'ఇంకా' ఇళ్లే!

నేస్తాలూ! చిన్నూనొచ్చేశా! పిచ్చు కబుర్లు తెచ్చేశా... అదేంటీ అలా తప్పుతప్పుగా అంటున్నావనుకుంటున్నారా?అదేంలేదు.. నేనిప్పుడు తెచ్చింది మచుపిచ్చు కబుర్లు మరి. మొన్ననే అక్కడికి వెళ్లొచ్చా. దాని విశేషాలు మీ కోసం మోస్కొచ్చా! * ఈ భవనాల మధ్యలో ఓ రాయల్‌ ఎస్టేట్‌, ఇంకా రహస్య సభా ప్రాంగణం ఉన్నట్లు చెబుతారు. * యునెస్కో 1983లో దీన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించింది.

Published : 05 Apr 2019 00:10 IST

 

నేస్తాలూ! చిన్నూనొచ్చేశా! పిచ్చు కబుర్లు తెచ్చేశా... అదేంటీ అలా తప్పుతప్పుగా అంటున్నావనుకుంటున్నారా?అదేంలేదు.. నేనిప్పుడు తెచ్చింది మచుపిచ్చు కబుర్లు మరి. మొన్ననే అక్కడికి వెళ్లొచ్చా. దాని విశేషాలు మీ కోసం మోస్కొచ్చా!

ఏమున్నాయ్‌?

* ఈ భవనాల మధ్యలో ఓ రాయల్‌ ఎస్టేట్‌, ఇంకా రహస్య సభా ప్రాంగణం ఉన్నట్లు చెబుతారు.
* యునెస్కో 1983లో దీన్ని ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తించింది.
* ది లాస్ట్‌ సిటీ ఆఫ్‌ ద ఇంకాస్‌ అని దీన్ని ముద్దుగా పిలిచేస్తుంటారు.

ఇప్పటి పరిస్థితి?

ఇక్కడకు ఒక రోజులో 2500 మంది పర్యటకుల్ని మాత్రమే అనుమతిస్తారు. అమెజాన్‌ అడవి మీదుగా ఈ చోటును చేరుకోవచ్చు. ఈ పర్వత శిఖరాన్ని ట్రెక్కింగ్‌ చేసుకుంటూ వెళ్లి దీన్ని చూడొచ్చు. ఏటా ఇక్కడకు లక్షా యాభై వేల మందికి పైగా పర్యటకులు వస్తున్నారు.

ఎక్కడుంది?

* దక్షిణ అమెరికా ఖండంలోని పెరూలో ఉంది.
* 1450వ సంవత్సరంలో దీన్ని స్థాపించార్ట. అంటే పదిహేనో శతాబ్దంలో అన్నమాట. అయితే ఇది ఇక్కడున్నట్లు ఇప్పటివారికి తెలిసింది మాత్రం 1911లో.

ఏంటీ మచుపిచ్చు?

* ఇది మొత్తం 150 భవనాలతో నిర్మితమైన భవన సమూహం. అదీ సముద్ర మట్టానికి చాలా ఎత్తులో. ఎక్కడో పర్వత శిఖరంపై. ఇక్కడ ఇళ్లు, గుళ్లు, స్నానాల గదుల్లాంటివన్నీ ఉన్నాయి. వీటన్నింటి బయట ప్రహరీలూ, చాలా చోట్ల బోలెడు మెట్లూ ఉన్నాయి.
* దీని అధికారిక పేరు హిస్టారిక్‌ సాంచురీ ఆఫ్‌ మచుపిచ్చు. అంటే ప్రాచీన పర్వతం అని. ఇలాంటి స్థావరాలు పెరూ మొత్తంలో చాలానే ఉన్నాయి.

స్థాపించింది ఎవరు?

* దక్షిణ అమెరికాలో అప్పట్లో ‘ఇంకా’ సామ్రాజ్యం అతి పెద్దది. ఈ చక్రవర్తుల పాలనలో ఉన్నపుడు ఈ ఇంకాలపై స్పానిష్‌ వారు దాడులు, యుద్ధాలు చేస్తుండేవారు.
* ఆ క్రమంలో ‘ఇంకా’ స్థావరాలు, శిబిరాల్ని అన్ని చోట్లా ఏర్పాటు చేసుకుంటూ ఉండేవారు. అందులో భాగంగానే వీరు శత్రువులకు కనిపించని చోట భవన సముదాయాల్ని నిర్మించుకునేవారు. వాటినే స్పానిష్‌ వారు ధ్వంసం చేసేసేవారు. వారికి కనిపించకుండా ఇలా పర్వత శిఖరంపై ఈ భవన సముదాయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అందుకే దీన్ని స్పానిష్‌ వారు గుర్తించలేకపోయారు. అదే ఇప్పటి వరకూ ఉందిలా..

కట్టడం ప్రత్యేకతేంటి?

* ఈ భవన సమూహం మొత్తంలో అక్కడక్కడా వందకు పైగా మెట్ల నిర్మాణాలున్నాయి. రాళ్లను పొందికగా సర్ది, మట్టిని పరిచి ఈ మెట్లను తయారు చేశారు.
* ఈ భవన నిర్మాణాలకు వాడిన రాళ్లు దాదాపుగా 22కిలోలకు పైగా బరువున్నాయి.
* రాళ్లను ఒకదానిపై ఒకటి పరిచి వీటిని కట్టారనిఅనుకున్నాం కదా. అయితే వాటి మధ్యలో పలుచటి బ్లేడును కూడా చొప్పించలేం. అంత నైపుణ్యంతో నిర్మించారు. ఇంత పైన ఉన్నా రాళ్లు దొర్లి కిందికి పడిపోయే దృశ్యాలు ఇక్కడ కనే కనిపించవుట.
* భూకంపాల్ని తట్టుకుని నిలబడేలా ఈ భవనాల ఇంజినీరింగ్‌ ఉండటం ఇప్పటి వారినీ ఆశ్చర్యపరుస్తోంది.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని