80 ద్వారాల మహా మైదానం!

కట్టడం: కొలోసియంఎప్పుడు: క్రీస్తుశకం 72లోహాయ్‌ ఫ్రెండ్స్‌... నేనే మీ చిన్నూని... ఈసారి ఎక్కడికి వెళ్లానో తెలుసా? ఒకప్పుడు అక్కడ భయంకరమైన పోటీలు జరిగాయి... జంతువులతో పోరాటాలు సాగాయి... అదొక ప్రపంచ వింతగా పేరొందింది... ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా ప్రదర్శనశాల... అదేంటో చెప్పేస్తున్నా... చెప్పేస్తున్నా... ‘కొలోసియం’...  మరి దాని సంగతులేంటో మొదలెట్టనా?

Updated : 06 Feb 2019 00:20 IST

 

కట్టడం: కొలోసియం
ఎప్పుడు: క్రీస్తుశకం 72లో
హాయ్‌ ఫ్రెండ్స్‌... నేనే మీ చిన్నూని... ఈసారి ఎక్కడికి వెళ్లానో తెలుసా? ఒకప్పుడు అక్కడ భయంకరమైన పోటీలు జరిగాయి... జంతువులతో పోరాటాలు సాగాయి... అదొక ప్రపంచ వింతగా పేరొందింది... ప్రపంచంలోనే అతి పెద్ద క్రీడా ప్రదర్శనశాల... అదేంటో చెప్పేస్తున్నా... చెప్పేస్తున్నా... ‘కొలోసియం’...  మరి దాని సంగతులేంటో మొదలెట్టనా?

ఎక్కడుంది?

ఇటలీలోని రోమ్‌ నగరం మధ్యలో. ఈ కొలోసియం ఒక యాంఫి థియేటర్‌. అంటే వృత్తాకారంలో ఉండి పైకప్పు లేని క్రీడారంగ ప్రదేశం అన్నమాట. మొదట్లో దీన్ని ఫ్లావియన్‌ యాంఫి థియేటర్‌ అని పిలిచేవారు. ప్రపంచంలోనే అతిపెద్ద యాంఫి థియేటర్‌ ఇదే. రోమ్‌లోని ఈ ప్రఖ్యాత కట్టడం ప్రపంచ వింతల్లో ఒకటిగా, అద్భుత నిర్మాణ గుర్తుగా ఎంతో పేరు తెచ్చుకుంది.

ఎలా ఉంటుందబ్బా?

పెద్ద మైదానం... దాని చుట్టూ వలయాకారంలో మెట్లు. ఆ మొత్తం కట్టడం 510 అడుగుల వెడల్పు, 620 అడుగుల పొడవుతో ఉంటుంది. 157 అడుగుల ఎత్తు ఉంటుందిది. అంటే ఇంచుమించు 15 అంతస్తుల భవనమంత ఎత్తన్నమాట. ఆ మైదానం మధ్యలో సాహసికులు పోటీపడేవారు. వేలాది మంది ప్రేక్షకులు ఆ మెట్ల మీద కూర్చుని చూసేవారు. మరో పక్క నుంచి రాజులు, ప్రముఖులు తిలకించేవారు.

ఇంతకీ ఎవరు ఎప్పుడు కట్టారు?

ఈ కొలోసియాన్ని రోమ్‌ చక్రవర్తి వెస్పాసియన్‌ నిర్మించాడు. ఆయనకి క్రీడలంటే ఇష్టం. అవీ మామూలు ఆటలు కాదు. గ్లాడియేటర్‌ పేరుతో పిలిచే వీరులు ఒకరితో ఒకరు పోటీపడేవారు. అలాగే ఆకలితో ఉన్న పులులు, సింహాలను మైదానంలోకి వదిలితే వాటితో పోరాడాలి. లేదా ఆహారమైపోవాలి. ఇలాంటి భయంకర వినోదాల కోసమే ఈ కట్టడాన్ని క్రీస్తు శకం 72లో మొదలుపెట్టి ఎనిమిదేళ్లలో పూర్తి చేశారు. సుమారు 55,000 మంది కూర్చునేందుకు వీలుగా నాలుగు అంతస్తుల్లో ఏర్పాట్లు ఉంటాయి. దీని నిర్మాణానికి వేల టన్నుల కాంక్రీటు, రాళ్లు వాడారు. వేల మంది పనిచేశారు. చూడ్డానికి వచ్చేవాళ్ల నుంచి ఎలాంటి రుసుం వసూలు చేయకపోవడమే కాకుండా ఆహార పదార్థాలు కూడా ఉచితంగా ఇచ్చేవారట. ఇక్కడ దాదాపు 390 ఏళ్లపాటు జరిగిన పోరాటాల్లో దాదాపు అయిదు లక్షల మంది వీరులు, లక్షల సంఖ్యలో జంతువులు మరణించాయని అంటారు.

ఇప్పటి పరిస్థితి?

భూకంపాలు, ప్రకృతి విపత్తుల కారణంగా మూడింట రెండో వంతు కొలోసియం దెబ్బతింది. కానీ ఇప్పటికీ ఇదో మంచి పర్యటక ప్రాంతం. ఏటా ఇక్కడికి వచ్చే వారి సంఖ్య నలభై లక్షలకు పైమాటే!

ప్రత్యేకతలేంటి?

వేలాది మంది ఒకేసారి వచ్చినా వెళ్లినా ఎక్కడా తోపులాటలేని విధంగా వేర్వేరు దారులతో ఈ కొలోసియాన్ని నిర్మించారు. వేర్వేరు అంతస్తుల్లో ఏకంగా 80 ప్రవేశ మార్గాల్ని ఏర్పాటు చేయడం వల్ల కేవలం 20 నిమిషాల్లో కొలోసియం ఖాళీ అయిపోయేది. ప్రేక్షకులపై ఎండా, వర్షం పడకుండా భారీ తెరలను ఏర్పాటు చేశారట.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని