ఈఫిల్‌ టవర్‌ను వద్దన్నారు!

ఈఫిల్‌ కథ! పారిస్‌ అనగానే గుర్తొచ్చే ఈఫిల్‌ టవర్‌ని ముందు ఇక్కడే నిర్మిద్దామనుకున్నారు. దాని రూపకర్త, ఆర్కిటెక్ట్‌ గుస్తావ ఐఫిల్‌ తన ప్రాజెక్టు గురించి చెబితే స్పెయిన్‌వారు అందుకు అంగీకరించలేదు. ఇది చాలా పొడవుగా ఉండటం వల్ల తమ సిటీ అందం మరింత పెరగడానికి ఉపయోగపడదని భావించారు. అలా ప్రఖ్యాత ఈఫిల్‌ టవర్‌ ఇక్కడ లేకుండా పోయింది...

Updated : 23 Mar 2019 00:26 IST

మహా నగరం
బార్సిలోనా

ఈఫిల్‌ కథ!
పారిస్‌ అనగానే గుర్తొచ్చే ఈఫిల్‌ టవర్‌ని ముందు ఇక్కడే నిర్మిద్దామనుకున్నారు. దాని రూపకర్త, ఆర్కిటెక్ట్‌ గుస్తావ ఐఫిల్‌ తన ప్రాజెక్టు గురించి చెబితే స్పెయిన్‌వారు అందుకు అంగీకరించలేదు. ఇది చాలా పొడవుగా ఉండటం వల్ల తమ సిటీ అందం మరింత పెరగడానికి ఉపయోగపడదని భావించారు. అలా ప్రఖ్యాత ఈఫిల్‌ టవర్‌ ఇక్కడ లేకుండా పోయింది.

నగరం: బార్సిలోనా
దేశం: స్పెయిన్‌
జనాభా: పదహారు లక్షలకు పైమాటే
విస్తీర్ణం: దాదాపు నూటొక్క చదరపు కిలోమీటర్లు

* స్పెయిన్‌లోని ప్రముఖ నగరాల్లో ఒకటి బార్సిలోనా. ఎక్కువ జనాభా ఉన్న రెండో అతి పెద్ద మున్సిపాల్టీ.
* ఇది అక్కడి స్వతంత్ర స్థానం క్యాటలోనియా రాజధాని. ఇంకా బార్సిలోనా ప్రావిన్సుకూ రాజధాని.
* పూర్వం రోమన్లు దీన్ని ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ కొన్ని భవనాలు అంతకంటే ప్రాచీనమైనవీ ఉన్నాయట. దీంతో దీన్ని క్రీస్తు పూర్వమే ఏర్పాటు చేసుంటారన్న వాదనా ఉంది. అప్పుడెప్పుడో ఇది నిర్మితమైనా నగర ప్లానింగ్‌ ఎంతో కచ్చితంగా ఉంటుంది. అన్ని ఇళ్ల బ్లాకులూ చతురస్రాకారంలో ఉంటాయి. మూలలు కోతకోసినట్టే కనబడతాయి.

* ఇక్కడ భవంతులపైనున్న ఆర్కిటెక్చర్‌ చూసి తీరవలసిందే. ఇంత అందమైన కళాకృతులు కొలువుదీరాయిక్కడ. అందుకే రాయల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ ఆర్కిటెక్ట్స్‌ ఈ నగరానికి రాయల్‌ గోల్డ్‌ మెడల్‌ని ఇచ్చింది. ప్రపంచంలో ఈ గౌరవం పొందిన ఏకైక నగరం ఇదేనట.
* కిలోమీటర్ల మేర పరుచుకున్న బీచ్‌లు దీని ప్రత్యేకం. 1992 వరకూ ఇక్కడ బీచ్‌లే లేవు. పరిశ్రమలతోనే ఉండేది. అయితే 92లోనే ఇక్కడ ఒలింపిక్స్‌ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో పరిశ్రమల్ని తొలగించి బీచ్‌లను తయారు చేశారు. ఇప్పుడిక్కడున్న ఏడు బీచ్‌లు ఒక్కోటీ దాదాపుగా 4.5కిలోమీటర్ల తీర రేఖతో అలరిస్తున్నాయి.
* ప్రపంచంలోనే రద్దీగా ఉండే నడక దారి ఇక్కడే ఉంది. ఈ రోడ్డుపై మరే వాహనాలు పోవు. సరాసరిన రోజుకు లక్షా యాభైవేల మంది దీనిపై నడుస్తార్ట.
* 2016 లెక్కల ప్రకారం పర్యటకులు ఎక్కువగా వచ్చే ఐరోపా నగరాల్లో దీనిది నాలుగో స్థానం.
* ఐరోపాలోనే అతి పెద్ద క్రూయిజ్‌ పోర్టు ఇక్కడే ఉంది. ఇది అతి రద్దీగా ఉండేదీనూ.
* ‘ఎఫ్‌సి బార్సిలోనా క్లబ్స్‌ హోమ్‌ స్టేడియం’ ఈ ఖండంలోనే అతి పెద్ద ఫుట్‌బాల్‌ స్టేడియం. 99వేల మందికి పైగా ఇందులో కూర్చునే వీలుంది.
* నగర విస్తీర్ణంలో పదిశాతం కంటే ఎక్కువ భూమిలో అర్బన్‌ పార్కులున్నాయి. ఏటా ఇక్కడ పచ్చదనమూ పెరుగుతోంది.
* వీరి సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే వస్తువులతో ఇక్కడ 55 మ్యూజియాలున్నాయి. వీటిల్లో ఇప్పటికీ మ్యాజిక్‌ షోలూ జరుగుతుంటాయి.
* ఇక్కడ 180 కిలోమీటర్ల మేర సైకిల్‌ దారులున్నాయి. సైకిళ్లు అద్దెలకిచ్చే దుకాణాలూ ఎక్కువే. అందుకే దీనికి ‘వరల్డ్‌ మోస్ట్‌ బైక్‌ ఫ్రెండ్లీ సిటీ’ అనే పేరుంది.
* ఈ ఒక్క నగరంలోనే మొత్తం తొమ్మిది యునెస్కో గుర్తించిన కట్టడాలున్నాయి.

శతాబ్దంగా నిర్మాణంలోనే..

* ఈ నగరం మధ్యలో సగ్రడా ఫెమిలియా అతి పెద్ద రోమన్‌ క్యాథలిక్‌ చర్చి ఉంది. ఇది ఇప్పటి వరకూ ఇంకా పూర్తి కాలేదు.
* 1882లో దీని నిర్మాణం మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన అన్ని పనులూ పూర్తవడానికి 2032 అవుతుందని అంచనా వేస్తున్నారు.
* యునెస్కో దీని మీదున్న ఆర్కిటెక్చరల్‌ వర్క్‌ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది.
* బొకబెల్లా అనే ఆయన ఓసారి ఇటలీ వెళ్లారు. అక్కడున్న ఓ చర్చిని చూసి ఆశ్చర్యపోయారు. అలాంటి ఓ పెద్ద చర్చిని తమ దేశంలోనూ నిర్మించుకోవాలని అనుకున్నారు. స్వదేశానికి వచ్చాక ఒక అసోసియేషన్‌ను ఏర్పాటు చేసి ఈ చర్చి నిర్మాణాన్ని మొదలుపెట్టారు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని