కదల్లేకపోతేనేం... కదిలే కాలం కథ చెప్పాడు!

వ్యాధి రాకుండా ఉండి ఉంటే నేను ఇంత సాధించి ఉండేవాడిని కాదు.‘నేను 1942 జనవరి 8న సరిగ్గా గెలీలియో మరణించిన 300 సంవత్సరాల తర్వాత జన్మించాను. ఆ రోజున ఎందరో  పిల్లలు కూడా పుట్టి ఉంటారు. కానీ వారిలో ఎవరైనా ఖగోళ శాస్త్రంపై శ్రద్ధ చూపించారా? అన్న విషయం నాకు తెలియదు. నా తల్లిదండ్రులు లండన్‌లో నివసిస్తున్నా నేను ఆక్స్‌ఫర్డ్‌లో జన్మించాను.

Updated : 12 Feb 2019 05:05 IST

స్టీఫెన్‌ హాకింగ్‌

‘నేను 1942 జనవరి 8న సరిగ్గా గెలీలియో మరణించిన 300 సంవత్సరాల తర్వాత జన్మించాను. ఆ రోజున ఎందరో  పిల్లలు కూడా పుట్టి ఉంటారు. కానీ వారిలో ఎవరైనా ఖగోళ శాస్త్రంపై శ్రద్ధ చూపించారా? అన్న విషయం నాకు తెలియదు. నా తల్లిదండ్రులు లండన్‌లో నివసిస్తున్నా నేను ఆక్స్‌ఫర్డ్‌లో జన్మించాను. కారణం రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌లపై బాంబులు వేయకూడదని జర్మనీ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం’ అని తాను రచించిన ‘బ్లాక్‌ హోల్స్‌ అండ్‌ బేబీ యూనివర్సస్‌’ అనే పుస్తకంలో రాసుకున్నాడా శాస్త్రజ్ఞుడు.

అతను స్కూల్లో చదువుకునే రోజుల్లోనే సృజనాత్మకత ఉన్న పిల్లాడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అందరూ ఆ బాలుణ్ణి ‘ఐన్‌స్టీన్‌’ అని పిలిచేవారు. స్నేహితులను పోగు చేసి కొత్త కొత్త ఆటలను కనిపెట్టడం ఆ అబ్బాయికి భలే సరదా. పడవ పందాల్లో, స్కేటింగ్‌ పోటీల్లో చురుగ్గా పాల్గొనేవాడు. పదహారేళ్ల వయసులోనే, కంప్యూటర్లు లేని కాలంలో ఓ టెలిఫోన్‌ ఎక్సేంజ్‌లోని ఉపయోగంలేని పరికరాలతో ఒక కంప్యూటర్‌లాంటిదాన్ని తయారుచేశాడు.

వ్యాధి రాకుండా ఉండి ఉంటే నేను ఇంత సాధించి ఉండేవాడిని కాదు.

విశ్వం ఎలా ఆరంభమయ్యింది? అది ఇప్పుడు ఉన్నట్లే ఎందుకు ఉంది? ఎలా ముగుస్తుంది? మనమంతా ఎక్కడ నుంచి వచ్చాం? లాంటి ఆలోచనలతో తలమునకలవుతూ పెరిగాడా బాలుడు. అతడికి 21 సంవత్సరాల వయసులో భయంకరమైన ‘మోటార్‌ న్యూరాన్‌ డిసీజ్‌’ వచ్చింది. వైద్యులు రెండేళ్లకు మించి బతకడని చెప్పేశారు. వ్యాధి ప్రభావం వల్ల క్రమేణా అతని శరీరమంతా చచ్చుబడిపోయింది. అదేమీ లెక్క చేయకుండా అతడు పట్టుదలతో చదువు మీద దృష్టి పెట్టాడు. కొన్నేళ్ల తర్వాత గొంతు కూడా మూగబోయింది. ఇంత కష్టంలో కూడా అర్హత గల వయసు కన్నా ఒక ఏడాది ముందే పీహెచ్‌డీ సాధించాడు.

‘మోటార్‌ న్యూరాన్‌ వ్యాధి రాకముందు జీవితం చాలా బోర్‌గా అనిపించేది. కానీ మృత్యువు త్వరలోనే కబళిస్తుందని తెలిసేటప్పటికి జీవితం విలువ తెలిసి వచ్చింది. నా పరిస్థితి ఎలా ఉన్నా..  మానవుల విజ్ఞానానికి ప్రముఖ శాస్త్రజ్ఞుల విజ్ఞానాన్ని జోడించవచ్చు అనే భావన కల్గింది. కృషి చేస్తే ఎవరైనా ఏదైనా సాధించవచ్చు.’ అనుకున్నాడు. జలుబు వస్తేనే దుప్పటి ముసుగుపెట్టి చాలామంది పిల్లలు బడి ఎగ్గొట్టేస్తారు. కానీ ఈ కుర్రాడు చేతులు, కాళ్లు చచ్చుబడి పోయినా, గొంతుమూగబోయినా,  చక్రాల కుర్చీకి పరిమితమైనా నిరాశపడకుండా చదువుకున్నాడు. ప్రపంచం మెచ్చే శాస్త్రవేత్తగా ఎదిగాడు. అతడు ఎవరో కాదు... స్టీఫెన్‌ విలియం హాకింగ్‌. ఆ తర్వాత రోజుల్లో ‘బ్లాక్‌హోల్‌కింగ్‌’గా ప్రఖ్యాతిగాంచాడు. ద్రవ్యం శక్తి రూపంలో ఉంటుందన్న ప్రాథమిక భౌతిక శాస్త్రానికి స్టీఫెన్‌ హాకింగ్‌ ఒక గొప్ప ఉదాహరణ. హాకింగ్‌ ఏనాడూ టెలిస్కోపులోకి తొంగి చూడలేదు. ఓ అధునాతన కంప్యూటర్‌ నియంత్రించే చక్రాల కుర్చీలోనే కూర్చుని ఎన్నో గ్రంథాలను చదివాడు. తన మేధస్సు, ఊహా శక్తులతో ‘బ్లాక్‌ హోల్స్‌’ (కృష్ణ బిలాలు)పై అధ్యయనం చేశారు. విశ్వసృష్టిశాస్త్రంలో ఆయన వెలువరించిన సిద్ధాంతాలు ఎందరో శాస్త్రవేత్తలకు మార్గదర్శకమయ్యాయి. ఐన్‌స్టీన్‌ సాపేక్ష సిద్ధాంతాన్ని, క్వాంటం సిద్ధాంతాన్ని సమన్వయపరిచి ఐక్యక్షేత్రీయ సిద్ధాంతాన్ని వెలువరించే ప్రయత్నంలో ఎంతో కృషి చేశారు. ఆయన పేరు మీద బ్లాక్‌హోల్స్‌ వెలువరించే కిరణాలను ‘హాకింగ్‌ రేడియేషన్‌’గా గుర్తించారు. ఫెలో ఆఫ్‌ రాయల్‌ సొసైటీ పురస్కారాన్ని, ఐన్‌స్టీన్‌ అవార్డును అందుకున్న హాకింగ్‌కు లభించిన గౌరవ డాక్టరేట్లు ఎన్నో.

హాకింగ్‌ 1988లో రచించిన A Brief History of Time  పుస్తకం విడుదలయిన ఏడాదే కోటి కాపీలు అమ్ముడుపోయింది. 40కి పైగా ఇతర భాషల్లోకి అనువదించారు. ఆయన రాసిన ఇతర పుస్తకాలు Black Holes and BabyUniverses, The niverse In A Nutshell.

కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో గణిత శాస్త్రంలో ‘లుకేషియన్‌ ప్రొఫెసర్‌’ పదవిని జీవితాంతం నిర్వహించిన స్టీఫెన్‌ హాకింగ్‌ ఇటీవలే 2018 మార్చి 14న మరణించారు.

గెలీలియో మరణించిన జనవరి 8న జన్మించిన స్టీఫెన్‌హాకింగ్‌ ఐన్‌స్టీన్‌ జన్మించిన మార్చి 14న మరణించడం శాస్త్రరంగంలో ఎవ్వరూ ఊహించని నిజం.

ఈయన మరణాంతరం వెలువరించిన Brief Answers to the Big Questions భవిష్యత్తులో శాస్త్ర పురోగమనం గురించి తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ తప్పక చదవాల్సిన పుస్తకం!

హాకింగ్‌  మాట్లాడిందిలా...

వ్యాధి వచ్చినప్పటి నుంచీ హాకింగ్‌ చక్రాల కుర్చీకి పరిమితమై ఉండేవారు. తన చేతి చిటికెన వేలి కదలికల సాయంతో పనిచేసే ‘వాయిస్‌ సింథసైజర్‌’తో తన ఆలోచనలను శాస్త్ర లోకానికి అందించారు. హాకింగ్‌ చిటికెన వేలు కదలికల్ని ఒక హ్యాండ్‌ కంట్రోలర్‌ యంత్రానికి అమర్చిన తెరపై అక్షరాలను స్కాన్‌ చేసే కర్సర్‌ నియంత్రిస్తుంది. ఆయన ఎంచుకున్న అక్షరాల్ని, యంత్రంలోని వ్యవస్థ తనంతట తానే పని చేసే ‘అల్గారిదమ్‌’ సాయంతో మాటలు వాక్యాల రూపంలో రూపొందించి తెరపై ప్రకటిస్తుంది. ఈ వాక్యాల్ని మాటల రూపంలో అంటే శబ్దంతో ‘వాయిస్‌ సింథసైజర్‌’ ద్వారా ఎదుటి వారికి వినిపిస్తాయి. 

హాకింగ్‌ తన మనోభావాల్ని నేరుగా వ్యక్తీకరించలేరు కాబట్టి ఎవరినైనా అభిమానిస్తే తన వీల్‌ఛైర్‌ని నెమ్మదిగా తీసుకెళ్లి ఆ వ్యక్తిని తాకేవాడట. అదే ఎదుటివారంటే ఇష్టం లేకపోతే కుర్చీని వేగంగా తీసుకెళ్లి గట్టిగా ఢీకొట్టేవాడట.

- ప్రొ।। ఈవీ సుబ్బారావు,  హైదరాబాద్‌

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని