నల్లమల నుంచి హిమాలయాలకు యాత్ర

మనం ఉదయం బడికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేసరికే అలసిపోతాం.. అయిదారు రోజులు ఏదైనా ఊరికి వెళ్తే మళ్లీ

Updated : 25 Feb 2021 00:33 IST

మనం ఉదయం బడికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చేసరికే అలసిపోతాం.. అయిదారు రోజులు ఏదైనా ఊరికి వెళ్తే మళ్లీ ఎప్పుడు తిరిగి ఇంటికి వెళ్తామా అని ఎదురుచూస్తుంటాం.. కొద్దిసేపు అమ్మ కనిపించకపోతే తల్లడిల్లిపోతాం.. అలాంటిది కొందరు విద్యార్థులు ఇళ్లు, సొంతూరు దాటి.. దాదాపు 150 రోజుల పాటు యాత్రకు బయలుదేరారు. ఇంతకీ వారెవరో, ఎక్కడి వారో, ఎక్కడికెళ్తున్నారో తదితర విశేషాలు తెలుసుకుందాం..!!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులో దట్టమైన నల్లమల అడవులు విస్తరించి ఉన్నాయి. ఆ ప్రాంతంలోని శ్రీశైలం టైగర్‌ రిజర్వు ఏరియాకు చెందిన 21 మంది గిరిజన విద్యార్థులు సాహసయాత్రకు బయలుదేరారు. ఒకటో రెండో కాదు నల్లమల అడవుల నుంచి హిమాలయాల వరకు ఏకంగా 9 వేల కిలోమీటర్లు సాగే యాత్ర ఇది.
చదువుపై ఆసక్తి తగ్గకుండా..
నల్లమల అటవీ ప్రాంతానికి చెందిన విద్యార్థులకు అసలు బయటి ప్రపంచమే తెలియదు. వారిలో దాదాపు ఏ ఒక్కరూ పెద్ద పెద్ద భవంతులు చూడలేదు.. ట్రాఫిక్‌ జాం, హైవేలాంటి పదాలు వినలేదు. లాక్‌డౌన్‌ వల్ల అందరిలాగే నల్లమలలోని గిరిజన విద్యార్థులూ ఇంటికే పరిమితమయ్యారు. వారికి చదువుపై ఆసక్తి తగ్గకుండా, చెడు వ్యసనాలకు అలవాటు పడకుండా చూడాలని హైదరాబాద్‌కు చెందిన ఓ శిక్షకుడు ఏదైనా సాహసం చేయించాలని అనుకున్నాడు. ఆయన తరచూ ఇటువంటి కార్యక్రమాలు చేపడుతుండటంతో ఈసారి గిరిజన విద్యార్థులతో హిమాలయాల వరకు యాత్ర చేపట్టాలని నిర్ణయించాడు. వీరి ప్రయాణం మూడు రోజుల కిందటే హైదరాబాద్‌లో ప్రారంభమైంది.  
ఎంపిక చేసిన వారినే..
యాత్ర అనగానే ‘నేనొస్తా.. నేనొస్తా’నని అంతా అంటాం.. కానీ, ఈ యాత్ర సాహసంతో కూడుకున్నది. కొంతదూరం నడక, మరికొంత దూరం సైకిల్‌పై సాగే ఈ కార్యక్రమంలో ప్రాథమిక పరీక్ష ఆధారంగా కొందరినే ఎంపిక చేశారు. వారిలో 15మంది విద్యార్థులు, ఆరుగురు విద్యార్థినులు ఉన్నారు. దాదాపు 150 రోజుల పాటు 15 రాష్ట్రాలు, 74 జిల్లాల మీదుగా ఈ యాత్ర సాగనుంది.
మధ్యలో శిక్షణ కార్యక్రమాలకూ..
యాత్రలో భాగంగా విద్యార్థులు వివిధ అంశాలపై మనాలి, లద్ధాఖ్‌, గోవాలో జరగనున్న శిక్షణ తరగతులకు కూడా హాజరవుతారంట. రాబోయే రోజుల్లో అథ్లెటిక్స్‌లో ప్రతిభ చూపి ఒలింపిక్స్‌లో పాల్గొని దేశానికి గర్వకారణంగా నిలుస్తామని చెబుతున్నారీ విద్యార్థులు. వారి యాత్ర సాఫీగా సాగి.. భవిష్యత్తులో మరింత ఘనత సాధించాలని మనమూ ఆల్‌ ది బెస్ట్‌ చెప్పేద్దాం..!!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని