చూడకుండా.. చదరంగం ఆడేస్తూ..

చదరంగం.. అదేనండి.. చెస్‌ ఆడాలంటేనే చాలాకష్టం! ఆ గడులు.. ఆ ఎత్తులు.. అబ్బో బోలెడంత ఏకాగ్రత కావాలి.

Updated : 15 Sep 2020 01:03 IST

చదరంగం.. అదేనండి.. చెస్‌ ఆడాలంటేనే చాలాకష్టం! ఆ గడులు.. ఆ ఎత్తులు.. అబ్బో బోలెడంత ఏకాగ్రత కావాలి. మాములుగానే ఈ ఆటలో విజయం సాధించాలంటే ఎంతో ప్రావీణ్యం, నేర్పు ఉండాలి. అలాంటిది.. కళ్లకు గంతలు కట్టుకుని ఆడి గెలవాలంటే.. చాలా కష్టం కదూ.. కానీ ఓ చిన్నారి ఆడటమే కాదు.. అవార్డులూ సాధిస్తోంది. ఆమెను మన చిన్నూ ఇంటర్వ్యూ కూడా చేశాడంట. ఆ విశేషాలేంటో తెలుసుకుందామా?

చిన్ను: హాయ్‌! శ్రీలిఖితా అన్నపూర్ణ.. బాగున్నావా? మీ అమ్మానాన్న, మీరు ఉండేది ఎక్కడ?
* అమ్మ సాయిప్రియ, నాన్న రవికిషోర్‌. మేము హైదారాబాద్‌లోని కొత్తపేట సమీపంలో న్యూ మారుతీ నగర్‌లో ఉంటాం. ఎనిమిదో తరగతి చదువుతున్నా.

చిన్ను: నీకు చెస్‌పై ఆసక్తి ఎలా కలిగింది?  
* చిన్నప్పటి నుంచే నాకు చెస్‌ అంటే ఇష్టం. మొదట్లో పద్మజ మేడమ్‌ దగ్గర నేర్చుకున్నా. ఏడాదిన్నరకాలంగా సంపత్‌ సర్‌ కోచింగ్‌ ఇస్తున్నారు.
చిన్ను: కళ్లకు గంతలు కట్టుకుని ఆడాలని ఆలోచన ఎలా వచ్చింది?

* ఓ సారి యూట్యూబ్‌లో ఒక వీడియోలో చూశా.. కళ్లకు గంతలు కట్టుకుని చెస్‌ ఆడటం. అప్పటి నుంచీ నేనూ ప్రయత్నించా. ఆర్నెళ్లు చాలా సీరియస్‌గా ప్రాక్టీస్‌ చేశా.
చిన్ను: ఇంటర్నేషనల్‌ వండర్‌ రికార్డ్స్‌ అవార్డు ఎలా సంపాదించావు?
* మొన్న ఆదివారం హైదర్‌గూడలో ఓ సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళ్లు మూసుకుని 40 సెకన్లలోనే చెస్‌బోర్డుపై ఇరువైపులా సైన్యాన్ని అమర్చాను. ఇదే ఫీట్‌ను కళ్లు తెరిచి 32 సెకన్లలో చేశా. దీంతో ఇంటర్ర్నేషనల్‌ వండర్‌ రికార్డ్స్‌ అవార్డు వచ్చింది.
చిన్ను: భవిష్యత్తులో ఏ సాధించాలనుకుంటున్నావు?
* నేను ఇప్పటికే జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో గెలుపొంది పలు బహుమతులు సొంతం చేసుకున్నా. భవిష్యత్తులో గొప్ప చెస్‌ క్రీడాకారిణిగా పేరు సాధించాలనేదే నా లక్ష్యం.
చిన్ను: ఆల్‌ ది బెస్ట్‌ మరి!

- న్యూస్‌టుడే, నాగోలు, నాంపల్లి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని