పండగ కోసం కడితే ప్రపంచ వింతయ్యింది!

నేస్తాలూ! నేను చిన్నూ! ఈసారేమో పారిస్‌ వెళ్లొచ్చా. ఈఫిల్‌ టవర్‌ చూసొచ్చా. దాని గొప్పేంటో తెలుసా? అది ప్రపంచంలోనే అతి ఎత్తయిన ఐరన్‌ టవర్‌. చూస్తుంటే అది ఆకాశానికి తగులుతున్నట్టే ఉంది తెల్సా. అక్కడికెళ్లాక దాని విశేషాలు ఇంకా బోలెడన్ని తెలిశాయి... అవన్నీ మీ చెవిలో పడేద్దామని ఇలా వచ్చేశా.

Published : 10 Jan 2019 00:45 IST

పండగ కోసం కడితే ప్రపంచ వింతయ్యింది!

నేస్తాలూ! నేను చిన్నూ! ఈసారేమో పారిస్‌ వెళ్లొచ్చా. ఈఫిల్‌ టవర్‌ చూసొచ్చా. దాని గొప్పేంటో తెలుసా? అది ప్రపంచంలోనే అతి ఎత్తయిన ఐరన్‌ టవర్‌. చూస్తుంటే అది ఆకాశానికి తగులుతున్నట్టే ఉంది తెల్సా. అక్కడికెళ్లాక దాని విశేషాలు ఇంకా బోలెడన్ని తెలిశాయి... అవన్నీ మీ చెవిలో పడేద్దామని ఇలా వచ్చేశా.

పండగ కోసం కడితే ప్రపంచ వింతయ్యింది!కట్టడం: ఈఫిల్‌ టవర్‌
ఎత్తు: 1,063 అడుగులు
ప్రారంభం: 1889 మార్చి31

ఎందుకు కట్టారంటే?

అసలు విషయం ఏమిటంటే దీన్ని శాశ్వత కట్టడం అనుకుని ఏం కట్టలేదట. తాత్కాలికంగానే కట్టారట. కానీ ఇప్పుడిదే ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచిపోయింది. 1889లో పారిస్‌లో ఓ వరల్డ్‌ ఫెయిర్‌ జరిగింది. దానికి గుమ్మంలాగా ఏదైనా చిత్రంగా తయారు చేయాలని అనుకున్నారు. మొత్తం ఇనుప ఊచలతోనే దీన్ని ఇలా కట్టేశారంటే నాకెంత ఆశ్చర్యమేసిందో! 1887 జనవరి 28న దీని నిర్మాణం ప్రారంభమైంది. 1889 మార్చి 15న పూర్తయ్యింది. దీన్ని కట్టేందుకు అయిన ఖర్చు ఇప్పటి డబ్బుల్లో చూసుకుంటే దాదాపు 280కోట్లకు పైనేనట.

ఎవరి ఆలోచనంటే?

ఫ్రెంచ్‌ వారి సంస్కృతీ సంప్రదాయాలకు గుర్తుగా ఈ కట్టడం ఉండాలనుకున్నారు. స్టీఫెన్‌ సావెస్ట్రే, మారిస్‌ కోయిచ్లిన్‌, ఎమిలే నౌగ్యుయర్‌లాంటి ఆర్కిటెక్ట్‌లు, సివిల్‌ ఇంజినీర్లు దీనికి పని చేశారు. ఆర్కిటెక్ట్‌ గుస్తావ ఐఫిల్‌కి చెందిన ఫ్రెంచ్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ సంస్థ దీన్ని
రూపొందించడంలో ముఖ్యపాత్ర పోషించింది. ఆయన పేరు మీదే దీనికి ఐఫిల్‌ టవర్‌ అనే పేరొచ్చేసింది. అయితే మనందరికీ మాత్రం ఈఫిల్‌ టవర్‌ అనేయడం అలవాటు అయిపోయింది.

ఎక్కడుందంటే?
ఫ్రాన్స్‌ దేశ రాజధాని పారిస్‌లో ఈ ఈఫిల్‌ టవర్‌ ఉంది.

ఎలా ఉంటుందంటే?

ఇదిగో మీకు చిత్రం చూస్తేనే అర్థమవుతోంది కదా. ఇందులో మూడు అంతస్తులున్నాయి. పైకెళ్లడానికి మొత్తం ఎనిమిది గాజు లిఫ్టులున్నాయి. జామ్మంటూ పైకి మోసుకెళ్లిపోతాయవి. మొదటి రెండు అంతస్తుల్లో   రెస్టారెంటులున్నాయి. వీటిలోకి వెళ్లడానికి లిఫ్టుతోపాటు మెట్లూ ఉన్నాయి. ఇక మూడో అంతస్తు అంటే చాలా పైనుందే.. అక్కడికి వెళ్లేందుకు మాత్రం లిఫ్టు ఎక్కాల్సిందే. అక్కడ బైనాక్యులర్‌లుంటాయి. వాటిలోంచి పారిస్‌ మొత్తాన్ని ఎంచక్కా చూసేయొచ్చు. అదంతా ఓ గమ్మత్తయిన అనుభూతిలేండి. అయితే మొదటి రెండు అంతస్తులకు చేరుకోవడానికి ఒక టిక్కెట్టు ఉంటుంది. చాలా పైకెళ్లాలంటే మరో టిక్కెట్టు తీసుకోవాల్సి ఉంటుంది.

రూపం విశేషాలేంటంటే?

పండగ కోసం కడితే ప్రపంచ వింతయ్యింది!

ఇక కింద నాలుగు స్తంభాలతో, పైకొచ్చేసరికి ఒకే టవర్‌లా మారే దీని రూపానికి ఎంతో ప్రత్యేకత ఉంది. 12000 ఇనుప ఊచల్ని ముందు కావాల్సిన ఆకారంలో బిగించారు. అందుకు దాదాపుగా 70లక్షల మేకుల్ని వాడారట. తర్వాత వాటన్నింటినీ కూర్చి ఇలా టవర్‌లా నిలబెట్టారు. ముందు దీన్ని ఫెయిర్‌ అయిపోగానే తీసేయాలని అనుకున్నారు. కానీ ఇది ఇంత అందంగా ఉంది. వచ్చిన వారంతా దీన్ని చూసి సంబరపడిపోయారట. దీంతో దీన్ని పర్యటక ఆకర్షణగా ఇలాగే ఉంచేయాలని నిర్ణయించార్ట. చుట్టూ పచ్చికబయళ్లు, నీటి కొలనుల్ని తీర్చిదిద్దారు. అందమైన గార్డెన్‌లో ఉందా ప్రాంతమంతా. ఏటా ఇక్కడికి 70లక్షల మందికి పైగా పర్యటకులు వస్తున్నార్ట.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని