ఎంత పెద్ద గుండెనో..!

హలో నేస్తాలూ.. మనకు రకరకాల జంతువుల గురించి తెలుసు కదా! అయినా, తెలియనివి ఇంకా అనేకం ఉంటూనే ఉంటాయి.

Published : 16 Mar 2023 01:54 IST

హలో నేస్తాలూ.. మనకు రకరకాల జంతువుల గురించి తెలుసు కదా! అయినా, తెలియనివి ఇంకా అనేకం ఉంటూనే ఉంటాయి. ఈ భూమిపైన జీవించే వాటిలో అతిపెద్దది ‘బ్లూవేల్‌’ అని మీరు చదువుకొనే ఉంటారు. ఇప్పుడు దానికి సంబంధించిన ఇంకో విషయం తెలుసుకుందాం రండి..

ఎవరైనా మంచి పనులు చేస్తుంటే.. ‘అబ్బా.. వాళ్లది ఎంత పెద్ద హృదయమో.!’ అని అనుకుంటుంటాం. బ్లూవేల్‌ గుండె కూడా విశాలమైందే.. ‘అదెలా?’ అని ఆశ్చర్యపోకండి నేస్తాలూ.. పరిమాణంలో అన్నమాట. ఇటీవల వ్యాపారవేత్త హర్ష గొయెంకా.. భద్రపరిచిన ఓ బ్లూవేల్‌ గుండె ఫొటోను ట్విటర్‌లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. అది దాదాపు 181 కిలోల బరువు ఉంటుందట. అంతేకాదు.. 1.2 మీటర్ల వెడల్పు, 1.5 మీటర్ల ఎత్తుతో ఉండే దాని గుండె చేసే చప్పుడు 3.2 కిలోమీటర్ల దూరం వరకూ వినిపిస్తుందట. ఇంతకీ దాన్ని ఎక్కడ భద్రపరిచారో తెలియదు కానీ, అంత భారీ గుండెను చూసిన వారంతా అవాక్కవుతున్నారు. పోస్టు చేసిన కొద్ది సమయంలోనే ఆ ఫొటో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా ఆశ్చర్యపోతూ.. ‘ఈ ప్రకృతి ఎంతో గొప్పది. చిన్న చీమ నుంచి పెద్ద బ్లూవేల్‌ వరకూ అన్నీ అద్భుతాలే’ అని ఒకరు, ‘బాబోయ్‌..’ అంటూ మరొకరు ఇలా రకరకాల కామెంట్లు చేస్తున్నారు.  

అన్నీ విశేషాలే..

అడవులకు సింహం ఎలాగో.. సముద్రాలకు సాధారణంగా బ్లూవేల్స్‌ను రాజుల్లా పిలుస్తుంటారు. ఎందుకంటే.. వాటి అసాధారణ ఆకారం, ఇతర విశేషాలే అందుకు కారణం. ఇవి 100 అడుగుల వరకూ పొడవు పెరుగుతాయి. దాదాపు 30 ఏనుగులంత బరువు ఉంటాయి. కేవలం నాలుకే, ఏనుగంత పెద్దదిగా ఉంటుంది. భూమిపైనున్న జీవుల్లో బ్లూవేల్సే పెద్దవి కాబట్టి.. వాటి పిల్లలూ అంతే.. ఇంత బరువున్నా.. ఇవి సముద్ర జలాల్లో అత్యంత వేగంగా దూసుకెళ్లగలవట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని