రాత్రివేళ.. కానీ చీకటి పడదు!

హాయ్‌ నేస్తాలూ! తెలుసా? సెలవుల్లో సరదాగా గడుపుదామని నేను నార్వేకి వెళ్లా. ఇప్పుడు అక్కడి నుంచే ఈ కబుర్లు చెబుతున్నా. ఇక్కడికి వస్తే ఎండాకాలంలోనే రావాలి. ఎందుకో తెలుసా? ఈ సమయంలో ఇక్కడో వింత జరుగుతుంది. అదేంటో చెబితే మీరూ ఆశ్చర్యపోతారు మరి. చెప్పేస్తున్నా....

Published : 22 May 2018 01:45 IST

చిన్నూ కబుర్లు
రాత్రివేళ.. కానీ చీకటి పడదు!

హాయ్‌ నేస్తాలూ! తెలుసా? సెలవుల్లో సరదాగా గడుపుదామని నేను నార్వేకి వెళ్లా. ఇప్పుడు అక్కడి నుంచే ఈ కబుర్లు చెబుతున్నా. ఇక్కడికి వస్తే ఎండాకాలంలోనే రావాలి. ఎందుకో తెలుసా? ఈ సమయంలో ఇక్కడో వింత జరుగుతుంది. అదేంటో చెబితే మీరూ ఆశ్చర్యపోతారు మరి. చెప్పేస్తున్నా.... మరేమో పగలూ రాత్రులు లేవు.  మీరు సరిగ్గానే చదివారు. మే నుంచి జులై వరకు ఇంచు మించు 76 రోజులు ఆకాశంలో సూరీడు కనిపిస్తూనే ఉంటాడు.

న దగ్గరైతే రాత్రి అయితే పడుకుంటాం. పొద్దునయితే లేస్తాం. కానీ ఇక్కడ అసలు రాత్రే లేదు కదా. అందుకే టైం చూసుకుని పడుకోవాలి. టైం చూసుకునే పనుల్లోకి వెళ్లాలి. అర్ధరాత్రిపూట సూరీడును చూస్తుంటే మాత్రం నాకు భలే థ్రిల్లింగ్‌గా ఉందండోయ్‌.
* పాపం... ఇలా సూర్యుడికి విశ్రాంతే లేదన్నమాట. ఉన్నా కొద్దిసేపే అది. ఈ మిడ్‌ నైట్‌ సన్‌ ఒక్క నార్వేలోనే కాదు. అమెరికాలోని అలాస్కా, ఉత్తర కెనడా, గ్రీన్‌ల్యాండ్‌, ఫిన్లాండ్‌, స్వీడన్‌ దేశాల్లోనూ ఉంటాడట. అందుకే వీటిని మిడ్‌నైట్‌ సన్‌ కంట్రీస్‌ అంటారు.

* కేవలం ఈ దేశాల్లోనే ఎందుకబ్బా అని మా మామయ్యని అడిగితే బోలెడు సంగతులు చెప్పారు. ఈ దేశాలు ఉత్తర ధ్రువం దగ్గర ఉన్నాయి కాబట్టే. అవును ధ్రువాల దగ్గర మాత్రమే ఇలా సూర్యుడు రాత్రుళ్లూ వెలుగులీనుతాడు. మరేమో బొంగరంలా గిరగిరా తిరిగే భూమి రెండు చివరల్లో పైనా కిందా ఉత్తర, దక్షిణ ధ్రువాలు ఉంటాయిగా. ఉత్తర ధ్రువం చుట్టూ ఉండేది ఆర్కిటిక్‌ ప్రాంతం. దక్షిణ ధ్రువం చుట్టూ అంటార్కిటికా ఉంటుంది. ఏడాదిలో ఆరునెలలు ఉత్తర ధ్రువం సూర్యునికి దగ్గరగా ఉంటుంది. అప్పుడు ఈ ప్రాంతంలో ఎండాకాలం. అదే సమయంలో దక్షిణ ధ్రువం సూర్యునికి దూరంగా ఉంటుంది. అప్పుడు దక్షిణ ధ్రువంలో శీతకాలం. భూమి సూర్యుని చుట్టూ తిరిగినప్పుడు కొద్దిగా వంగడం వల్లే ఈ రుతువులు ఏర్పడతాయి. అలా ఈ ధ్రువాల్లో ఎండాకాలం ఉన్నప్పుడు మాత్రమే కొన్ని రోజుల పాటు ఈ మిడ్‌ నైట్‌ సన్‌ వింత ఉంటుందన్నమాట.

* ఇది సరే... ‘మన దగ్గర పగటి పూట ఎండకే హడలిపోతాం. మరి ఇలా రోజంతా ఉంటే ఎలా?’ అని భయపడిపోనక్కర్లేదు. ఎందుకంటే ఇక్కడి ఎండ వెన్నెల్లా చల్లగా ఉంటుంది. ఎందుకో తెలుసా? ఇక్కడ సూర్యకిరణాలు ఎక్కువ దూరం వాతావరణంలో ప్రయాణం చేసేసి మొత్తం వేడిని కోల్పోతాయి. దీంతో కిందికి వచ్చేసరికి ఆ సూర్యకిరణాల వేడి ఉండదు. ఎండాకాలంలోనూ ఇక్కడ మరి ఎక్కువగా అంటే... ఉత్తర ధ్రువం దగ్గర 27 డిగ్రీల సెల్సియస్‌ వరకు చేరుతుందంతే. అదే మొత్తం మంచు ఆవరించి ఉన్న దక్షిణ ధ్రువం దగ్గరయితే మంచు కరిగే పరిస్థితి కూడా ఉండదట.

* ఇంకో విషయం.... రాత్రుల్లో తిరుగుతుంటే గమ్మత్తుగా ఉంది. ఈ ప్రాంతాల్లో సూర్యుడి వెలుగులున్నా వీధుల్లో జనాలు తక్కువే. కానీ కొంత మంది బోలెడు ఆటలు ఆడుకుంటున్నారు. ఇలా రాత్రిపూట వెలుగును చూస్తే ఎంతో ముచ్చటేసింది. పరిసరాలన్నీ ఎంత అందంగా ఉన్నాయో! నేను చాలా ఫొటోలు కూడా తీశా.  అయితే ఆకాశంలోకి చూడగానే ఒక్కసారిగా నాకో సందేహం వచ్చింది... మరి రాత్రుల్లో కనిపించే చంద్రుడు లేడే అని. అవును ఇలా మొత్తం సూరీడే ఉన్నప్పుడు చందమామ కనిపించలేదు నాకు. వెంటనే మా అమ్మనడిగితే చెప్పింది. ఇలా సూర్యుడు ఉన్నప్పుడు చంద్రుడు కనిపించడంట. ఎందుకంటే సూర్యచంద్రులు ఒకరికొకరు వ్యతిరేక దిశల్లో తిరగడం వల్లే.
* గమ్మత్తయిన సంగతులన్నీ మీతో చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక ఉంటానే బైబై!

సహకారం: సి.వి. సర్వేశ్వర శర్మ, ప్రెసిడెంట్‌, కోనసీమ సైన్స్‌ పరిషత్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని