చల‌చ‌ల్ల‌ని ఎడారులు!

ఎడారంటే మండే ఎండ‌... అంతెత్తునుండే ఇసుక దిబ్బలు... వేడి ఉష్ణోగ్రతలు... మూళ్ళ మొక్కలు... ఇవేగా మ‌న‌కు గుర్తొచ్చేది... ఇందుకు భిన్నమైన ఎడారులూ ఉన్నాయి... అవేంటో, ఆ వివ‌రాలేంటో చూద్దాం రండి. వేసవి కాలం వచ్చేసింది... ఎండలు మండిపోతున్నాయి... మనకే ఇలా ఉంటే ఇంక ఎడారుల్లో సంగతి ఎలా ఉంటుందో ఏమో అని మనమనుకోవచ్చు. అయితే మన ఊహలకు భిన్నమైన ఎడారులూ చాలానే ఉన్నాయి. వాటిలో వేసవిలోనూ ఇప్పుడు మన దగ్గర ఉన్నదాని కంటే చల్లగానే ఉంటుంది. అయితే ఎప్పుడో ఓసారి ఈ ఎడారుల్లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి గానీ ఇప్పుడు మనం చెప్పుకొనేవన్నీ సరాసరి ఉష్ణోగ్రతలే.

Published : 15 Mar 2019 00:26 IST

ఎడారంటే మండే ఎండ‌... అంతెత్తునుండే ఇసుక దిబ్బలు... వేడి ఉష్ణోగ్రతలు... మూళ్ళ మొక్కలు... ఇవేగా మ‌న‌కు గుర్తొచ్చేది... ఇందుకు భిన్నమైన ఎడారులూ ఉన్నాయి... అవేంటో, ఆ వివ‌రాలేంటో చూద్దాం రండి.

వేసవి కాలం వచ్చేసింది... ఎండలు మండిపోతున్నాయి... మనకే ఇలా ఉంటే ఇంక ఎడారుల్లో సంగతి ఎలా ఉంటుందో ఏమో అని మనమనుకోవచ్చు. అయితే మన ఊహలకు భిన్నమైన ఎడారులూ చాలానే ఉన్నాయి. వాటిలో వేసవిలోనూ ఇప్పుడు మన దగ్గర ఉన్నదాని కంటే చల్లగానే ఉంటుంది. అయితే ఎప్పుడో ఓసారి ఈ ఎడారుల్లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి గానీ ఇప్పుడు మనం చెప్పుకొనేవన్నీ సరాసరి ఉష్ణోగ్రతలే.

అటకామా

దక్షిణ అమెరికా ఖండంలోని చిలీ దేశంలో విస్తరించి ఉంది అటకామా ఎడారి. దీనిలోని లోయలన్నీ చాలా వరకూ చల్లగానే ఉంటాయి. పసిఫిక్‌ మహా సముద్రం నుంచి వచ్చే చల్లని గాలుల వల్లే ఇక్కడ ఎప్పుడూ చల్లని వాతావరణం ఉంటుంది. ఇక్కడంతా రాతి నేలలే. ప్రపంచంలోనే అత్యంత పొడి వాతావరణం ఉండే ప్రాంతం. దీని ఉపరితలం అంతా అంగారకుడి ఉపరితలాన్ని పోలి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక్కడ సరాసరి ఉష్ణోగ్రతలు సున్నా నుంచి 25 డిగ్రీల సెల్సియస్‌లోపే ఉంటాయి.

గోబీ ఎడారి 

మన ఆసియా ఖండంలోనే ఈ గోబీ ఎడారి ఉంది. ఆసియా అంటేనే ఎక్కువగా ఉష్ణమండల వాతావరణమే ఉంటుంది కదా. అయినా ఈ ఎడారి విషయం మాత్రం భిన్నం. చైనాకు పశ్చిమ భాగం, మంగోలియాల్లో ఇది విస్తరించి ఉంటుంది. ఎత్తయిన ఇసుక దిబ్బల మాటున మంచు కురిసేస్తుంటుంది. చలికాలం సరాసరిన -21డిగ్రీలు, వేసవిలో 27 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు ఉంటాయి. అయితే సముద్రమట్టానికి చాలా ఎత్తున ఈ ఎడారి ఉండటం వల్ల ఇక్కడ చిత్రమైన వాతావరణం ఉంటుంది. ఉష్ణోగ్రతలు హఠాత్తుగా మారిపోతుంటాయి. 24 గంటల్లోనే ఉష్ణోగ్రతల్లో 34 డిగ్రీల వ్యత్యాసం కనబడిన సందర్భాలూ ఉన్నాయి. 

గ్రేట్‌ బేసిన్‌ 

ఈ గ్రేట్‌ బేసిన్‌ ఎడారి అమెరికాలో ఉంది. నవాడా, ఉతాహ్‌, కాలిఫోర్నియా, ఇడాహ్‌, ఓరగన్లలో విస్తరించి ఉందిది. చల్లని ఎడారిగా దీనికీ పేరుంది. ఇక్కడ ఎత్తయిన పర్వతాల మధ్యలో లోయలుంటాయి. ఆ లోయలన్నీ విపరీతమైన గాలితో ఉంటాయి. సముద్రం మీద నుంచి వచ్చే గాలులతో ఓ రకమైన వాతావరణాన్ని ఇక్కడ చూడొచ్చు. వేసవిలో ఇక్కడ పగలు ఒక్కోసారి 32 డిగ్రీల ఉష్ణోగ్రత వస్తుంది. కానీ అదే రోజు రాత్రి ఉష్ణోగ్రత మళ్లీ 4 డిగ్రీల సెల్సియస్‌ నమోదవుతుంటుంది.

గ్రీన్‌ల్యాండ్‌ 

అంటార్కిటికా, ఆర్కిటిక్‌లను పక్కన పెడితే దేశాల్లో ఉన్న ఎడారుల్లో గ్రీన్‌ల్యాండ్‌ ఎడారి ప్రపంచంలోనే అతి చల్లనిది. దీంట్లోనే అతి పెద్ద జాతీయ పార్కూ ఉంది. దాని పేరు ‘ద నార్త్‌ ఈస్ట్‌ గ్రీన్‌ల్యాండ్‌ నేషనల్‌ పార్క్‌’. ఇక్కడంతా ఉష్ణోగ్రతలు ఎప్పుడూ -7.78 నుంచి -3.88 డిగ్రీల సెల్సియస్‌ మధ్యే ఉంటాయి. 

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని