వయసు నాలుగు.. అవార్డులు మూడు!

రకరకాల బొమ్మలతో ఆడుకుంటూ.. అల్లరి చేయాల్సిన వయసులోనే ఓ బాబు రికార్డులు సాధిస్తున్నాడు. తన అద్భుత జ్ఞాపకశక్తితో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇంతకీ అతడెవరో, ఏమేం సాధించాడో తెలుసుకుందాం..!!

Updated : 18 Feb 2021 05:37 IST

రకరకాల బొమ్మలతో ఆడుకుంటూ.. అల్లరి చేయాల్సిన వయసులోనే ఓ బాబు రికార్డులు సాధిస్తున్నాడు. తన అద్భుత జ్ఞాపకశక్తితో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఇంతకీ అతడెవరో, ఏమేం సాధించాడో తెలుసుకుందాం..!!

హైదరాబాద్‌లోని వెస్ట్‌మారేడుపల్లికి చెందిన ఆశిష్‌జైన్‌ పోకర్ణ-నేహాజైన్‌ల కుమారుడు వియాన్‌. నాలుగేళ్ల వియాన్‌కు అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉంది. ప్రస్తుతం ఎల్‌కేజీ చదువుతున్న అతడు రెండున్నరేళ్ల వయసులో టీవీలో ఓ పాటను చూశాడు. కొద్దినెలల తర్వాత అదే పాటను ఓ శుభకార్యంలో పాడాడు. తాను ఆ పాటను ఒక్కసారే టీవీలో చూసినట్లు తల్లిదండ్రులకు చెప్పి వారిని ఆశ్చర్యపరిచాడు.
తల్లిదండ్రుల ప్రోత్సాహం
వియాన్‌ జ్ఞాపకశక్తిని గుర్తించిన తల్లిదండ్రులు.. దేశంలోని వివిధ రాష్ట్రాలు, వాటి రాజధానుల పేర్లు నేర్పడం ప్రారంభించారు. అతి తక్కువ సమయంలోనే నేర్చుకున్న అంశాలను బాబు అప్పజెప్పేవాడు. కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వియాన్‌ ప్రతిభను తల్లిదండ్రులు ఏవైనా రికార్డు పుస్తకాల్లో నమోదు చేయించాలని అనుకున్నారు. ముందుగా అందుకు తగినట్లుగా కుమారుడిని సిద్ధం చేశారు.
మూడో ఏట తొలి రికార్డు
2019లో వియాన్‌ కేవలం 27 సెకన్లలోనే దేశంలోని వివిధ రాష్ట్రాలు, వాటి రాజధానుల పేర్లు చెప్పి ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోకి ఎక్కాడు. అప్పుడు అతడి వయసు మూడేళ్లు మాత్రమే. అనంతరం అదే సంవత్సరంలో 62 సెకన్లలో ఆసియా ఖండంలోని దేశాలు, వాటి రాజధానుల పేర్లను చెప్పి ‘ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో స్థానం సంపాదించాడు. ఇటీవల ప్రపంచంలోని వివిధ దేశాలు, వాటి రాజధానుల పేర్లను కేవలం 2 నిమిషాల 5 సెకన్లలో చెప్పి ‘ఇంటర్నేషనల్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లోనూ గుర్తింపు దక్కించుకున్నాడు. అంతేకాదండోయ్‌.. చిన్నారి పేరిట ఓ యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించిన తల్లిదండ్రులు.. తమ కుమారుడి ప్రతిభ, సరదా విశేషాలను వీడియోల రూపంలో ఎప్పటికప్పుడు అందులో అప్‌లోడ్‌ చేస్తున్నారట. ఇప్పుడే ఇన్ని రికార్డులు సాధించిన వియాన్‌.. భవిష్యత్తులో మరింత గుర్తింపు సాధించాలని మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దాం..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని