నేను కుట్టని చీమనోచ్‌!

హాయ్‌.. నేస్తాలూ! నేనో చీమను. నేను అన్ని చీమల్లా కాదు. కాస్త వెరైటీ చీమను. నా బంగారు పుట్టలో వేలు పెట్టినా.. నేను కుట్టను గాక కుట్టను. అలా అని నన్ను మంచి చీమ అనుకునేరు! కానే

Published : 10 Jan 2022 00:07 IST

హాయ్‌.. నేస్తాలూ! నేనో చీమను. నేను అన్ని చీమల్లా కాదు. కాస్త వెరైటీ చీమను. నా బంగారు పుట్టలో వేలు పెట్టినా.. నేను కుట్టను గాక కుట్టను. అలా అని నన్ను మంచి చీమ అనుకునేరు! కానే కాదు. నేను అసలు నా పుట్టలో వేలు పెట్టే అవకాశమే ఇవ్వను మరి! ఎందుకో, ఎలానో తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ కథనం చదివేయండి.

నేను విషాన్ని చిమ్ముతాను. అవును.. నేను విషాన్ని చిమ్ముతాను. నిజానికి నేనొక్కదాన్నే కాదు. మాలో చాలా రకాలు ఇలానే చేస్తాయి. ఆఫ్రికాలో మేం ఎక్కువగా ఉంటాం. మామూలు చీమల మీద ఏదైనా దాడి జరిగితే అవి కుట్టడం ద్వారా ప్రతిఘటిస్తాయి. కానీ మేమైతే కుట్టడానికి బదులు ‘ఫార్మిక్‌ యాసిడ్‌’ను స్ప్రే చేస్తాం.

మీకు ఏం కాదు కానీ..

ఫార్మిక్‌ యాసిడ్‌ విషపూరితమే కానీ కొద్దిమొత్తంలో కాబట్టి మీకు ప్రాణాంతకం కాదు. కానీ కొన్ని చిన్న చిన్న జీవులు చనిపోతాయి. వాటి కళ్లలో ఈ యాసిడ్‌ పడితే వాటి కంటిచూపు పోతుంది. చర్మం కూడా మండిపోతుంది. ఇంకా మాలో ‘ఎల్లో క్రేజీ యాంట్స్‌’ అయితే మరీ ప్రమాదకరం. ఇవి మరింత క్రూరంగా ఫార్మిక్‌ యాసిడ్‌ను స్ప్రే చేస్తాయి.

ఆ.. ఏముందిలే అనుకోవద్దు!

‘ఏంటీ.. చిన్న చిన్న చీమలు యాసిడ్‌ స్ప్రే చేస్తే ఏమవుతుందిలే!’ అని మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దు. ఎందుకంటే మేం వందలు, వేల సంఖ్యలో గుంపులు, గుంపులుగా ఉంటాం. మేం అంతా ఒకేసారి విషాన్ని స్ప్రే చేస్తే... నేల వర్షిస్తోందా..? అన్నట్లు ఉంటుంది. అందుకే మా గురించి తెలిసిన ఏ జీవులూ మా జోలికి రావు. మా పుట్ట జోలికి అసలే రావు! సరే ఫ్రెండ్స్‌.. ప్రస్తుతానికి ఇవే విశేషాలు. ఇక ఉంటా మరి బై.. బై..!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని