జయహో... జియా!

జియా రాయ్‌. వయసు పదకొండేళ్లు. ఇప్పుడు ఆరో తరగతి చదువుతోంది. ఊరు ముంబయి. జియా అందరిలా మాట్లాడలేదు. ఎవరితోనూ సరిగ్గా కలవదు. ఏం చెప్పినా ఆమెకు అర్థం కాదు. ఆ చిన్నారి ఆటిజంతో బాధపడుతోంది. సంజ్ఞలతోనే మాట్లాడుతుంది....

Published : 04 Mar 2020 00:51 IST

* ఎవరీ అమ్మాయి?

జియా రాయ్‌. వయసు పదకొండేళ్లు. ఇప్పుడు ఆరో తరగతి చదువుతోంది. ఊరు ముంబయి. జియా అందరిలా మాట్లాడలేదు. ఎవరితోనూ సరిగ్గా కలవదు. ఏం చెప్పినా ఆమెకు అర్థం కాదు. ఆ చిన్నారి ఆటిజంతో బాధపడుతోంది. సంజ్ఞలతోనే మాట్లాడుతుంది.
*  మరి మన పేజీలోకి ఎందుకొచ్చింది?
ఈ చిన్నారి ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా  14 కిలోమీటర్ల దూరం సముద్రంలో వేగంగా ఈదింది. ప్రపంచ రికార్డు కొల్లగొట్టింది.
*  ఏదీ సరిగ్గా నేర్చుకోలేని అమ్మాయి... ఈత ఎలా నేర్చుకుందనే కదా మీ సందేహం?
జియా మాటలు రాకపోయినా చిన్నప్పటి నుంచి ఎంతో అల్లరి చేసేది. ఒక్కచోట స్థిరంగా ఉండేది కాదు. హైపర్‌ యాక్టివ్‌ అన్నమాట. దీన్ని తగ్గించడానికే డాక్టర్లు ఈత తరగతులకు పంపించండి అని సలహా ఇచ్చారు. ఇలా చేస్తే ఈ అమ్మాయి శక్తి మొత్తం ఖర్చయ్యి అల్లరి తగ్గుతుందని చెప్పారు. అలా రెండున్నరేళ్ల వయసులో ఈత తరగతుల్లో చేరింది. సంవత్సరంలోనే ఈతలో నేర్పరిగా మారింది.
* మరేమైనా పోటీల్లో పాల్గొనేదా?
2014 నుంచే పాఠశాలలో జరిగే పోటీల్లో పాల్గొనేది. పతకాలూ సాధించేది. కేవలం నెల రోజుల్లోనే ఎంతో కష్టమైన బటర్‌ఫ్లై టెక్నిక్‌ నేర్చుకుంది. ఇది జియా నాన్నకు నేర్చుకోవడానికి రెండేళ్లు పట్టింది. ఆయన నేవీలో అధికారి. జియా నైపుణ్యం చూసే ఆ అమ్మాయిని పెద్ద పెద్ద పోటీలకు పంపించాలని ఆయన నిర్ణయించుకున్నాడు. రోజూ వ్యాయామం, రెండున్నర గంటల ఈత సాధన చేయించేవాడు. ఎంతో బుద్ధిగా వీటన్నింటినీ చేసేదా చిన్నారి. 2017 నుంచి ఏటా ఓపెన్‌ వాటర్‌ స్విమ్మింగ్‌ పోటీల్లో పాల్గొంటోంది. ఇవి మహారాష్ట్రలోని మాల్వాన్‌లో జరుగుతాయి. కిలో మీటర్‌ దూరం ఈదాల్సి ఉంటుంది. మొదటి రెండు పోటీల్లో నెగ్గకపోయినా 2019లో మాత్రం పసిడి పట్టింది. పోర్‌బందర్‌లో నేషనల్‌ సీ వాటర్‌ స్విమ్మింగ్‌ పోటీలు జరిగాయి. ఇందులో అయిదు కిలో మీటర్లు ఈదాలి. వీటికి జియాను నిరాకరించారు. ఎందుకంటే అక్కడ 14 ఏళ్లు దాటిన వాళ్లే అర్హులు. అప్పటికీ ఆ చిన్నారికి పదేళ్లే. అయినా జియా తండ్రి పట్టుబట్టడంతో ప్రత్యేకంగా అనుమతించారు అధికారులు. అంతేకాదు... అందులో అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్న మహామహులను ఓడించి విజేతగా నిలిచింది. ఈ ఏడాది జనవరిలో జరిగిన నేషనల్‌ సీ స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో రెండు బంగారు పతకాలు అందుకుంది.
*  మరి ప్రపంచ రికార్డు ఎలా సాధించింది?
ఇలాగే ఒకసారి సునాయసంగా 12 కిలోమీటర్లు నాలుగు గంటల్లో ఈదింది. దీంతో పోయిన సంవత్సరం జూన్‌ నుంచి రోజూ మూడున్నర గంటలు సాధన చేసేది. గంటసేపు వ్యాయామం. ఇలా ఆత్మవిశ్వాసంతోనే ఉవ్వెత్తున ఎగిసిపడే అలలకు ఎదురుగా, చేపపిల్లలా 14 కిలోమీటర్లు దూసుకెళ్లింది. ముంబయిలోని రాయ్‌ ఎలిఫెంటా ద్వీపం నుంచి గేట్‌వే ఆఫ్‌ ఇండియా వరకు 3 గంటల 27 నిమిషాల్లోనే చేరుకుంది. దీంతో ఈ ఘనత సాధించిన ప్రత్యేక అవసరాలున్న మొదటి చిన్నారిగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. వేగంగా ఈదిన చిన్నారిగానూ చరిత్ర లిఖించింది. ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, ఆసియా బుక్‌,  లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లోనూ చోటు సంపాదించింది. గ్రేటే కదూ!

- అక్కల మనోజ్‌

 

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని