సరస్సులోని  ఊరు!

సరస్సులో ఎక్కడైనా నీళ్లుంటాయిగానీ ఊళ్లుంటాయా? కానీ ఓ చోట నిజ్జంగానే  ఊరుంది. ఎక్కడంటే ఆ సరస్సులో ఉన్న దీవుల్లో. అసలీ గందరగోళం ఏంటీ అంటే?  ఈ సరస్సు ఉన్నది చైనాలో. అక్కడి జెజియాంగ్‌ ప్రావిన్సులోని చునాన్‌ కౌంటీలో...

Published : 20 Nov 2018 01:33 IST

అనగనగా ఓ సరస్సుంది... 
ఆ సరస్సులో ఓ ఊరుంది... 
ఆ ఊరు కొన్ని ద్వీపాల్లో ఉంది... 
ఆ ద్వీపాల్లో కాలువలున్నాయి... 
ఆ కాలువలు గుహల్లోనూ ప్రవహిస్తాయి.. 
ఏంటో ఈ చిత్రం... 

మనమూ చూసొద్దాం! 

సరస్సులోని  ఊరు!


రస్సులో ఎక్కడైనా నీళ్లుంటాయిగానీ ఊళ్లుంటాయా? కానీ ఓ చోట నిజ్జంగానే  ఊరుంది. ఎక్కడంటే ఆ సరస్సులో ఉన్న దీవుల్లో. అసలీ గందరగోళం ఏంటీ అంటే? 
ఈ సరస్సు ఉన్నది చైనాలో. అక్కడి జెజియాంగ్‌ ప్రావిన్సులోని చునాన్‌ కౌంటీలో. 
ఇంతకీ దీని పేరేంటో చెప్పలేదు కదూ. చింగ్‌డావ్‌ లేక్‌. దీనికి థౌజండ్‌ ఐలాండ్‌ లేక్‌ అనే పేరూ ఉంది. అంటే వెయ్యి దీవుల సరస్సన్నమాట. 
దీనిలో 1,078 పెద్ద దీవులున్నాయి. చిన్నవైతే ఇంకా చాలానే ఉన్నాయి. 
మొత్తం 573 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందీ సరస్సు. అందుకే దీనిలోని దీవులపై ఇళ్లుంటాయి. వాటిని కలుపుతూ మధ్య మధ్యలో వంతెనలూ, రహదారులూ ఉంటాయి. ఇంకా ఒక ఇంటి నుంచి మరో ఇంటికి పడవల్లోనూ వెళుతుంటారు. 
మనుషులకే కాదు ఈ సరస్సులో జంతువులకూ కొన్ని దీవులున్నాయి. అందుకే పక్షుల దీవి, కోతుల దీవి, పాముల దీవి... లాంటివీ ఉన్నాయిక్కడ. 
ఇంత చిత్రమైన సరస్సు ఊరు ఎలా వచ్చిందో తెలుసా? అంతకు ముందు ఈ ప్రాంతంలో మామూలుగానే ఇళ్లుండేవి. 1959లో ఇక్కడ గ్జినాన్‌ నదిపై విద్యుత్‌ ఉత్పత్తి ప్రాజెక్టును నిర్మించారు. ఇప్పుడు ఈ ప్రాంతమంతా దానికి రిజర్వాయర్‌గా చేశారు. అందులో భాగంగానే ఇక్కడ ఈ సరస్సు ఏర్పడింది. 

సరస్సులోని  ఊరు!

దీంతో ఇక్కడుండే ప్రజలంతా దీవులుగా మారిన ఎత్తయిన ప్రాంతాల్లోకి నివాసాలు మార్చుకున్నారు. అలా ఇక్కడ సరస్సులో ఊరు ఏర్పడిపోయిందన్నమాట. ఈ ఊరునీ సరస్సు పేరుతోనే పిలవడం విశేషం. 
నివాసాలు రావడంతో అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఇక్కడ రవాణా వ్యవస్థల్ని అభివృద్ధి చేసింది. 
ఇక్కడి దీవుల్లో కొన్ని గుహల్లాంటివీ ఉన్నాయి. వాటిల్లోంచి నీరు కాలువల్లాగ ప్రవహిస్తుంటుంది. 
చుట్టూ పర్వతాలతో, దట్టమైన అడవులతో చూడ్డానికి భలే అందంగా ఉంటుందీ చోటు. 
అందుకే దీన్ని చూసేందుకు పర్యటకులూ ఆసక్తి చూపిస్తున్నారు. ఏదో కథల్లోని ఊరిలా ఉందంటూ మురిసిపోతుంటారు. దీంతో ఇక్కడ రిసార్టులూ, రెస్టారెంటులు సైతం వెలిశాయి. భలే చిత్రమైన ఊరే!

సరస్సులోని  ఊరు!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని