పాత రోత కాదు... కొత్త వింతే!

నేస్తాలూ! చిన్నూనొచ్చేశా! ఈసారి ఈజిప్టు వెళ్లొచ్చా... ఓ ప్రపంచ వింతని చూసొచ్చా... అదేనండీ... గ్రేట్‌ పిరమిడ్‌ ఆఫ్‌ గిజా... అక్కడి నుంచి బోలెడు కబుర్లు తెచ్చేశా.ఈజిప్టులో గిజా అని ఓ నగరముంది. అక్కడ ఓ పేద్ద పిరమిడ్‌ ఉంది. అక్కడికే నేనెళ్లొచ్చా. ఇదీ ప్రపంచ వింతల్లో ఒకటి. దాంట్లోని ఒక్కో రాయీ నా కంటే ఎత్తుంది తెల్సా. దాన్ని చూస్తూనే నోరెళ్లబెట్టాన్నేను. ఈ కట్టడం ఎంత పాతదో! అయినా ఇప్పటికీ కొత్త వింతలాగే అనిపించేసింది నాకు.

Updated : 14 Mar 2019 01:25 IST

నేస్తాలూ! చిన్నూనొచ్చేశా! ఈసారి ఈజిప్టు వెళ్లొచ్చా... ఓ ప్రపంచ వింతని చూసొచ్చా... అదేనండీ... గ్రేట్‌ పిరమిడ్‌ ఆఫ్‌ గిజా... అక్కడి నుంచి బోలెడు కబుర్లు తెచ్చేశా.

కట్టడం: గ్రేట్‌ పిరమిడ్‌ ఆఫ్‌ గిజా
నగరం: ఈజిప్టు
ఎత్తు: 481 అడుగులు

జిప్టులో గిజా అని ఓ నగరముంది. అక్కడ ఓ పేద్ద పిరమిడ్‌ ఉంది. అక్కడికే నేనెళ్లొచ్చా. ఇదీ ప్రపంచ వింతల్లో ఒకటి. దాంట్లోని ఒక్కో రాయీ నా కంటే ఎత్తుంది తెల్సా. దాన్ని చూస్తూనే నోరెళ్లబెట్టాన్నేను. ఈ కట్టడం ఎంత పాతదో! అయినా ఇప్పటికీ కొత్త వింతలాగే అనిపించేసింది నాకు.

ప్రపంచ వింతల్లో మొదటిది!

ప్రపంచ వింతల్లో మొదటగా చేరింది ఈ గ్రేట్‌ పిరమిడ్‌ ఆఫ్‌ గిజానేనట. అక్కడున్న గైడు అంకుల్‌ చెబుతుంటే విన్నా. దీన్ని ఎప్పుడో 3,800 ఏళ్ల క్రితమే కట్టేశార్ట. అంటే  ఆ కాలంలోనే భూమిపై ఉన్న ఎత్తయిన కట్టడం ఇది.   మళ్లీనేమో ఈజిప్టులో ఉన్న పిరమిడ్‌లన్నింటిలో అతి పెద్దదీ ఇదే. ఎత్తు 481 అడుగులు. ఇంతకీ దీనికింత గొప్ప పేరు ఎందుకొచ్చిందో తెలుసా? ఇప్పుడున్న అత్యాధునిక టెక్నాలజీతో కూడా ఈ గొప్ప కట్టడాన్ని పోలిన మారోదాన్ని... అదే రెప్లికాని ఎవరూ సృష్టించలేకపోయారు. మరి టెక్నాలజీ లేని ఆ కాలంలోనే ఈ ఆకారంలో ఇలాంటిదాన్ని తీర్చిదిద్దడం అంటే మాటలు కాదు కదా. అందుకే అంత పేరు.

లక్షల రాళ్లు!

గ్రేట్‌ పిరమిడ్‌ ఆఫ్‌ గిజా అసలు పేరేంటో తెలుసా? కుఫు పిరమిడ్‌. అతి ప్రాచీనమైనది. ఈజిప్టును పాలించిన రాజుల్లో కుఫు చక్రవర్తి ఒకరు. ఆయన కోసమే దీన్ని నిర్మించార్ట. అంతకు ముందు రాజులు నిర్మించుకున్న పిరమిడ్‌లు మెట్లు మెట్లుగా ఉండేవి. అయితే బయటవైపు చూస్తే చదునుగా ఉన్న పిరమిడ్‌ కావాలని కుఫు అడిగార్ట. మొదట రెండు పిరమిడ్‌లు కట్టినా నచ్చకపోవడంతో ఇలా మూడోది అతి పేద్ద పిరమిడ్‌ని నిర్మించార్ట. దాదాపు 800 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్వారీ నుంచి ఈ రాళ్లను తవ్వి పట్టుకొచ్చారు. నైలు నది నుంచి పడవల్లో వీటిని రవాణా చేసి ఇక్కడికి తీసుకొచ్చేవారట. బానిసలుగా చేసుకున్న 20 నుంచి 30 వేల మందిని వీటిని కట్టేందుకు ఉపయోగించారు. దీన్ని నిర్మించడానికి పది నుంచి 20 ఏళ్లు పట్టి ఉండొచ్చట. దాదాపు 23 లక్షల రాతి ఇటుకల్ని ఇది కట్టడానికి ఉపయోగించారు. వాటిలో రెండు నుంచి 30 టన్నుల వరకూ బరువున్న రాళ్లూ ఉన్నాయి. ఇది పునాదుల భాగంలో కింద దాదాపు ఆరు లక్షల చదరపు అడుగుల మేర విస్తరించి ఉంది.

సమాధి కాదు.. మమ్మీ లేదు!

అప్పట్లోని ఈజిప్టు రాజులు చనిపోయిన తర్వాత కూడా ఈ డబ్బు, బంగారం లాంటివి అవసరముంటాయని నమ్మేవారు. తర్వాతా ఓ జీవితం ఉంటుందనుకునేవారు. అందుకే సమాధులతోపాటు విలువైన ఆభరణాల్ని, ఇష్టమైన వస్తువుల్నీ ఉంచుకోవాలని అనుకునేవారు. అయితే అదంతా ఇసుక ప్రాంతం అవడం వల్ల సమాధుల్లోని వస్తువుల్ని జంతువులన్నీ లాక్కెళ్లడంలాంటివి జరిగాయి. అందుకే ఈ పిరమిడ్‌లను కట్టడం మొదలుపెట్టారు. ఈజిప్టు మొత్తంలో 140 వరకూ పిరమిడ్‌లను ఇప్పటి వరకూ గుర్తించారు. వాటిలో చాలా వరకూ పాడైపోయాయి. కొన్నింటిలోని విలువైన వస్తువుల్ని ఎప్పుడో దొంగలించేశార్ట. అయితే ఈ గ్రేట్‌ పిరమిడ్‌ ఆఫ్‌ గిజాలో మాత్రం అలాంటి మమ్మీల ఆనవాళ్లు ఇప్పటి వరకు కనిపించలేదట. లోపల రాజు, రాణిల ఛాంబర్‌లతోపాటు మరో గ్రాండ్‌ గ్యాలరీ ఉందంతే. వేడిని తట్టుకునేట్టు, భూకంపాల ధాటినీ ఎదుర్కోగలిగేలా దీనిలోపలి మూల స్తంభాల నిర్మాణం ఉంది. దీని లోపలి ఉష్ణోగ్రత 20డిగ్రీల సెల్సియస్‌ ఉంటుంది. ఈ గ్రేట్‌ పిరమిడ్‌ ఆఫ్‌ గిజా పక్కనే మరి కొన్ని పిరమిడ్‌లు, సింహాన్ని పోలిన పేద్ద దేవతా విగ్రహాలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ కలిపే గిజా పిరమిడ్‌ కాంప్లెక్స్‌ అని పిలిచేస్తుంటారు. అయితే కుఫూ రాజు తన భార్యల కోసం మిగిలిన పిర‌మిడ్లను క‌ట్టార‌ట‌.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని