వ్యోమగాముల ఆహారం ఏమిటి?

ప్రశ్న: అంతరిక్షంలో వ్యోమగాములు ఎలాంటి ఆహారం తీసుకుంటారు?

Published : 02 Jan 2020 00:42 IST

ప్రశ్న: అంతరిక్షంలో వ్యోమగాములు ఎలాంటి ఆహారం తీసుకుంటారు?

అంతరిక్షంలో తిరుగాడే వ్యోమగామికి రోజుకు నాలుగు సార్లు ఆహారం ఉంటుంది. మొదటి అల్పాహారం, రెండో అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజనాలు ఉంటాయి. ఈ రకంగా ఆహారం తీసుకుంటే వారి శరీర ఆర్గానిజానికి చక్కగా సరిపడుతుందని డాక్టర్లు నిర్ణయించారు. శక్తి పరంగా చెప్పాలంటే రోజుకు 3,200 కేలరీల ఆహారం తీసుకోవాలి. వ్యోమగాముల మెనూ ఇలా ఉంటుంది. మొదటి అల్పాహారం రోస్టు చేసిన చల్లని పందిమాంసం, రుబ్బిన బంగాళాదుంప, గోధుమరొట్టె, సీమదానిమ్మ, కాఫీ. రెండో అల్పాహారం.. జున్ను, ఫిష్‌ బిస్కెట్లు, ఆపిల్‌జ్యూస్‌, మధ్యాహ్న భోజనం.. స్టర్జియావ్‌ చేపల పాకము, పారెల్‌ చారు, ఉడకబెట్టిన గొడ్డుమాంసం, రొట్టె, ద్రాక్ష, రేగుపళ్ల జ్యూస్‌, ఎండిన రేగుపళ్లు, రాత్రి భోజనం.. నల్లద్రాక్ష, గుడ్డుతో ఉడికించిన పంది మాంసం, జున్ను, రైరొట్టె, స్వీట్లు, టీ. ఆహారాన్ని ఎంపిక చేయడంలో కావాల్సినన్ని విటమిన్లు, కేలరీల శక్తి ఉండే సమీకృత ఆహారం వ్యోమగామికి సమకూరేటట్లు నిపుణులు జాగ్రత్తలు తీసుకుని పై మెనూ తయారు చేశారు. వారు తీసుకెళ్లే ఆహారం తడిలేకుండా పొడిగా ఉండేటట్లు చేసి ఘనీభవింప చేస్తారు. ఇందులో వేడినీరు పోసుకుంటే వేడివేడిగా రుచికరమైన ఆహారం తయారవుతుంది. రోజుకు ఒక్కొక్కరికి 3.6 గ్యాలన్ల నీరు అవసరం అవుతుంది. తీసుకు వెళ్లిన నీరు అయిపోతే ఆ వ్యోమనౌకలో ఉపయోగించిన నీరు, పనికిరాని నీరు.. అంటే మూత్రము, చెమట, అక్కడి తేమను పట్టుకుని శుద్ధి చేసి ఆ నీటిని తిరిగి వాడుకుంటారు.
- డాక్టర్‌ సి.వి. సర్వేశ్వర శర్మ,  ప్రెసిడెంట్‌, కోనసీమ సైన్స్‌ పరిషత్‌, అమలాపురం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని