ఊరు వృత్తంలో.. ఉన్నదేమో బిలంలో!

ఓ చక్కని పట్టణం ఉంది... అది ఉన్న చోటు వల్లే దానికో ప్రత్యేకత... పైగా ఇలాంటి ఊరు ప్రపంచంలో మరెక్కడా లేదు... ఇంతకీ అది ఎక్కడుందంట...? ఏమిటా సంగతులంట? ఒక ఊరు.. ఉన్న భూభాగాన్ని బట్టే బోలెడు పేరు సంపాదించేసుకుంది. ఎందుకంటే అది ఉన్నది అలాంటి ఇలాంటి చోటు కాదు మరి. ముందు అగ్ని పర్వత బిలంపై ఉందనుకున్నారు. తర్వాత తెలిసింది.

Published : 09 Apr 2018 01:16 IST

ఊరు వృత్తంలో.. ఉన్నదేమో బిలంలో!

ఓ చక్కని పట్టణం ఉంది... అది ఉన్న చోటు వల్లే దానికో ప్రత్యేకత... పైగా ఇలాంటి ఊరు ప్రపంచంలో  మరెక్కడా లేదు... ఇంతకీ అది ఎక్కడుందంట...? ఏమిటా సంగతులంట?

క ఊరు.. ఉన్న భూభాగాన్ని బట్టే బోలెడు పేరు సంపాదించేసుకుంది. ఎందుకంటే అది ఉన్నది అలాంటి ఇలాంటి చోటు కాదు మరి. ముందు అగ్ని పర్వత బిలంపై ఉందనుకున్నారు. తర్వాత తెలిసింది. ఉల్కాపాతం వల్ల ఏర్పడ్డ బిలంలో అని. ఇంతకీ ఈ విషయం ఎలా తెలిసిందంటే దానికి పెద్ద కథే ఉంది.

* ఒక వృత్తంలో ఒద్దికగా ఒదిగి ఉన్న ఈ ఊరి పేరు నార్డిలింగెన్‌. జర్మనీలోని బవారియా రాష్ట్రంలో ఉంది.

* ఈ ఊరు ఏకంగా ఉల్కాపాతం వల్ల ఏర్పడ్డ పెద్ద బిలంలో ఉంది.

* మొత్తం 25 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న దీనిలో ఇరవైవేల మందికి పైగా నివసిస్తున్నారు. ప్రపంచంలో ఇలాంటి చోటున్న ఊరు ఇదొక్కటేనట మరి!

* గత 50 ఏళ్లలోనే ఇక్కడ నివాసాలు బాగా విస్తరించాయి.

* ఊరి మధ్యలో అగ్ని పర్వత బిల ద్వారం ఉందని అయితే అది ఇప్పుడు నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోయిందని వీరంతా నమ్మేవారు. దాని వల్ల ప్రమాదమేం లేదని భావించి చక్కగా ఇళ్లు కట్టుకుని జీవిస్తున్నారు.

* అయితే ఓ ఇద్దరు అమెరికా శాస్త్రవేత్తలు ఒకసారి ఇక్కడున్న చర్చికి వచ్చారు. వెళుతుండగా ఆ చర్చి గోడ ఏదో చిత్రంగా కనిపించింది వారికి. ఇది దేంతో చేసిందా అని దాన్ని కొంచెం గీకిచూశారు.

* రాయిపై పరిశోధనలు చేశారు. చివరికి తెలిసిందేంటంటే అది క్వార్టిజ్‌ అనే అరుదైన రాయట. అది కేవలం ఉల్క, గ్రహ శకలంలాంటిది తాకడం వల్ల ఏర్పడే అధిక ఒత్తిడి వల్లే  పుడుతుందట.

* ఉల్క అలా భూమిని తాకినప్పుడు దాని పరిమాణాన్ని బట్టి అక్కడ కొన్ని కిలోమీటర్ల మేర గొయ్యి ఏర్పడుతుంది.

* దీంతో ఈ ఊరు ఉన్నది అగ్ని పర్వత బిలంలో కాదు. ఉల్కాపాతం లేదా గ్రహశకలం పడటం వల్ల ఏర్పడ్డ బిలంలో అని తేల్చారు. ఈ ఉల్కాపాతం దాదాపుగా 14.5 మిలియన్‌ ఏళ్ల కిందట జరిగి ఉండొచ్చని అంచనా వేశారు.

* ఈ విషయం తెలుసుకున్న ఈ పట్టణవాసులంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారట.

* ఈ బిలానికి 42 కిలోమీటర్ల దూరంలో ఇలాంటిదే ఇంకో ఉల్కాపాత బిలాన్నీ వీరు గుర్తించారు. అది కేవలం 3.8కిలోమీటర్ల వృత్తంలో ఉందట. ఇవి రెండు ఇంచు మించుగా ఒక్కసారే ఏర్పడి ఉంటాయని తేల్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని