గూఢచారుల ఊరు!

పోర్చుగల్‌ దేశ రాజధాని నగరం లిస్బన్‌. ఇక్కడ అతి పెద్ద నగరమూ ఇదే. పశ్చిమ ఐరోపాలో ప్రాచీన నగరంగా దీనికి ...

Published : 01 Dec 2018 02:00 IST

మహా నగరం 
లిస్బన్‌ 

గూఢచారుల ఊరు!

నగరం: లిస్బన్‌ 
దేశం: పోర్చుగల్‌ 
జనాభా: ఐదు లక్షలకు పైమాటే 
విస్తీర్ణం: 100.05 చదరపు కిలోమీటర్లు 


పోర్చుగల్‌ దేశ రాజధాని నగరం లిస్బన్‌. ఇక్కడ అతి పెద్ద నగరమూ ఇదే. పశ్చిమ ఐరోపాలో ప్రాచీన నగరంగా దీనికి గుర్తింపు ఉంది. 
* ఈ నగరం అంతా ఏడు కొండలపై నిర్మితమైంది. అందుకే దీనికి ‘ద సిటీ ఆఫ్‌ సెవెన్‌ హిల్స్‌’ అనే పేరుంది. అయితే ఈ కొండలు ఏడు కాదు, ఎనిమిదనే వాదనా ఉంది. 
* ఈ ప్రాచీన నగరంలో అంతకు ముందు చాలా పురాతన భవంతులుండేవి. అవన్నీ 1755లో వచ్చిన అతి పెద్ద భూకంపంలో నేలకొరిగాయి. ఈ భూకంపాన్ని ‘ద గ్రేట్‌ లిస్బన్‌ ఎర్త్‌క్వేక్‌’ అని పిలుస్తారు. 
* ఇక్కడి శాంటా ఎన్‌గ్రేసియా చర్చికి ఓ చిత్రమైన గిన్నిస్‌ రికార్డుంది. అదేంటంటే ఎక్కువ కాలం నిర్మాణంలో ఉన్న చర్చిగా. దీని నిర్మాణ పనులు 17వ శతాబ్దంలో ప్రారంభమై 20వ శతాబ్దంలో పూర్తయ్యాయి మరి! 
* ‘సిటీ ఆఫ్‌ స్పైస్‌’ అని దీనికి పేరుంది. అంటే గూఢచారుల నగరమని అర్థం. ప్రపంచ యుద్ధం సమయంలో రెండు పక్షాలకూ సహకరించకుండా పోర్చుగల్‌ వారు మధ్యస్తంగా ఉండేవారు. ఆ సమయంలో ఇక్కడ కొందరు గూఢచారులుగానూ పనిచేసేవారు. దీంతోనే 
ఈ ఊరికి ఈ పేరొచ్చింది. 
* ఇక్కడ కాకుల్ని విన్‌సెంట్‌ అని పిలుస్తారు. పన్నెండో శతాబ్దంలో ఉన్న మత పెద్ద పేరు మీదుగా వీటినిలా అంటారు. అంతేకాదు వీటిని పెంపుడు జంతువుల్లాగానూ పెంచుకుంటారు. ఈ నగరానికి గుర్తూ కాకే. 
* ఇక్కడున్న ఓషనేరియం ప్రపంచంలోనే అతి పెద్ద అక్వేరియంల్లో ఒకటి. ఎనిమిది వేలకు పైగా రకాల సముద్రపు జీవుల్ని ఇందులో చూడొచ్చు. 16వేలకు పైగా జీవులున్నాయిందులో. 
* ఏటా 40లక్షల మందికి పైగా ఈ నగరాన్ని సందర్శిస్తున్నారు.

గూఢచారుల ఊరు!

*గ్రాఫిటీ ఇక్కడ ప్రసిద్ధ కళ. భవంతుల నుంచి  వీధుల్లోని గోడల వరకు, రోడ్ల నుంచి వంతెనల వరకూ అన్నీ పెయింటింగ్‌లతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

గూఢచారుల ఊరు!

*బెలమ్‌ టవర్‌ ప్రముఖ పర్యటక ఆకర్షణ. టాగూస్‌ నది ఒడ్డున ఉంటుంది. ఈ నగరాన్ని చూడ్డానికి వచ్చిన వారు దీని అందమైన వాస్తు కళను చూడ్డానికే వస్తుంటారు. అయితే ఇది ఒకప్పుడు జైలు. ఇప్పుడు కస్టమ్స్‌ కార్యాలయం. ప్రపంచ వారసత్వ కట్టడమూనూ.

గూఢచారుల ఊరు!

*బెర్‌ట్రెండ్‌ అనే ఓ పుస్తకాల దుకాణముంది. అది ప్రపంచంలోని అతి చిన్న పుస్తకాలషాపు. ప్రాచీనమైనదీనూ. మన ఇంటి గుమ్మమంతలోనే దుకాణం మొత్తం ఉంటుంది. నాలుగువేలకు పైగా పుస్తకాల్ని పెట్టే చోటుందట ఇందులో. ఎవరైనా దుకాణంలోకి వెళ్లాలంటే దుకాణదారుడు బయటకు రావాలి. అంటే ఒక్కళ్లు పట్టే చోటే లోపల ఉంటుందన్నమాట.

గూఢచారుల ఊరు!

*అందరికీ నోరూరించే వంటకంగా పేస్టీస్‌ దెనాటాకు పేరుంది. స్థానిక బేకరీలన్నింటిలోనూ దొరికే తీపి పదార్థం ఇది. కస్టర్డ్‌పౌడర్‌తో తయారు చేస్తారు.

గూఢచారుల ఊరు!

* ఇక్కడున్న వాస్కోడీగామా బ్రిడ్జ్‌ ఐరోపాలోనే అతి పొడవైనది. పదిహేడు కిలోమీటర్ల పొడవుంటుంది.

గూఢచారుల ఊరు!

*రియో డి జనీరోలో ఉన్న యేసుక్రీస్తు విగ్రహానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది కదా. దాన్ని సందర్శించిన పోర్చుగీసు మత పెద్ద ఇలాంటిది తమ ఊరిలోనూ ఒకటి ఉంటే బాగుండును అనుకున్నారు. తర్వాత అచ్చంగా అలాంటి దాన్నే ఇక్కడా తీర్చిదిద్దారు.

గూఢచారుల ఊరు!

* రోడ్డు మీదా, నీళ్లలోనూ ప్రయాణించగల హిప్పో బస్‌ ఇక్కడుంది. దీంతో ఇక్కడకొచ్చిన పర్యటకులూ దీనిలో ఓ రైడ్‌కి తప్పనిసరిగా వెళ్లొస్తుంటారు.


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని