ఓటమే దేవిని ఛాంపియన్‌ చేసింది!

పిల్లలూ.. మనం పరీక్షలు సరిగా రాయకపోయినా, ఏదైనా ఆటలో ఓడిపోయినా చాలా బాధపడతాం కదాం. ఆ బాధ నుంచి అంత త్వరగా బయటపడలేం.

Updated : 13 Feb 2021 01:18 IST

పిల్లలూ.. మనం పరీక్షలు సరిగా రాయకపోయినా, ఏదైనా ఆటలో ఓడిపోయినా చాలా బాధపడతాం కదాం. ఆ బాధ నుంచి అంత త్వరగా బయటపడలేం. కానీ, ఓ బాలిక మాత్రం అలా బాధపడుతూ కూర్చోలేదు. ఓటమి ఇచ్చిన భయం నుంచే ఛాంపియన్‌గా నిలిచింది. ఇంతకీ ఆమె ఎవరో, ఆ విశేషాలేంటో తెలుసుకుందామా..!!
హైదరాబాద్‌కు చెందిన దేవి ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతోంది. చిన్నతనం నుంచి పాఠశాలలో జరిగే ఏ కార్యక్రమానికైనా, ఆటల పోటీకైనా ముందుండేది. అదే ఉత్సాహంతో ‘టీసీఎస్‌ అయాన్‌ ఇంటెలిజెమ్‌
sTCS iON IntelliGemz’ పేరిట టీసీఎస్‌ సంస్థ దేశవ్యాప్తంగా ఏటా నిర్వహించే పోటీల్లోనూ పాల్గొన్న దేవి  ఛాంపియన్‌గా నిలిచింది.

గతేడాది ఓడిపోయినా..

టీసీఎస్‌ సంస్థ గతేడాది నిర్వహించిన ఇవే పోటీల్లోనూ దేవి పాల్గొంది. కానీ, ఫైనల్స్‌ వరకు వెళ్లలేకపోయింది. తను ఎందుకు విజేతగా నిలవలేకపోయానో కారణం తెలుసుకునేందుకు న్యాయనిర్ణేతలతో మాట్లాడింది. ప్రశ్నలకు జవాబులు చెప్పే సమయంలో తడబడటం, భయపడుతూ పోటీలో పాల్గొన్నట్లు వారు ఆమె లోపాలను వివరించారు. దాని ద్వారా తను ఎక్కడ వెనకబడిపోయానో గుర్తించింది. అందుకు తగినట్లు సన్నద్ధమై.. ఈసారి ఆన్‌లైన్‌ వేదికగా జరిగిన పోటీలకు ధైర్యంగా హాజరైంది.

ఏదో ఒక అంశంపై..

ఈ ఏడాది 27 రాష్ట్రాల నుంచి 180 నగరాలకు చెందిన విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు. వారిలో 50 మంది ఫైనల్‌కు చేరుకోగా.. అందులో దేవి ఒకరు. ఫైనల్‌కు వచ్చిన వారు నిర్వాహకులు ఇచ్చే అయిదు అంశాల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. వాటిలో దేవి.. గ్లోబల్‌ సిటిజన్‌షిప్‌, యూనివర్సల్‌ వాల్యూస్‌, క్రియేటివిటీ అండ్‌ ఇన్నోవేషన్‌ అనే మూడు అంశాలను ఎంపిక చేసుకుంది. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలు, మనుషులు, అక్కడి సంస్కృతి, సంప్రదాయలు, హక్కులకు సంబంధించిన విషయాలు ఉండే ‘యూనివర్సల్‌ వాల్యూస్‌’ విభాగంలో 14 ఏళ్ల దేవి ఛాంపియన్‌గా నిలిచింది. బోలెడు పుస్తకాలు చదివి, ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేసి పోటీలోని అంశాలపై అవగాహన పెంచుకుందట. భవిష్యత్తులో శాస్త్రవేత్తగా స్థిరపడి.. ఆరోగ్య రంగంలో ప్రజలకు మెరుగైన సేవలు అందేలా కృషి చేస్తానని ఆమె చెబుతోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని