చెత్తతో ప్రపంచ వింతలు!

హాయ్‌ ఫ్రెండ్స్‌...  నేను మీ చిన్నూని... తెలుసా? నేను ప్రపంచవింతల్ని అరగంటలో చుట్టి వచ్చా... తాజ్‌మహల్‌ దగ్గర్నించి స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ వరకు... చూసి వచ్చా... అవాక్కయ్యారా? ఆ వివరాలేంటో వింటే మీరూ వెళ్లి రావొచ్చు!గిజా పిరమిడ్‌ ఎక్కడుంది? ఈజిప్టులో. మరి లీనింగ్‌ టవర్‌ ఆఫ్‌ పీసా? ఇటలీ దేశంలో. ఐఫిల్‌ టవర్‌ చూడాలంటే ఎక్కడికి వెళ్లాలి? ప్యారిస్‌కి. ఇంకా... కొలోసియం, క్రైస్ట్‌ ది రిడీమర్‌, స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ చూసి రావాలంటే?

Published : 23 Feb 2019 01:08 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌...  నేను మీ చిన్నూని... తెలుసా? నేను ప్రపంచవింతల్ని అరగంటలో చుట్టి వచ్చా... తాజ్‌మహల్‌ దగ్గర్నించి స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ వరకు... చూసి వచ్చా... అవాక్కయ్యారా? ఆ వివరాలేంటో వింటే మీరూ వెళ్లి రావొచ్చు!
గిజా పిరమిడ్‌ ఎక్కడుంది? ఈజిప్టులో. మరి లీనింగ్‌ టవర్‌ ఆఫ్‌ పీసా? ఇటలీ దేశంలో. ఐఫిల్‌ టవర్‌ చూడాలంటే ఎక్కడికి వెళ్లాలి? ప్యారిస్‌కి. ఇంకా... కొలోసియం, క్రైస్ట్‌ ది రిడీమర్‌, స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ చూసి రావాలంటే? విమానం ఎక్కి మన దేశం దాటి వెళ్లాల్సిందే కదా. కానీ నేను మన దేశంలోనే ఇవన్నీ చూశా. ఎక్కడో చెప్పనా? రాజధాని దిల్లీ నగరంలో.
* ఎలాగబ్బా అంటారా? ఇక్కడో కొత్త పార్కును ప్రారంభించారు. ప్రపంచపు వింతలు ఇక్కడున్నాయి. పార్కు పేరు ‘వేస్ట్‌ టు వండర్‌ పార్కు’. ఆ పేరు ఎందుకు పెట్టారో చివర్లో మీకే తెలుస్తుంది లెండి.
* ఇందులోకి వెళ్లగానే 60 అడుగుల ఎత్తయిన ఐఫిల్‌ టవర్‌, 20 అడుగుల ఎత్తయిన తాజ్‌ మహల్‌, 18 అడుగుల ఎత్తున్న గిజా పిరమిడ్‌, 30 అడుగుల స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ ఇలా ప్రముఖ నిర్మాణాలన్నీ కనువిందుచేస్తాయి. రాత్రుల్లో అయితే జిగేల్‌ జిగేల్‌మంటూ మెరిసిపోయాయి. అబ్బ అన్నీ ఒకే దగ్గర చూస్తుంటే నా రెండు కళ్లూ చాల్లేవు.

* మీకు అసలు విషయం చెప్పలేదు. ఈ వింత నిర్మాణాల ప్రత్యేకత ఏమిటంటే... ఇవన్నీ తయారు చేసింది చెత్తతో. అవును అద్భుతమైన ఈ కట్టడాలన్నింటినీ చెత్తతో చేసిపెట్టారు. పాత బల్లలు, మూలన పడేసిన టైప్‌ రైటర్లు, ఫ్యాన్లు, సైకిళ్లు, బైకుల విడి భాగాలు, రాడ్లలాంటి రకరకాల ఇనుప వస్తువులు ఇలా పనికిరాని వస్తువుల్నే ప్రఖ్యాత రూపాలుగా మలిచారు. ఈ నిర్మాణాల కోసం ఇంచుమించు 150 టన్నుల వ్యర్థాల్ని ఉపయోగించారు.
* ఈ పార్కును ఏర్పాటుచేసింది ఇక్కడి పురపాలక సంస్థ. వ్యర్థాలతోనే అద్భుతమైన ఆకారాలుగా చెక్కాలనే ఆలోచనతో ఇక్కడి మున్సిపల్‌ స్టోర్ల నుంచి లోహ వ్యర్థాల్ని సేకరించింది. వాటితోనే ప్రపంచ వింతల నమూనాల్ని తీర్చిదిద్దారు. దీనికోసం కళాకారులతో పాటు 70 మంది ఆరునెలల పాటు పనిచేశారు.
* ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ పార్కు కోసం సుమారు ఏడు కోట్ల రూపాయల వరకు ఖర్చు చేశారట. నాకైతే భలే నచ్చేసింది.

 

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని