కొండ మీద కోట... కోట చుట్టూ గోడ!

హాయ్‌ ఫ్రెండ్స్‌.... నేను మీ చిన్నూని... తెలుసా? ఈసారి నేను ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గోడ దగ్గరికి వెళ్లొచ్చా...గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా తెలుసు...కానీ ఇదేం గోడబ్బా? అని అనుకుంటున్నారు కదూ.. మరేమో అది మన దేశంలోనే ఉంది.. దీన్నే గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ ఇండియా అంటారు...

Published : 18 Apr 2019 00:26 IST

హాయ్‌ ఫ్రెండ్స్‌.... నేను మీ చిన్నూని... తెలుసా? ఈసారి నేను ప్రపంచంలోనే రెండో అతిపెద్ద గోడ దగ్గరికి వెళ్లొచ్చా...గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ చైనా తెలుసు...కానీ ఇదేం గోడబ్బా? అని అనుకుంటున్నారు కదూ.. మరేమో అది మన దేశంలోనే ఉంది.. దీన్నే గ్రేట్‌ వాల్‌ ఆఫ్‌ ఇండియా అంటారు... ఆ సంగతులేంటో చదివేయండి!

* ఎక్కడుంది?

రాజస్థాన్‌లో. రాజ్‌సమంద్‌ జిల్లాలోని కుంభల్‌గఢ్‌ కోటలో. ఈ కోట ఆరావళి పర్వతాలపై సముద్రమట్టానికి 3600 అడుగుల ఎత్తుపై ఉంటుంది. ఈ కోట గోడ...  చైనా గోడంత పొడవు లేకపోయినా...  15 అడుగుల వెడల్పుతో 36 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఈ గోడపై ఒకేసారి ఎనిమిది గుర్రాలు ఒకదాని పక్కన ఒకటి నడవగలవు. అందుకే దీనిపై శత్రువులు దండెత్తడానికి భయపడేవారట.

* రైతులకు వెలుగులు!

కోట సమీపంలో వ్యవసాయం చేసే రైతుల కోసం రోజూ సాయంత్రం కాగానే 100 కిలోల పత్తి, 50 కిలోల నెయ్యితో పెద్ద పెద్ద దీపాలు వెలిగించేవారట.

* ఎక్కడెక్కడి నుంచో!

ఘనమైన చరిత్ర, కనువిందు చేసే కట్టడాలతో ఉండే ఈ కోటనిర్మాణాన్ని, కోటగోడను చూడ్డానికి పర్యటకులు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. సాయంత్రం లైట్‌ అండ్‌ సౌండ్‌ షో కూడా ఉంటుంది. కోట చరిత్ర కథలతో ప్రదర్శనలూ ఉంటాయి.

* ఎవరు?ఎప్పుడు కట్టారు?

పదిహేనో శతాబ్దంలో మేవార్‌ రాజు రణకుంభ కట్టించారు. నిజానికి కుంభల్‌గఢ్‌ నిర్మాణం రెండో శతాబ్దంలోనే మొదలైంది. అప్పటి జైనులు ఈ కొండ మీద చాలా దేవాలయాలు కట్టించారు. అయితే రణకుంభ కాలంలోనే దీని పూర్తి నిర్మాణం జరిగింది. రణకుంభకు కోటలను కట్టించడం అంటే ఆసక్తి. అప్పటి మేవార్‌ రాజ్యంలో 84 కోటలు ఉంటే అందులో 32 రణకుంభ నిర్మించినవేనట.

* ప్రత్యేకతలేంటి?

ఎత్తయిన కొండ మీద బలమైన గోడలతో ఉండే ఈ కోటలో మొత్తం 360 దేవాలయాలు కూడా ఉన్నాయి. అంటే రోజుకి ఒక గుడి చొప్పున అన్నింటిలోనూ పూజలు చేయాలంటే ఏకంగా ఏడాది పడుతుంది అన్నమాట. కోట ఏడు మహా ద్వారాలతో అద్భుతమైన శిల్ప సౌందర్యంతో ఉంటుందిది.
కోటకుండే ఏడు ద్వారాల్లో రెండో ద్వారం తలుపులకు అద్దాలుండటం విశేషం. వీటిని తెరిచినప్పుడు ఆ అద్దాల నుంచి వచ్చిన వెలుగు కోట లోపల ప్రతిబింబించేది. అంటే శత్రువులు ఎవరైనా వస్తే వెంటనే తెలిసిపోయేదన్నమాట. రాజదర్పం ఉట్టిపడే 252 అద్భుతమైన ప్యాలెస్‌లు ఉన్నాయి. ఇంకా వేలాది మొక్కలతో అందమైన తోటలు ఉంటాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని