నగరమందు గ్రామముంది !

నగరాల పక్కనున్న పల్లెటూళ్లను చూసుంటారు... కానీ నగరాల మధ్యలోనే ఉన్న గ్రామాల్ని చూశారా? అదేంటీ? అలాక్కూడా ఉంటాయా? అనుకోకండి. ఓ దేశంలో అలాంటివీ ఉన్నాయి మరి!చుట్టూ ఎత్తయిన ఆకాశహర్మ్యాలుంటాయి. అవన్నీ ఓ నగరానివి. ఆ మధ్యలో ఓ చిన్న గ్రామం. ఇరుకిరుకు ఇళ్లు. అవి మాత్రం ఓ గ్రామంలోవి. మనందరికీ ఇలాంటివి తెలియకపోవచ్చు. కానీ చైనాలో చాలా నగరాల్లో మాత్రం ఇలాంటి గ్రామాలు కనిపిస్తాయి.....

Published : 04 Jan 2019 00:19 IST

నగరమందు గ్రామముంది !

నగరాల పక్కనున్న పల్లెటూళ్లను చూసుంటారు... కానీ నగరాల మధ్యలోనే ఉన్న గ్రామాల్ని చూశారా? అదేంటీ? అలాక్కూడా ఉంటాయా? అనుకోకండి. ఓ దేశంలో అలాంటివీ ఉన్నాయి మరి!
చుట్టూ ఎత్తయిన ఆకాశహర్మ్యాలుంటాయి. అవన్నీ ఓ నగరానివి. ఆ మధ్యలో ఓ చిన్న గ్రామం. ఇరుకిరుకు ఇళ్లు. అవి మాత్రం ఓ గ్రామంలోవి. మనందరికీ ఇలాంటివి తెలియకపోవచ్చు. కానీ చైనాలో చాలా నగరాల్లో మాత్రం ఇలాంటి గ్రామాలు కనిపిస్తాయి.
* నగరాల మధ్యలో ఒద్దికగా ఒదిగిపోయిన ఈ గ్రామాల్ని అర్బన్‌ విలేజెస్‌ అంటూ పిలుస్తారక్కడ.
* బీజింగ్‌, షెన్జెన్‌, గ్వాంగ్‌ఝూ.. లాంటి నగరాల్లో ఇలాంటి వాటిని చూడొచ్చు.
* ఇంతకీ ఈ అర్బన్‌ విలేజెస్‌ కథాకమామీషు ఏంటంటే? చైనాలో జనాభా వేగంగా పెరిగిపోతోంది. ఇప్పటికే ఆ జనాభాలో 50శాతానికి పైగా నగరాల్లోనే ఉన్నారు. 2025నాటికి ఇది 70శాతానికి చేరుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో గ్రామాల్లోని ప్రజలు చుట్టుపక్కలున్న సిటీలకు వలసలు వచ్చేస్తున్నారు. అందుకే నగరాలు శర వేగంగా విస్తరించడం మొదలు పెట్టాయి. పంటపొలాలు మాయమయ్యాయి. వాటి స్థానంలో పెద్ద పెద్ద ఆకాశహర్మ్యాలు వెలిశాయి. ఈ నగరాలిలా విస్తరించే క్రమంలో గ్రామాలు ఇలా నగరాల మధ్యలోకి వచ్చేశాయి. చుట్టూ నగరాలకి సంబంధించిన భవంతులు కనిపిస్తుంటే మధ్యలో మాత్రం గ్రామాలు అలానే నిలిచిపోయాయి.
* అయితే ఆ గ్రామాల్నీ తొలగించి ఆకాశహర్మ్యాలు ఎందుకు నిర్మించలేదు? అనే సందేహం ఎవరికైనా వస్తుంది. ఎందుకంటే ఆ స్థలాల్ని గ్రామం నుంచి నగరంగా మార్చాలంటే అక్కడి ప్రజలందరికీ పెద్ద ఎత్తున నష్టపరిహారాలు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో వాటి స్థలాల్ని నగరం కిందికి నమోదు చెయ్యడానికి ఎవరూ ఆసక్తి చూపడం లేదు.  ఫలితంగా ఈ అర్బన్‌ విలేజెస్‌ తయారయ్యాయన్నమాట.
* ఇలాంటి అర్బన్‌ విలేజెస్‌లో అతి పెద్దది షైపాయ్‌. గ్వాంగ్‌ఝూ మధ్యలో ఉంటుందిది. ఇక్కడ చదరపు కిలోమీటర్‌కి యాభై వేల మంది జనాభా ఉన్నార్ట. భలే చిత్రమైన ఊళ్లే కదూ...!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని