భలే గాలిమేడ!

హాయ్‌ ఫ్రెండ్స్‌... ఎలా ఉన్నారు?తెలుసా? ఈసారి నేను గాలిమేడల్ని చూసొచ్చా... ఆ... అంటూ నోరెళ్లబెట్టారు కదూ.. బడాయి కాకపోతే గాలిమేడల్ని చూడ్డమేంటీ అంటారా? వివరాలు చదివితే మీకే తెలుస్తుంది!....

Published : 28 Mar 2019 01:00 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌... ఎలా ఉన్నారు?తెలుసా? ఈసారి నేను గాలిమేడల్ని చూసొచ్చా... ఆ... అంటూ నోరెళ్లబెట్టారు కదూ.. బడాయి కాకపోతే గాలిమేడల్ని చూడ్డమేంటీ అంటారా? వివరాలు చదివితే మీకే తెలుస్తుంది!

* ఎక్కడుంది?
రాజస్థాన్‌లోని జైపూర్‌లో. ఈ మేడ పేరు హవామహల్‌.

* ఎందుకు కట్టారు?
మహారాజా సవాయ్‌ ప్రతాప్‌ సింగ్‌ దీనిని 1799లో కట్టించారు. రాజపుత్ర రాణులు నగరంలోని విశేషాలను చూడ్డానికి సాయంత్రం పూట చల్లగాలిలో విహరించడానికి ఇలా కట్టించారట. దీన్ని లాల్‌ చంద్‌ ఉస్తా రూపొందించారు. 

* అసలు గొప్ప?
హవామహల్‌లో ప్రత్యేక ఆకర్షణ ముందు భాగం గోడకు ఏర్పాటు చేసిన కిటికీలే. ఎండాకాలంలో కూడా ఈ కిటికీల్లోంచి చల్లటి గాలి వస్తుంది. అందుకే దీనికి హవామహల్‌ అన్న పేరు వచ్చింది. అంటే గాలిమేడ అన్నమాట. ప్రతీ కిటికీకి సన్నగా చెక్కిన జాలీలాంటి నిర్మాణం వంపు తిరిగిన గుమ్మటం ఉంటాయి. ఇవి గాల్లో తేలుతున్నట్లుగా అనిపిస్తుంది. సున్నంతో చేసిన అందమైన అంచులతో ఇట్టే ఆకట్టుకుంటాయి. కిటికీల్లోంచి చూస్తే నగరమంతా చక్కగా కనిపిస్తుంది. చిత్రమేంటంటే.. లోపల ఉన్నవారు బయటివారికి కనిపించరు. అప్పట్లో రాజపుత్ర రాణులు పరదా పద్ధతిని పాటించేవారు. వారికోసమే ప్రత్యేకంగా దీనిని కట్టించారని చెబుతారు.

* ఎలా ఉంటుంది?
ముందు నుంచి చూస్తే అదో పెద్ద భవనంలా కనిపిస్తుంది. 50 అడుగుల ఎత్తుతో అయిదు అంతస్తులతో 953 కిటికీలతో భలేగా ఉంటుంది. వెనకవైపు కొన్ని స్తంభాలు వాలుగా ఏర్పాటు చేసిన దారులు అంతే. అదే ఈ హవా మహల్‌ ప్రత్యేకత. పేరులోనే కాదు. నిర్మాణంలోనూ గమ్మత్తుగా ఉంటుంది. ఇసుకరాతితో కట్టిన ఈ భవనం కింది నుంచి పైకి వెళ్తున్న కొద్దీ వైశాల్యం తగ్గుతూ వస్తుంది. దీనిపై మూడు అంతస్తులు కేవలం చిన్నగది పరిమాణంలో ఉంటే అడుగు భాగం మాత్రం విశాలంగా ఉంటుంది. 50 అడుగుల ఎత్తుగా ఉండే ముందు భాగం గోడ అడుగు మందంగా ఉంటుంది.
* వెనక నుంచే వెళ్లాలి! 
వెనకవైపే ద్వారం. అందుకే ఈ మహల్‌లోకి వెళ్లాలంటే వెనక నుంచే చేరుకోవాలి. ముందు నుంచి అందంగా ఉండే ఈ భవనం లోపల అంతా ఖాళీనే. అక్కడక్కడ భవనాన్ని పట్టి ఉంచే స్తంభాలు, దారులు ఉంటాయి. దూరం నుంచి 
ఈ మహల్‌ శ్రీకృష్ణుడి కిరీటంలా కనిపిస్తుంది.
* ప్రస్తుతం ఎలా ఉంది?
దీన్ని చూడ్డానికి ఎక్కడెక్కడి నుంచో పర్యటకులు వస్తుంటారు. ఏ రోజైనా వెళ్లి సందర్శించొచ్చు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని