ఈ నగరాలు దాగున్నాయ్‌!

నగరమంటే రణగొణ ధ్వనులు... పరుగులు తీసే మనుషులు... చుట్టూ బోలెడు దుకాణాలు... ఇవే మన కళ్ల ముందు కదలాడతాయి... మరివేం లేని నగరాలు కొన్ని ఉన్నాయి... ఇంకా చెప్పాలంటే అసలిక్కడ మనుషులే ఉండరు... ఈ గమ్మత్తయిన నగరాలేంటో తెలియాలంటే... ఇది చదివేయండి!....

Published : 09 May 2019 00:30 IST

నగరమంటే రణగొణ ధ్వనులు... పరుగులు తీసే మనుషులు... చుట్టూ బోలెడు దుకాణాలు... ఇవే మన కళ్ల ముందు కదలాడతాయి... మరివేం లేని నగరాలు కొన్ని ఉన్నాయి... ఇంకా చెప్పాలంటే అసలిక్కడ మనుషులే ఉండరు... ఈ గమ్మత్తయిన నగరాలేంటో తెలియాలంటే... ఇది చదివేయండి!

వీధుల కింద వీధులు!

స్కాట్లాండ్‌ రాజధాని ఎడింబర్గ్‌ అని మనకు తెలిసిందే. మరేమో ఈ రాజధాని నగరం కింద మరో రహస్య నగరముంది. కాదు కాదు. ఉండేది. అక్కడ ఎవరూ ఉండట్లేదు. దాన్ని ఎడింబర్గ్‌ వాల్స్‌ నగరమంటుంటారు. అదీ పద్దెనిమిదో శతాబ్దంలో వాడుకలో ఉండేది. ఇప్పుడు దీనిపైన బోలెడు దెయ్యాల కథలు స్థానికంగా ప్రచారంలో ఉన్నాయి. అయితే అప్పట్లో కొందరు వ్యాపారవేత్తలు వారి అవసరాల కోసం దీన్నిలా నిర్మించుకున్నారు. వారి వ్యాపారం వేరే చోటికి వెళ్లిపోయేసరికి పేదలు ఇక్కడొచ్చి ఉండేవారు. 

బాంబు దాడులకు భయపడి! 

చైనాలో బీజింగ్‌ ఉందనేది అందరికీ తెలిసిన విషయమే. మరి బీజింగ్‌ కింద డిక్సియా చెంగ్‌ నగరం ఉందని తెలుసా? అయితే ఇది మిగిలిన వాటిలా చాలా పాతదేం కాదు. 1970ల్లో నిర్మించింది. చైనాపై సోవియట్‌ యూనియన్‌ అణుయుద్ధం సమయంలో బాంబు దాడుల నుంచి రక్షణ కోసం భూగర్భంలో పొడవాటి సొరంగాల్లాంటి వాటిని నిర్మించేశారు. వాటిల్లోకి వెళ్లడానికి వంద పైకి కనిపించని ప్రవేశాల్ని ఏర్పాటు చేశారు. స్కూళ్లు, ఆసుపత్రుల్లాంటి సౌకర్యాలూ లోపలే ఉండేవి. బయట ఉండటానికి భయంగా అనిపిస్తే అప్పుడు ప్రజలూ లోపలికి వచ్చి నిద్రించి వెళుతుండేవారు. చైనా వాళ్లు ఈ నగరాన్ని ‘ద అండర్‌ గ్రౌండ్‌ గ్రేట్‌ వాల్‌’ అని ముద్దుగా పిలుచుకుంటారు.

20 వేల మందికి సరిపోతుంది!

ర్కీ మధ్య ప్రాంతంలో కపడోసియా సిటీ ఉంది. దాని అడుగున డెరింకుయు అని మళ్లీ ఇంకో నగరముంది. గబగబా మ్యాపింగ్‌లోకెళ్లి వివరాలు శోధించకండి. ఎందుకంటే ఇదున్నట్టు గూగుల్‌ మ్యాప్‌ల్లో కనిపించదు. బయట కూడా చాలా మందికి తెలీదు. ఇదున్నది భూగర్భంలో కదా మరి. భూమికి 85 మీటర్ల లోతున ఈ సిటీ ఉంది. అయితే ఇదున్నట్టు 1963లో గుర్తించారు. రోడ్లు, ఇళ్లు, చర్చిలు... ఇలా అన్నీ ఇక్కడ కనిపించాయి. 20వేల మంది ఉండడానికి సరిపడా వసతులున్నాయి. ఇప్పుడు ఈ భూగర్భ నగరంలో పది శాతం.. పర్యటకులు వెళ్లి చూసేందుకు అవకాశం ఉంది.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని