వీరు కదిలితే.. వారికి వేణ్ణీళ్లు!

నీటిని ఎలా వేడి చేస్తాం? ‘ఏముంది? గీజర్‌లోనో లేదంటే పొయ్యి మీద పెట్టో’ అనేస్తాం.. మరేమో ఓ చోటు మాత్రం ఇందుకు భిన్నం... ఎందుకంటే?నీరు వేడవ్వడానికి వేడి అవసరం కదా. అది ఇటు కరెంటు నుంచైనా రావాలి. అటు పొయ్యి మంట నుంచైనా అందాలి. కానీ ఓ దగ్గర మాత్రం మనుషుల కదలికల నుంచి వస్తోంది. వారి నుంచి వచ్చే ఉష్ణమే నీటిని వేడి చేసేస్తోంది...

Published : 29 Mar 2019 00:10 IST

నీటిని ఎలా వేడి చేస్తాం? ‘ఏముంది? గీజర్‌లోనో లేదంటే పొయ్యి మీద పెట్టో’ అనేస్తాం.. మరేమో ఓ చోటు మాత్రం ఇందుకు భిన్నం... ఎందుకంటే?
నీరు వేడవ్వడానికి వేడి అవసరం కదా. అది ఇటు కరెంటు నుంచైనా రావాలి. అటు పొయ్యి మంట నుంచైనా అందాలి. కానీ ఓ దగ్గర మాత్రం మనుషుల కదలికల నుంచి వస్తోంది. వారి నుంచి వచ్చే ఉష్ణమే నీటిని వేడి చేసేస్తోంది.
* అదెక్కడంటే స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోం తెలుసుగా. అక్కడ ‘స్టాక్‌హోం సెంట్రల్‌ స్టేషన్‌’ అని ఉంది. అక్కడే ఈ గమ్మత్తయిన పని జరుగుతోంది.
* ఆ రైల్వే స్టేషన్‌ ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. రోజుకు రెండున్నర లక్షల మందికి పైగా ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. అలా అక్కడ మనుషులు కదలడం, సామాన్లు లాక్కెళ్లడం, అల్పాహారం తినడంలాంటి చాలా పనులు చేస్తుంటారు. ఆ పనులన్నింటి వల్ల అక్కడ ఉష్ణం పుడుతుంది. ఈ పనుల వల్ల అక్కడే కాదు ఎక్కడైనా కొంత వేడి పుడుతుంది. అందుకే మనుషులు ఎక్కువగా ఉన్న చోట ఉక్కబోత మనకూ అనుభవమే.
* జనాల నుంచి ఉత్పన్నమయ్యే వేడిని మామూలుగా ఎగ్జాస్ట్‌లను ఉపయోగించి బయటకు పంపించేస్తారు. అయితే ఈ రైల్వే స్టేషన్లో చేస్తున్నదేమిటంటే? ఇక్కడి వెంటిలేషన్‌ విధానం కాస్త భిన్నంగా ఉంది. ఆ వేడిని అది లాక్కుని ఆ భవనం కిందున్న ట్యాంకుల్లోని నీటిపైకి మళ్లిస్తుంది. దీంతో ఆ నీరు క్రమంగా వేడెక్కుతుంది.
* అలా వచ్చిన వేడి నీళ్లే ఆ పక్కన ఉన్న పదమూడు అంతస్తుల భవనమంతా సరఫరా చేస్తారు.
* ఇంత కష్టం ఎందుకంటే స్వీడన్‌లో విద్యుత్‌ ఛార్జీలు అధికం. పైగా అక్కడ శీతకాలం విపరీతమైన చలి ఉంటుంది. దీంతో అంతా వేడి నీటినే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అందుకే ఇక్కడ ఈ విధానం బాగా ఉపయోగపడుతోంది. మామూలుగా వేడి నీటిని తయారు చేసుకునే ఖర్చులో పావుశాతం డబ్బులకే ఈ విధానంలో వేడి నీళ్లు తయారైపోతున్నాయి. అందుకే స్వీడన్‌ ఇంజినీర్లు ఈ అద్భుతమైన ఐడియాను ఆచరణలో పెట్టగలిగారు. ఐడియా అదిరిపోలా!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని