బాహు బల్లులు!

పే......ద్ద భవనమంత ఎత్తుండే డైనోల కథలు వినడమంటే మనకు ఎంతో ఇష్టం... పొ..డ..వై..న తోకతో అవి నడుస్తున్న సినిమాల్ని చూస్తే సరదాగా ఉంటుంది... అవి ఇప్పుడు లేకున్నా... వాటి ముచ్చట్లన్నా భలే ఆసక్తి... అందుకే కొన్ని డైనోసార్లు మన పేజీలోకి వచ్చేశాయి...  కొన్ని మిలియన్‌ ఏళ్లక్రితం నేలపై తిరుగాడిన ఈ జీవులు ఏం చెబుతాయో ఏమో!?......

Updated : 04 Apr 2019 02:51 IST

డైనోల పెద్దన్న!

పే......ద్ద భవనమంత ఎత్తుండే డైనోల కథలు వినడమంటే మనకు ఎంతో ఇష్టం... పొ..డ..వై..న తోకతో అవి నడుస్తున్న సినిమాల్ని చూస్తే సరదాగా ఉంటుంది... అవి ఇప్పుడు లేకున్నా... వాటి ముచ్చట్లన్నా భలే ఆసక్తి... అందుకే కొన్ని డైనోసార్లు మన పేజీలోకి వచ్చేశాయి...  కొన్ని మిలియన్‌ ఏళ్లక్రితం నేలపై తిరుగాడిన ఈ జీవులు ఏం చెబుతాయో ఏమో!?

హాయ్‌ పిల్లలూ! ఇలా మీతో కబుర్లు చెప్పడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందర్రా. ఇక నా సంగతికి వస్తే... మీకు తెలిసిన రాకాసి బల్లుల్లో అతి పెద్దదాన్ని. నాపేరేమో అర్జెంటీనోసారస్‌. నేను అడుగు వేస్తే భూమి దద్దరిల్లేది. అడుగు తీసి అడుగు వేశానంటే... ఓ చిన్నపాటి భూకంపం వచ్చినట్లే ఉండేది. ఇప్పుడున్న జీవుల్లో అతి పెద్ద జీవైన నీలి తిమింగలం కన్నా నా రూపమే పెద్దదిగా ఉండేది తెలుసా? ఇంకా నా పొడవు తల నుంచి తోక వరకు 35 మీటర్లు. ఇక బరువేమో 70 టన్నులు. అంటే ఇంచుమించు 10 ఆఫ్రికా ఏనుగులంత బరువు. చూసేందుకు 10 డబుల్‌ డెక్కర్‌ బస్సులను ఒక్కచోట నిలిపినట్లుగా ఉండేదాన్ని. నా ఆ భారీ రూపం చూస్తేనే జీవులన్నీ దడదడలాడిపోయేవి. కానీ నేను మాత్రం శాకాహారినే. నేను ఏ జీవినీ ఇబ్బంది పెట్టేదాన్ని కాదు. కానీ కొన్నిసార్లు నేను నడుస్తుంటే... నా పాదాల కింద మొసళ్లు, తాబేళ్లు, చిన్న జీవులు పొరపాటున నలిగిపోయేవి.

బలమంతా పంటిలోనే ఉన్నదీ!

నేను టైరానోసారస్‌ రెక్స్‌ను. ముద్దుగా మీ శాస్త్రవేత్తలు టి రెక్స్‌ అని కూడా పిలిచేస్తార్లెండి. నా ఒడ్డూపొడుగూ 13 మీటర్లు. మా కాలంలో భూమి మీద తిరిగిన అతి పెద్ద జంతువుల్లో నాకూ స్థానం ఉందండోయ్‌. భారీ పరిమాణమే కాదు... నాకు పదునైన దంతాలు, పటిష్ఠమైన దవడలుండేవి. నా కన్నా పెద్ద పరిమాణం ఉన్న శత్రుజీవుల్ని కూడా ఇట్టే ఓడించేదాన్ని. నా దంతాల శక్తి గురించి వింటే మీరూ ఆశ్చర్యపోతారు. నా 60 దంతాల శక్తి అంతా ఇంతా కాదు. ఒకేసారి 100 కిలోల మాంసాన్ని ఇట్టే నమిలిపడేసేదాన్ని. నన్ను జంతువుల్లోకెల్లా భయంకరమైన జీవిగా కూడా అనుకుంటారు.

గొప్ప తల్లి!

గిగాంటొరాఫ్టర్‌. ఇది నా పేరు. నాకోసం చెప్పే ముందు మీకో ప్రశ్న. ప్రపంచంలో అతి పెద్ద గుడ్డు పెట్టే పక్షి ఏది? ఆస్ట్రిచ్‌ అనేస్తారు వెంటనే. మీకు నా గురించి తెలియదు కానీ నేను ఇప్పుడు ఉండి ఉంటే ప్రపంచంలో అతి పెద్ద పరిమాణంలో గుడ్డు పెట్టే జీవిగా ఆ పేరు నాకే వచ్చేది. నా గుడ్డు ఏకంగా 60 సెం.మీ. పొడవుతో, ఐదు కిలోల బరువుతో ఉండేది. పక్షిలాంటి ముక్కు, వింతైన రెక్కలతో, భారీ పరిమాణంతో ఉండేదాన్ని. ఎనిమిది మీటర్ల పొడవైన భారీ జీవిని. పెద్దగా ఉండే నా గుడ్డును కాపాడుకునేందుకు ఏం చేసేదాన్నో తెలుసా? 80 రోజుల పాటు దానిపైనే కూర్చునేదాన్ని.

బాబోయ్‌ ఇదేం వేటనో!

మా రాకాసి బల్లుల్లో ఒక్కోదానికి ఒక్కో ప్రత్యేకత ఉన్నట్టే మాకూ ఓ గొప్ప ఉంది. అదేంటో చెప్పనా? ఇప్పటిదాకా మీకు తెలిసిన జంతువులన్నింటిలోకీ నా వేట ఎంతో భయంకరమైంది. ఇంతకీ నా పేరే చెప్పలేదు కదూ. అల్లోసారస్‌. నా తలనే గొడ్డలిగా వాడుకునేదాన్ని. అవును మీరు సరిగ్గానే చదివారు. తలను ఎంతో శక్తితో ఊపుతూ శత్రుజీవులతో దాడికి దిగేదాన్ని. ఎంతటి బలమైన జీవైనా నాతో పోటీకీ వస్తే కిందపడాల్సిందే. నా వింత వేట తీరు వల్ల భయంకర రాకాసి బల్లి అని పిలుస్తారు.

పొట్టిదే కానీ గట్టిది!

నా రూపం చూసి ‘ఇదేంటీ రాకాసి బల్లి పిల్లనా?’ అని సందేహం వచ్చింది కదూ. కానీ కాదు. నా పేరు వెలోసిరాఫ్టర్‌. పరిమాణంలో చిన్నగానే ఉండేదాన్ని. మీటర్‌ కంటే పొడవు ఉండను. బరువు 15 కిలోలు మాత్రమే. మరి నా గొప్పేంటీ అంటారా? నేను వేటకు బయలుదేరానంటే... గంటకు ఇంచుమించు 50 కిలోమీటర్ల వేగంతో పరుగులు తీసేదాన్ని. అంతేకాదూ... నా పదునైన గోళ్లనే ఆయుధాలుగా వాడుకునేదాన్ని వాటితోనే శత్రుజీవుల చర్మాన్ని చీల్చి పొట్ట నింపుకునేదాన్ని. అన్నట్టూ... జురాసిక్‌ పార్క్‌ సినిమాలో నాపేరు వినే ఉంటారుగా. అందులో నా వేగమూ చూసే ఉంటారుగా!

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని