హిమ‌మేదో కురిసింది.. నేలంతా మెరిసింది!

రష్యా పేరు వినగానే ఇప్పుడైతే అందరికీ ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ గుర్తొచ్చేస్తోంది. కానీ మామూలుగా అయితే అక్కడున్న సైబీరియా, ఆ మంచూ కళ్లలో కదలాడతాయి. మరి తెలుసా? సైబీరియా కెనడాకంటే పెద్దది. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు ఇంకా బోలెడున్నాయి. పదండి చదివేద్దాం. రష్యాలో 65శాతం నేల ఎప్పుడూ మంచుతో కప్పే ఉంటుంది.

Updated : 12 Nov 2022 16:50 IST

హిమ‌మేదో కురిసింది.. నేలంతా మెరిసింది!

రష్యా పేరు వినగానే ఇప్పుడైతే అందరికీ ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ గుర్తొచ్చేస్తోంది. కానీ మామూలుగా అయితే అక్కడున్న సైబీరియా, ఆ మంచూ కళ్లలో కదలాడతాయి. మరి తెలుసా?  సైబీరియా కెనడాకంటే పెద్దది. దీనికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాలు ఇంకా బోలెడున్నాయి. పదండి చదివేద్దాం.

రష్యాలో 65శాతం నేల ఎప్పుడూ మంచుతో కప్పే ఉంటుంది. అందులో చాలామటుకు నేల ఈ సైబీరియాలోదే.

* ఇక్కడ ఏడాదిలో సరాసరిన చూసుకుంటే -5డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. సరాసరిన అత్యల్పంగా జనవరిలో -25 డిగ్రీలుంటుంది. జులైలో సరాసరిన అత్యధికంగా 17డిగ్రీలు నమోదవుతుంది. ఆర్కిటిక్‌ వలయానికి దగ్గరగా ఉండే సైబీరియా ప్రాంతంలో అయితే వేసవి దాదాపుగా ఒక్క నెలే ఉంటుందట.

* ప్రపంచంలో అతి పొడవైన పది నదుల్లో నాలుగు ఇక్కడే ఉన్నాయి.

లేక్‌ బైకాల్‌

ప్రపంచంలోనే అతిపెద్ద మంచి నీటి సరస్సు బైకాల్‌ ఉన్నది ఇక్కడే. అది అతి పురాతనమైన సరస్సూనూ. భూ ఫలకాలు అటూఇటూ సర్దుకున్నప్పుడు వచ్చిన లోయలో ఏర్పడింది.

* భూమిపై ఉన్న మంచి నీళ్లలో.. 22 నుంచి 23 శాతం నీరు దీంట్లోనే ఉంది.

* 88లక్షల హెక్టార్లలో ఉంది. దీని పొడవు 636 కిలోమీటర్లు. అంటే ఇంచుమించు హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వరకు అన్నమాట.

* సరాసరిన దీని లోతు 744 మీటర్లు. అంటే రెండు ఈఫిల్‌ టవర్లను ఒకదానిపై ఒకటి నిలబెట్టినా మునిగిపోతాయంతే.

* జనవరి నుంచి మే వరకు ఇది పూర్తిగా గడ్డకట్టే ఉంటుంది. తర్వాత వేసవికాలం వస్తుంది కాబట్టి కాస్త మంచు కరుగుతుంది.

* యునెస్కో 1996లో దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. * దీంట్లో 27 ద్వీపాలూ ఉన్నాయి.

భూమి ఘనం.. జనం కొంచెం!

అతి పెద్ద దేశం రష్యా కదా. దాంట్లో 77శాతం భూమి సైబీరియాదే.
* కోటీ 31లక్షల చదరపు కిలోమీటర్లకుపైగా భూమి ఉంది.

* ఇది మన భారత దేశ విస్తీర్ణం కంటే నాలుగింతలుపైనే ఎక్కువ. దీంట్లో నివసించే జనాభా మాత్రం దాదాపుగా మూడున్నర కోట్లమంది అంతే! ః మొత్తం భూమిపై దీని విస్తీర్ణమే పదిశాతమట.

* ఇంత పెద్ద భూభాగం కాబట్టే దీన్ని ముద్దుగా నార్త్‌ ఆసియా అని పిలిచేస్తుంటారు.

* సైబీరియన్‌ హస్కీస్‌ అనే కుక్కల జాతి ఎక్కువగా ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది.

* యునీకార్న్‌ అనే కొమ్ముల గుర్రాల గురించి మనం కథల్లోనే వింటాం. కానీ అలాంటి జంతువు ఒకప్పుడు ఇక్కడ ఉండేదట.

* 1200జంతు, 600మొక్క జాతులకిది పుట్టిల్లు.

సరిహద్దులివీ..

ఆసియా ఖండం ఉత్తర భాగంలో ఉందిది. అంటే మన దేశానికి పైవైపు దిశగా అన్నమాట. దీనికి తూర్పున ఫసిపిక్‌ మహా సముద్రం, పడమరన ఉరల్‌ పర్వతాలు, ఉత్తరాన ఆర్కిటిక్‌ సముద్రం, దక్షిణాన కజకిస్థాన్‌, మంగోలియా, చైనాలు సరిహద్దులు. ఇది అతి పెద్ద ప్రాంతం కదా. అందుకే దీన్ని మళ్లీ ఉప ప్రాంతాలుగా విభజించారు.

జీవనం

* అత్యంత చలి ఉండే ఈ ప్రాంతంలో జీవించే ప్రజల్ని సూపర్‌ హ్యూమన్స్‌గా అభివర్ణిస్తారు. చాలా ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ వీరు ఎలాంటి ఇబ్బందీ లేకుండా జీవిస్తుంటారు కాబట్టే.

* నెనెట్స్‌, కోమి, మాన్సి, ఖాంతి... లాంటి 40కిపైగా స్థానిక తెగలవారున్నారు.

* ఏడాదిలో చాలా రోజులపాటు వీరు కళ్లు, ముఖం తప్ప మిగతా శరీరాన్నంతా మందపాటి స్వెట్టర్లతో కప్పుకొంటారు. జంతువుల చర్మాలతో చేసిన దుస్తుల్ని ధరిస్తుంటారు.

* పిల్లలు, పెద్దలూ రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి గడ్డకట్టిన నీళ్లలోకీ దిగి స్నానాలు చేస్తుంటారు.

* దక్షిణ సైబీరియాలో గనులు, పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడి వారు ఆ పనులే చేసుకుంటూ జీవనం సాగిస్తారు. ఉద్యోగులకు మంచి జీతాలే ఉంటాయట. కానీ బయట తిరిగి ఖర్చు చేయడానికి మాత్రం పెద్దగా ఆస్కారం ఉండదట.

* సైబీరియా పశ్చిమ భాగంలో కొంత కాలం మంచు ఉండదు. కాబట్టి ఆ ప్రాంతంలో ఉండేవారు కొద్దిగా పంటలు పండిస్తారు. గ్రీన్‌ హౌసుల్లో టమాటాలు, క్యాబేజీలు, వంగ, దోసకాయల్లాంటి కూరగాయల్ని పండిస్తారు. గొర్రెలు, గుర్రాలు, పశువుల్ని పెంచుకుంటారు. చేపలు, జంతువుల్ని వేటాడతారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని