ఈఫిల్‌ టవర్లు వరుస కట్టాయ్‌!

అంతెత్తునుండే ఈఫిల్‌ టవర్‌ అంటే మనకు భలే ఇష్టం... మరి అలాంటివి ఒక్కచోటే బోలెడు కనిపిస్తే... అబ్బ చూసేందుకు భలే ముచ్చటగా ఉండదూ! ఆ దృశ్యాన్ని చూడాలంటే మనం వియత్నాం వెళ్లాల్సిందే... రండి మరి బయలుదేరేద్దాం! అసలే సముద్రం...

Published : 20 Mar 2019 00:23 IST

అంతెత్తునుండే ఈఫిల్‌ టవర్‌ అంటే మనకు భలే ఇష్టం... మరి అలాంటివి ఒక్కచోటే బోలెడు కనిపిస్తే... అబ్బ చూసేందుకు భలే ముచ్చటగా ఉండదూ! ఆ దృశ్యాన్ని చూడాలంటే మనం వియత్నాం వెళ్లాల్సిందే... రండి మరి బయలుదేరేద్దాం! అసలే సముద్రం...

ఆ మధ్యలో ఈఫిల్‌ టవర్లు... ఒకటి కాదు... రెండు కాదు... మొత్తం ఏడు... దర్జాగా నిలబడి ఉంటాయ్‌. అంతటితో వింత పూర్తి కాలేదు. ఆ ఈఫిల్‌ టవర్ల మీదుగా ఓ కేబుల్‌ కార్ల లైను వెళుతుంటుంది. ఇదంతా చూసేందుకు భలే తమాషాగా ఉంటుంది. అందుకే పర్యటకులకు ఈ కేబుల్‌ కార్లలో ప్రయాణించడం అంటే ఎక్కడ లేని ఇష్టం. పై నుంచి సముద్రాన్ని, ఆపైనున్న ఈ బుల్లి ఈఫిల్‌ టవర్లను చూసేస్తూ తెగ సంబరపడిపోతుంటారు.
* ఈ ఈఫిల్‌ టవర్ల కేబుల్‌ కార్‌ లైను ఇంతకీ ఎక్కడుందో చెప్పలేదు కదూ. వియత్నాంలోని కన్హా హోవా ప్రావిన్సులో. అక్కడ హాన్‌ ట్రె ద్వీపం నుంచి నా ట్రంగ్‌ల మధ్య సముద్రంలో ఉంటుందిది.
* సముద్రంలో దాదాపుగా 3,320 మీటర్ల దూరం ఈ లైను ఉంది.
* ఇక్కడున్న ఈ టవర్లన్నీ 95 నుంచి 157 మీటర్ల వరకూ ఎత్తుల్లో ఉన్నాయి.
* ప్రపంచంలోనే సముద్రం మీదున్న పొడవైన కేబుల్‌ కార్ల లైనుగా దీనికి రికార్డులూ ఉన్నాయి.
* అసలు విషయం ఏంటంటే ఈ కేబుల్‌ కార్ల లైను ఏర్పాటులో భాగంగా మధ్యలో వేసే స్తంభాల్నే ఇలా ఈఫిల్‌ టవర్ల ఆకారంలో నిర్మించారన్నమాట. వీటికి ఒక్కోదానికీ కింద మళ్లీ నాలుగు స్తంభాలుంటాయి. అవే వీటినిలా నీళ్లలో నిలబెట్టి ఉంచగలుగుతాయి. అయితే వీటివల్లే ఈ లైనుకు ఎంతో గుర్తింపు వచ్చేసింది. ఇక్కడ పర్యటకమూ పెరిగింది.
* ఈ దేశానికి సంబంధించిన రెండు సంస్థలు పన్నెండు నెలల్లోనే దీన్ని నిర్మించేశాయిట. మొత్తానికి భలే టవర్లే కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని