చెర్రీ పూలు... భూకంపాలు!

టోక్యో... జపాన్‌ దేశ రాజధాని. ప్రపంచంలో అతి పెద్ద నగరం. అంతేనా? ప్రపంచంలో మూడు ప్రధాన వాణిజ్య మహా నగరాల్లో ఇదీ ఒకటి. ఇంకా దీని విశేషాలు బోలెడున్నాయి. ఏమిటో గబగబా చదివేద్దామా!

Published : 14 Apr 2018 01:42 IST

మహా నగరం
చెర్రీ పూలు... భూకంపాలు!

టోక్యో... జపాన్‌ దేశ రాజధాని. ప్రపంచంలో అతి పెద్ద నగరం. అంతేనా? ప్రపంచంలో మూడు ప్రధాన వాణిజ్య మహా నగరాల్లో ఇదీ ఒకటి. ఇంకా దీని విశేషాలు బోలెడున్నాయి. ఏమిటో గబగబా చదివేద్దామా!

టోక్యో
నగరం: టోక్యో దేశం: జపాన్‌
విస్తీర్ణం: 2,187.66 చదరపు కిలోమీటర్లు
జనాభా: 1,36,17,444

* ఒకప్పుడు టోక్యో చిన్న ఫిషింగ్‌ విలేజ్‌. అసలు పేరు ఇడొ. 1868లో దీన్ని జపాన్‌ రాజధానిగా మార్చినప్పుడు టోక్యోగా పేరు మార్చారు. టోక్యో అంటే తూర్పు రాజధాని అని అర్థం.

* ఇక్కడ చెర్రీ చెట్లు ఎక్కువ. ఈ పూల చెట్లు ఏప్రిల్‌ నెలలో మొదటి రెండు వారాలు పూస్తాయి. ఈ కాలాన్ని హనామి అని పిలుచుకుంటారు. అందరూ కలిసి సందడిగా పండగ   జరుపుతారు.

* టోక్యోలో ప్రతి 12 మీటర్ల దూరానికో వెండింగ్‌ యంత్రం ఉంటుంది. ఇందులో అవసరమైన దుస్తులు, క్యాండీలు, డ్రింక్స్‌, పాలు, ఐస్‌క్రీమ్స్‌ వంటివెన్నో కొనేసుకుంటారు.

* సుకీజి పేరుతో పెద్ద చేపల మార్కెట్‌ ఉంటుంది. ప్రపంచంలోనే రద్దీగా ఉండే పెద్ద చేపల సంత ఇది. ఇదో మంచి పర్యాటక ప్రాంతం కూడా.

* టోక్యో ఖరీదైన హోటళ్లకు పెట్టింది పేరు. ఇక్కడి రిట్జ్‌ కార్ల్‌టన్‌ హోటల్‌  ప్రపంచంలోని ఖరీదైన హోటళ్లలో ఒకటి. ఇక్కడ ఒక్క రోజు రాత్రి ఉండటానికి మన   కరెన్సీలో ఆరున్నరలక్షల      రూపాయలు కావాలి.

* క్రైస్తవం, బౌద్ధం, షింటో ఇక్కడి ముఖ్య మతాలు.

* టోక్యోలో భూకంపాలు ఎక్కువ. 1703, 1782, 1812, 1855, 1923, 2011లలో భారీ భూకంపాలు వచ్చాయి. 1923లో వచ్చిన భూకంప ప్రమాదం 1,42,000 మందిని పొట్టన పెట్టుకుంది.

* మౌంట్‌ ఫ్యూజీ టోక్యో నుంచి కనిపించే ప్రముఖ ప్రదేశం. అయితే సంవత్సరంలో ఇది 180 రోజులు మాత్రమే కనిపిస్తుంది మిగిలిన రోజుల్లో మబ్బులు, ధూళి అడ్డొస్తాయి.

* అమెరికా బయట మొదటి డిస్నీల్యాండ్‌ని నిర్మించింది ఇక్కడే. 20 వేల మంది ఉద్యోగస్థులు పనిచేస్తారిక్కడ.

* షిబుయ క్రాసింగ్‌ ప్రపంచంలోని రద్దీ స్ట్రీట్‌ క్రాసింగ్‌. ఒకేసారి 2500 మంది జనాలు క్రాస్‌ అవుతుంటారు.

* ఈ నగరంలో షింజుకు స్టేషన్‌ అత్యంత రద్దీ రైల్వేస్టేషన్‌. రోజూ దాదాపు 37 లక్షల ప్రయాణికులు ఇక్కడికి వస్తుంటారు.

* ఈఫిల్‌ టవర్‌లానే ఇక్కడో ఎత్తయిన టవర్‌ ఉంది. పేరు టోక్యో టవర్‌. దీని ఎత్తు ఏకంగా 1,092 అడుగులు. ఇదో కమ్యూనికేషన్‌, అబ్జర్వేషన్‌ టవర్‌. ఎక్కడెక్కడి నుంచో సందర్శకులు వస్తుంటారు. 1958లో ఈఫిల్‌ టవర్‌ నిర్మాణాన్ని ఆదర్శంగా తీసుకుని కట్టారు. అయిదు సంవత్సరాలకోసారి రంగులతో ముస్తాబు చేస్తుంటారు. అందుకు 7500 గ్యాలన్ల పెయింట్‌ వాడతారు. దీనికి ఒక ఏడాది సమయం పడుతుంది.

* ఇక్కడ 100కు పైగా కళాశాలలు, విశ్వవిద్యాలయాలున్నాయి. అక్షరాస్యత 99శాతం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని