ఈ కొండల రుచే వేరన్పా!

చిన్న కొండల్లా ఉంటాయ్‌... చూసేందుకు చిత్రంగా కనిపిస్తాయ్‌... అవి మట్టివీ కాదు... పోనీ రాతివీ కాదు... ఇంక దేంతో ఏర్పడతాయబ్బా?చిత్రమైన ఆకారంలో చిన్న చిన్న కొండలున్నాయి. తెల్లగా మెరిసిపోతుంటాయి. వాటి మధ్యలో రంగురంగుల పొరలు చారల్లా కనిపిస్తుంటాయి. చూస్తే మంచే ఇలా రంగులు మారిందా? అనిపిస్తుంది కానీ.. ఇదస్సలు మనమనుకున్నదేదీ కాదు....

Published : 27 Mar 2019 00:22 IST

చిన్న కొండల్లా ఉంటాయ్‌... చూసేందుకు చిత్రంగా కనిపిస్తాయ్‌... అవి మట్టివీ కాదు... పోనీ రాతివీ కాదు... ఇంక దేంతో ఏర్పడతాయబ్బా?

చిత్రమైన ఆకారంలో చిన్న చిన్న కొండలున్నాయి. తెల్లగా మెరిసిపోతుంటాయి. వాటి మధ్యలో రంగురంగుల పొరలు చారల్లా కనిపిస్తుంటాయి. చూస్తే మంచే ఇలా రంగులు మారిందా? అనిపిస్తుంది కానీ.. ఇదస్సలు మనమనుకున్నదేదీ కాదు.

* ఈ కొండల్లో ఉన్నదంతా అచ్చంగా ఉప్పే. లవణమంతా పోగుపడి ఇలా బుల్లి శిఖరాల్లా మారిపోయింది.

* ఈ ఉప్పు కొండల ప్రాంతం ఎక్కడుందంటే ఇరాన్‌లో.

* తమాషాగా ఉప్పు ఇలా ఎలా మారిందబ్బా? అని ఎవ్వరికైనా సందేహం వస్తుంది. మరేమో లక్షల సంవత్సరాల క్రితం ఈ ఉప్పు కొండల స్థానంలో పెద్ద ఉప్పు నీటి వనరులుండేవి. అవన్నీ కాలక్రమంలో ఎండిపోయాయి. తర్వాత పెద్ద ఎత్తున ఉప్పు ఇక్కడ మిగిలిపోయింది.

* ఈ ఉప్పు నిక్షేపాల చుట్టూ జాగ్రోస్‌ పర్వతాలని ఉన్నాయి. ఆ పర్వతాల మీద నుంచి కొట్టుకొచ్చిన లవణాలూ వచ్చి ఈ నిక్షేపాలపై చేరిపోయాయి. అలా ఆ లవణ నిక్షేపాలు మందంగా మారిపోయాయి. ఇంకా అక్కడున్న ఖనిజాలు వీటిలోకి వచ్చి చేరాయి. భూమి అడుగు నుంచి వచ్చిన ఒత్తిడి తోడవ్వడంతో అవిలా పొరలు పొరలుగా కొండల మాదిరిగా ఏర్పడిపోయాయి. ఖనిజాలు చేరడంతో ఈ ఉప్పు రంగుల్లోనూ మనకు కనిపిస్తుంది.

* ఈ శిఖరాల్లాంటివే కాదు.. అక్కడ నేల పైనా ఉప్పు ఓ రకం పొరల్లా గమ్మత్తయిన ఆకారాల్లో పరుచుకుని కనిపిస్తుంటుంది.

* వీటిని స్థానికంగా సాల్ట్‌ డోమ్స్‌ అనీ సాల్ట్‌  గ్లేసియర్స్‌ అనీ పిలిచేస్తుంటారు. పెద్ద పెద్ద పర్వతాల మధ్యనున్న లోయల్లో ఇవి విస్తరించి ఉన్నాయి కదా. అందుకే ఈ లోయల్ని సాల్ట్‌ వ్యాలీస్‌ అనీ పిలిచేస్తారు.

* వీటి దగ్గరే కొన్ని ఉప్పు గనులూ ఉన్నాయి. వాటిలోనే ప్రపంచంలోనే అతి పొడవైన ఉప్పు మైన్‌ సైతం ఉంది. భలే వింత కొండలే కదూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని