దాదాపు ఇరవై మూడున్నర సెంటీమీటర్ల దూరం ఈదగలదు. అంటే దాని శరీర పరిమాణంలో సగం దూరాన్ని సెకెనులో ఈదగలదన్నమాట. ఈ వేగం మామూలు చేప ఈతవేగం కన్నా
కాస్త తక్కువేనట.

* ఎలా పనిచేస్తోందో చూసేందుకు దీన్ని ఫిజి  సముద్రజలాల్లో వదిలి ఆరుసార్లు పరీక్షించారు.

* అలా ఇది చక్కగా చక్కర్లు కొట్టేస్తూ బోలెడు విషయాల్ని తెలుసుకోవడానికి సహకరిస్తోంది. శరీరాన్ని మెలికలు తిప్పుతూ, తోక ఊపుతూ అచ్చం చేపలాగే నీటిలో ప్రయాణించేస్తోంది.

* రిమోట్‌ కంట్రోల్‌ సహాయంతో దీన్ని నియంత్రించొచ్చు. డైవింగ్‌ వెళ్లినవారు దూరంలో ఉండి కూడా దీన్ని కావాల్సిన ప్రాంతాల్లోకి పంపించవచ్చు. దీని వేగం, దిశల్ని మార్చవచ్చు.

* ఇలా సముద్రపు లోతుల్లో కొత్త జీవుల్ని గుర్తించడానికి, పగడపు దిబ్బలు ఎలా ఉన్నాయో కనిపెట్టుకుని ఉండేందుకూ ఇది ఎంతగానో సహకరిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

* దీన్ని ఒకసారి ఛార్జింగ్‌ చేసి నీళ్లలోకి పంపితే 40 నిమిషాల పాటు ఈతకొట్టగలదట. అక్కడి ప్రాంతాల్ని కెమేరాతో వీడియో తీసి మనకు చూపించగలదు. భలే ఉంది కదూ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని