ఇది నిజంగా స్వీట్‌ హోం!

చాక్లెట్లంటే మనకు బోలెడంత ఇష్టం...ఒకటి,రెండు ఎవరైనా ఇస్తేనే తెగ సంతోషించేస్తాం..మరి ఏకంగా మనం ఉండే ఇల్లే చాక్లెట్‌తో కట్టేస్తే...ఆ ఊహే భలే తమాషాగా ఉంది కదూ! దాన్నే నిజం చేసి చూపాడో కళాకారుడు... ఆ కబుర్లే ఇవి! ఓ అందమైన బుల్లి కాటేజీ... అందులోకి వెళ్లగానే తియ్యని చాక్లెట్‌ వాసన... ఎటుచూసినా చాక్లెట్‌ రంగు నోరూరిస్తుంటుంది.. అసలు విషయం ఏంటంటే దాన్ని మొత్తాన్ని అచ్చంగా చాక్లెట్‌తోనే నిర్మించేశారు మరి. ఇదేదో బుల్లి బొమ్మ ఇల్లేమో అనుకోకండి.

Published : 13 Mar 2019 00:17 IST

చాక్లెట్లంటే మనకు బోలెడంత ఇష్టం...ఒకటి,రెండు ఎవరైనా ఇస్తేనే తెగ సంతోషించేస్తాం..మరి ఏకంగా మనం ఉండే ఇల్లే చాక్లెట్‌తో కట్టేస్తే...ఆ ఊహే భలే తమాషాగా ఉంది కదూ! దాన్నే నిజం చేసి చూపాడో కళాకారుడు... ఆ కబుర్లే ఇవి!

ఓ అందమైన బుల్లి కాటేజీ... అందులోకి వెళ్లగానే తియ్యని చాక్లెట్‌ వాసన... ఎటుచూసినా చాక్లెట్‌ రంగు నోరూరిస్తుంటుంది.. అసలు విషయం ఏంటంటే దాన్ని మొత్తాన్ని అచ్చంగా చాక్లెట్‌తోనే నిర్మించేశారు మరి. ఇదేదో బుల్లి బొమ్మ ఇల్లేమో అనుకోకండి. ఇందులో మనం ఉండటానికి వీలయ్యే అన్ని ఏర్పాట్లూ ఉన్నాయి. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజ్జంగా నిజమే.

* ఇంతకీ ఇది ఎక్కడుందంటే ఫ్రాన్స్‌లో. పారిస్‌ నుంచి అరగంట ప్రయాణిస్తే అక్కడ సెవ్రెస్‌ అనే ప్రాంతముంది. అక్కడే ఈ చాక్లెట్‌ ఇల్లుంది.
* పద్దెనిమిది చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీన్ని కట్టేశారు.
* అందుకు 1.50 టన్నుల చాక్లెట్‌ పట్టింది. ఆ మొత్తాన్ని ఓ చాక్లెట్‌ తయారీ సంస్థ నుంచి ఒకేసారి కొనుగోలు చేశారు. కొంత వైట్‌ చాక్లెట్‌నీ దీంట్లో ఉపయోగించారు.
* చుట్టూ ఇంత చాక్లెట్‌ ఉంటే ఇంకేముంది? చక్కగా లాగించేయొచ్చనుకుంటున్నారేమో! అదేం కుదర్దు. షరతులు వర్తిస్తాయ్‌. ఇక్కడ కొన్నింటిని తప్ప ఇంక వేటినీ ముట్టుకునేందుకు వీల్లేదు. అయితే వీటిని చూసి ఆనందిస్తూ లోపల రెండు రోజుల పాటు బస చేసే వీలుంది. మనం కూర్చునేందుకు, నిద్రించేందుకు మామూలు మంచమే ఉంటుంది.
* నాలుగు నెలల్లోనే దీని నిర్మాణాన్ని పూర్తి చేయగలిగారు. గోడలు, పైకప్పు, వార్డ్‌రోబ్స్‌, తలుపులు, కిటికీలూ అంతా చాక్లెట్‌తోనే కట్టేశారు. అదెలాగన్నది మాత్రం రహస్యంగా ఉంచారు.
* పైగా ఇలా మనుషులు ఉండేందుకు ఉపయోగపడే చాక్లెట్‌ హౌస్‌ ప్రపంచంలో ఇదొక్కటేనట. ఏంటి మరి! మనమూ బయలుదేరేద్దామా?

* ఫ్రాన్స్‌లో జీన్‌ లూక్‌ డిక్యూజియో అని ఓ మామయ్య ఉన్నారు. ఆయన చాక్లెట్‌తో శిల్పాలు చేసేసే ప్రముఖ కళాకారుడు. ఉన్నట్టుండి ఆయనకు చాక్లెట్‌తోనే ఓ ‘స్వీట్‌ హోం’ను ఎందుకు తయారు చేయకూడదన్న ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా పని ప్రారంభించేశారు.

* కేవలం ఇల్లే కాదు..  ఇంట్లోని సామాగ్రినీ చాక్లెట్‌తోనే తయారు చేశారు. వంటగదిలోని టీకప్పులు, నీళ్ల గ్లాసులు, అన్నం తినే ప్లేట్లు, వాటిని భద్రపరిచే అరలు ఇలా అన్నీ. గడియారం, పూలకుండీలు, పుస్తకాలు, బొకేలు అన్నీ చాక్లెట్‌ మయమే.

* అయితే ఇక్కడ ఉండేందుకు వెళ్లిన వారికి అక్కడ చాక్లెట్‌తో తయారు చేసిన రకరకాల వంటకాల్ని అందిస్తారు. వాటిని ఎంచక్కా తినేయొచ్చు. కావాలనుకుంటే ఈ మామయ్య దగ్గర చాక్లెట్‌తో బొమ్మల్లాంటివి తయారు చేయడమూ నేర్చుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని