ఇల్లే కిలోమీటరు!

ఇల్లెంతుంటుంది...? ఏ రెండొందల గజాలో, మూడొందల గజాలో ఉంటుంది... అపార్ట్‌మెంట్‌ ఎంతుంటుంది... ఇంకాస్త పెద్ద స్థలంలో ఉంటుంది... మరి ఓ కిలోమీటరుపైనే ఉండే ఇల్లు ఎప్పుడైనా చూశారా?ప్రపంచంలోనే ఒకే కప్పు కింద ఉన్న అతి పెద్ద నివాస సముదాయం ఏంటో తెలుసా? కార్ల్‌ మార్క్స్‌ హాఫ్‌. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉంది.

Published : 15 Feb 2019 00:25 IST

ఇల్లెంతుంటుంది...? ఏ రెండొందల గజాలో, మూడొందల గజాలో ఉంటుంది... అపార్ట్‌మెంట్‌ ఎంతుంటుంది... ఇంకాస్త పెద్ద స్థలంలో ఉంటుంది... మరి ఓ కిలోమీటరుపైనే ఉండే ఇల్లు ఎప్పుడైనా చూశారా?

ప్రపంచంలోనే ఒకే కప్పు కింద ఉన్న అతి పెద్ద నివాస సముదాయం ఏంటో తెలుసా? కార్ల్‌ మార్క్స్‌ హాఫ్‌. ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉంది.
* దీన్ని 1927, 1930ల మధ్యలో కట్టారు. అప్పట్లో వియన్నా సోషల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ వియన్నా అధీనంలో ఉండేది. ప్రజల నుంచి ప్రత్యేకమైన పన్నును తీసుకుని మరీ దీన్ని నిర్మించారు.
* మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వేల మందికి ఇళ్లు లేకుండా పోయాయి. వాళ్లందరికీ నివాసాలు కల్పించాలనే ఉద్దేశంతో దీన్నిలా పెద్దగా కట్టేశారు. ఇదే చివరికి ప్రపంచంలోనే అతి పొడవైన నివాస సముదాయం అయిపోయింది. లోపల అపార్ట్‌మెంట్లు దేనికవే విడిగా ఉన్నా అన్నీ ఈ భవనంలోనే ఉంటాయన్నమాట.
* దీంట్లో దాదాపుగా 13 వందలకుపైగా అపార్ట్‌మెంటులున్నాయి. ఐదు వేల మందికి ఇళ్లు కల్పించాలనే ఉద్దేశంతో దీన్ని నిర్మించార్ట.
* ఇది ఏకంగా 1100 మీటర్ల పొడవుంటుంది. అంటే కిలోమీటరుపైనే మరి. మొత్తం భవనాన్నంతా ఒకే ఫొటోలో మనం చూడలేం కూడా.
* ఈ ఒక్క భవనం నుంచి వెళ్లేలోపే ట్రామ్‌ నాలుగు సార్లు ఆగుతుంది. అంటే దీని పొడవెంతో మనమే అర్థం చేసుకోవచ్చు.
* ఈ భవనంలోనే కొన్ని ఆఫీసులు, లాండ్రీ, ఆసుపత్రులు, చిన్న పిల్లలకు నర్సరీల్లాంటివీ ఉన్నాయి.
* ఇప్పుడు ఇది సినిమా షూటింగ్‌లకూ ప్రసిద్ధి. 1990ల్లో ఇది పాడైపోయేసరికి మళ్లీ మరమ్మతులు చేశారు. ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. భలే నివాసాలేనే!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని