రాళ్లే  చిహ్నమయ్యాయి!

ఫ్రెండ్స్‌! నేనే చిన్నూని..  ఇక్కడో ఫొటో ఉంది చూశారూ?  దాన్ని నేను బోలెడుసార్లు చూశా... డెస్క్‌టాప్‌ వాల్‌పేపర్‌లాగా పెట్టా...  కానీ నాకప్పుడు ఇదేంటో తెలీదు... తెలుసుకుందామనే బయలుదేరా... ఇంగ్లండ్‌ వెళ్లి దీని కబుర్లన్నీ మోస్కొచ్చా... పేరు స్టోన్‌హెజ్‌... వివరాలు ఇవేనోచ్‌!

Updated : 13 Feb 2019 15:13 IST

 

ఫ్రెండ్స్‌! నేనే చిన్నూని..  ఇక్కడో ఫొటో ఉంది చూశారూ?  దాన్ని నేను బోలెడుసార్లు చూశా... డెస్క్‌టాప్‌ వాల్‌పేపర్‌లాగా పెట్టా...  కానీ నాకప్పుడు ఇదేంటో తెలీదు... తెలుసుకుందామనే బయలుదేరా... ఇంగ్లండ్‌ వెళ్లి దీని కబుర్లన్నీ మోస్కొచ్చా... పేరు స్టోన్‌హెంజ్‌... వివరాలు ఇవేనోచ్‌!

అసలు ఇదేంటంటే?

రాళ్లెంతో దర్జాగా నిలబడి చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఈ చిహ్నం పేరే స్టోన్‌హెంజ్‌. పెద్ద పెద్ద రాళ్లు గుండ్రటి ఆకారంలో పేర్చిన ఓ జ్ఞాపకమిది. రాతి యుగంలోని నియోలిథిక్‌ కాలంది. మనిషికన్నా అంతెత్తున ఉన్న రాళ్లు చక్కగా పేర్చి ఉన్నాయి. చూసేందుకు భలేగా అనిపించాయి.

ఎక్కడుందంటే? 

ఇంగ్లండ్‌లోని వాల్ట్‌షైర్‌లో ఉంది. దీన్ని 1882 నుంచి జాతీయ చారిత్రక కట్టడంగా గుర్తించి  పరిరక్షిస్తున్నారు. యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా 1986లో గుర్తించింది.  ఇప్పుడు ఈ రాళ్ల మధ్యలో వరకూ వెళ్లడానికి  లేదు. కాస్త దూరం నుంచే దీని చుట్టూ నడిచొచ్చా. 

ఎప్పుడు కట్టారంటే? 

ఐదు వేల ఏళ్ల క్రితం ఈ స్టోన్‌హెంజ్‌ని కట్టినట్లు చెబుతారుగానీ ఇది ఎందుకు ఇలా కట్టారన్నదానిపైగానీ, ఎప్పుడు కట్టారన్న దానిపై కచ్చితమైన ఆధారాలు లేవు. అయితే ఈ రాళ్లపై పరిశోధనలు చేసిన కొందరు  మాత్రం క్రీస్తు పూర్వం 3000 నుంచి 1600 వరకు దీన్ని దశల వారీగా వృత్తాల్లా కట్టి ఉంటారని చెబుతున్నారు.

ఎలా ఉన్నాయంటే? 

ఇక్కడున్న రాళ్లు 13 అడుగుల పొడవు, ఏడడుగుల వెడల్పు చొప్పున ఉన్నాయి. ఒక్కోటీ 25 టన్నులకు పైగా బరువుందిట. మొత్తం ఒకదానివెంట ఒకటి మూడు వృత్తాల మధ్యలో ఓ కేంద్ర బిందువు ఉంటుంది. కొన్ని రాళ్లను స్తంభాల్లా నిలబెట్టి, మరికొన్నింటిని వాటిపైన పడుకోబెట్టారు. అయితే దీని చుట్టుపక్కల చనిపోయిన వారిని పాతిపెట్టిన ఆధారాలు మాత్రం దొరికాయి.

ఇవేం రాళ్లో? 

ఇక్కడున్నవాటిలో పెద్దవి సార్సెన్‌ అనే రాయివి. అంటే అదోరకం ఇసుకరాయి. చిన్నవి నీలపు రాయివట. తడి తగిలినప్పుడు కాస్త నీలం రంగులోకి మారడం వీటి ప్రత్యేకత. ఇందులో మొత్తం 83 రాళ్లున్నాయి. మామూలుగా ఈ రాళ్లు దూరం దూరంగా లోపలికి వెళ్లడానికి వీలుగా అనిపిస్తాయి. కానీ లోపలికి వెళ్లేందుకు ఏర్పాటు చేసినవైతే రెండే ద్వారాలట.

ఇప్పటి పరిస్థితి ఏంటంటే? 

అయితే ఈ కట్టడం ఇప్పుడు చాలా వరకు పాడైపోయింది. కొన్ని రాళ్లు కొంత భాగం భూమిలోకి కూరుకుపోయాయి. అందుకే ఇప్పుడు ప్రత్యేక అనుమతులున్న వారు తప్ప ఎవ్వరూ వీటిని తాకడానికి లేదు. దూరం నుంచైనా దీన్ని చూసి, విశేషాలు తెలుసుకోవాలని నాలానే చాలా మంది పర్యటకులు ఇక్కడికి వెళ్లొస్తుంటారు.

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు