మంచి ‘కిక్‌’ ఇచ్చే మైదానాలు!

ప్రపంచవ్యాప్తంగా బోలెడన్ని ఫుట్‌బాల్‌ మైదానాలు... కానీ వాటిలో కొన్ని చాలా ప్రత్యేకమైనవి... ఏంటో అవి? ఎందుకో గొప్పవి? పదండి తెలుసుకుందాం!

Published : 19 Jun 2018 01:50 IST

మంచి ‘కిక్‌’ ఇచ్చే మైదానాలు!

ప్రపంచవ్యాప్తంగా బోలెడన్ని ఫుట్‌బాల్‌ మైదానాలు... కానీ వాటిలో కొన్ని చాలా ప్రత్యేకమైనవి...  ఏంటో అవి? ఎందుకో గొప్పవి? పదండి తెలుసుకుందాం!

నీటిపై ఆడితే!

నిండుగా పచ్చని గడ్డి... ఆటగాళ్ల కోసం విశాలమైన మైదానం... ప్రేక్షకుల కోసం సౌకర్యాలు... చాలా మైదానాలూ ఇలానే ఉంటాయ్‌. దీని ప్రత్యేకత ఏంటి? అంటారా? ఈ స్టేడియం ఉన్నది నేలపైన కాదు. నీటిలో. అందుకే దీన్ని ‘ఫ్లోటింగ్‌ ఫ్లాట్‌ఫాం’ అంటూ పిలిచేస్తారు. ఇంతకీ ఇది ఎక్కడుందో చెప్పలేదు కదూ.. సింగపూర్‌లోని మిడిల్‌ ఆఫ్‌ మెరినా బేలో.

* ఇలా నీటిపై తేలే మైదానాల్లో ఇదే పెద్దది. ఒకేసారి 30 వేల మంది చూడ్డానికి వీలుంటుంది. 2007లో ప్రారంభమైన ఈ స్టేడియం ఇప్పటి వరకు ఎన్నో ఫుట్‌బాల్‌ పోటీలకు వేదికైంది.

* దీనికే మెరినా బే ఫ్లోటింగ్‌ ఫ్లాట్‌ఫాం, ఫ్లోట్‌ ఎట్‌ మెరినా బే అంటూ రకరకాల పేర్లూ ఉన్నాయి. 393 అడుగుల పొడవు, 272 అడుగుల వెడల్పుతో ఉండే ఈ స్టేడియం మొత్తం స్టీలుతో కట్టారు.

నేరుగా సముద్రంలోకే!

ఈ మైదానంలో ఆటగాళ్లు కాస్త గట్టిగా కిక్‌ చేశారంటే బంతి వెళ్లి నేరుగా సముద్రంలో పడిపోతుంది. ఎందుకంటే ఆ ఫుట్‌బాల్‌ మైదానం ఉన్నది సముద్రం పక్కనే. దీని పేరు ఐడి స్టేడియం. ఇదో వింత సాకర్‌ మైదానం. ఫారో దీవుల్లో ఐడి అనే ఓ టౌన్లో ఉంది. ఇంచుమించు 700 మంది నివసిస్తారీ ఊళ్లో.  ఈ మైదానం పక్కనే కొన్ని అడుగుల దూరంలోనే అట్లాంటిక్‌ సముద్రం ఉంటుంది. అంతేకాదూ.. దీనికి ఇంకో వైపు కొండలు, పక్కనే అందమైన సరస్సూ ఉంటాయి. ఎక్కడైనా మైదానంలో ఆటలే కనువిందు చేస్తాయ్‌. కానీ ఇక్కడైతే ఆటతో పాటు చుట్టుపక్కల ప్రకృతి అందాలూ భలేగా ఆకట్టుకుంటాయ్‌.

పర్వతాల అంచున!

ఒట్‌మార్‌ హిట్జ్‌ఫెల్డ్‌ స్టేడియంలో జరిగే ఆట చూడాలంటే ఎంతో ఎత్తుకు వెళ్లాలి మరి. ఎందుకో తెలుసా? ఈ మైదానం ఉన్నది ఆల్ఫ్స్‌ పర్వతాల దగ్గర. అవును... స్విట్జర్లాండ్‌లోని జిస్పన్‌ గ్రామంలో ఉందిది. సముద్ర మట్టానికి రెండు వేల మీటర్ల ఎత్తులో ఉండే ఈ స్టేడియం ఐరోపా మొత్తంలోనూ ఎత్తయిన ఫుట్‌బాల్‌ గ్రౌండ్‌. అంతఎత్తులో ఉంటే బంతులు కిందపడిపోవూ... అందుకే రక్షణగా వలలూ కట్టి ఉంచారు.

దీవంతా...!

అదో చిన్న మైదానమే కావచ్చు. ప్రేక్షకులు కూర్చోడానికి కుర్చీలూ సరిగా లేకపోవచ్చు. కానీ ప్రపంచంలో అందమైన ఫుట్‌బాల్‌ స్టేడియాల్లో ఒకటి. ఎందుకంటే ఇదున్నది ఓ రాతి ద్వీపంలో. చుట్టూ కొండలు, దాని చుట్టూ సముద్రం. చూడ్డానికే భలే గమ్మత్తుగా ఉంటుందీ స్టేడియం. చూడాలని ఉందా? అయితే పదండి నార్వేలోని హెన్నింగ్స్‌వ్యార్‌ అనే ఓ చిన్న ఊరికి. రాళ్లనే చదునుగా చేసి కట్టారీ మైదానాన్ని.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని